University Grants Commission: విద్యార్థులు ఏబీసీ ఐడీలు క్రియేట్ చేయాలి
రాజానగరం: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాల ప్రకారం విద్యార్థులందరూ అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబీసీ) ఐడీ క్రియేట్ చేయడం తప్పనిసరని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె.పద్మరాజు అన్నారు. వర్సిటీ అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్, కార్యదర్శులు, కరస్పాండెంట్లతో శుక్రవారం నిర్వహించిన ఆన్‌లైన్ సదస్సులో ఏబీసీపై ఆయన అవగాహన కలిగించారు. అకడమిక్ ఖాతాదారులుగా విద్యార్థులకు ఏబీసీ క్రెడిట్ వెరిఫికేషన్, క్రెడిట్ అక్యుములేషన్, క్రెడిట్ ట్రాన్స్‌ఫర్/రిడెంప్షన్, అకడమిక్ అవార్డుల ప్రామాణీకరణ సహా పలు రకాల సేవలు అందిస్తుందని వివరించారు. రిసోర్స్ పర్సన్, నేషనల్ అకడమిక్ డిపోజిటరీ – అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ జోనల్ కో ఆర్డినేటర్ రవి పాండే మాట్లాడుతూ, డిజీ లాకర్ ద్వారా డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో ఏవిధంగా భద్రపరచుకోవచ్చు, అధికారికంగా ఏవిధంగా ఉపయోగించుకోవచ్చనే విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. వర్సిటీలు, కళాశాలల విద్యార్థులు ఎక్కువ మందికి ఏబీసీ పోర్టల్ ద్వారా వ్యక్తిగత ఐడీలు క్రియేట్ చేయడంపై అవగాహన కలిగించారు. విద్యార్థులు, విద్యాసంస్థలు సాధించిన క్రెడిట్‌లను ఏబీసీ బ్యాంక్‌లోకి ఏవిధంగా అప్‌లోడ్ చేయవచ్చో వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్, అధ్యాపకులు పాల్గొన్నారు.
Govt College: చదువు పూర్తయ్యేసరికి ఉద్యోగం
‘నన్నయ’కు అధికారికంగా ‘న్యాక్’
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) నుంచి అధికారికంగా ధ్రువీకరణ పత్రం వచ్చింది. వీసీ ఆచార్య పద్మరాజు ఈ విషయం తెలిపారు. వర్సిటీకి గత ఏడాది నవంబర్‌లో న్యాక్ బి గుర్తింపును ప్రకటించిన సంగతి విదితమే. ఎనిమిది నెలల అనంతరం న్యాక్ కార్యాలయం నుంచి సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని పంపించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ, బి గుర్తింపు రావడం హర్షణీయమే, అయినప్పటికీ ఇంకా మంచి గ్రేడ్ పొందేందుకు ఇప్పటి నుంచే అందరూ కృషి చేయాలని అన్నారు. గతంలో పని చేసిన న్యాక్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.