Skip to main content

TSRTC: ఇకపై జీన్స్, టీషర్ట్స్‌ వేసుకురావొద్దు.. ఆర్టీసీ కీలక ఆదేశాలు

TSRTC TSRTC New Rules   Staff following dress code guidelines  Formal dress for work at RTC

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ అధికారులు, వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్‌ ప్యాంట్లు, టీ షర్టులు ధరించి విధులకు హాజరు కావొద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ సంస్థ ఎండీ సజ్జనార్‌ అభిప్రాయపడ్డారు. ఇక నుంచి విధుల్లో ఆ తరహా వస్త్రధారణ కూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.
 

డ్రైవర్లు, కండక్టర్లకు ’ఖాకీ’.. మిగిలిన వాళ్లు ఇష్టమొచ్చినట్టుగా!
ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ డ్రెస్‌లో కనిపిస్తారు.. బస్టాపులు, బస్టాండ్లలో ఉండే సూపర్‌వైజర్లు తెల్లరంగు దుస్తుల్లో ఉంటారు.. కానీ, డిపోలు, ఇతర ఆర్టీసీ కార్యాలయాల్లో ఉండే అధికారులకు యూనిఫాం అంటూ లేదు. డ్రెస్‌ కోడ్‌ కూడా లేకపోవటంతో ఇంతకాలం క్యాజువల్‌ వస్త్రధారణ తో విధులకు హాజరవుతున్నారు. దీన్ని పెద్దగా పట్టించుకునేవారు లేకపోవటంతో, రంగురంగుల డ్రెస్సులు, జీన్స్‌ ప్యాంట్లు, టీ షర్డులు ధరించి వస్తున్నారు.

కొందరు ఉన్నతాధికారులు కూడా ఈ తరహా వస్త్రధారణతో విధుల్లో కనిపిస్తున్నారు. తాజాగా దీన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తీవ్రంగా పరిగణించారు. ఇటీవల ఆయన తరచూ అధికారులతో గూగుల్‌ సమావేశాలు నిర్వహిస్తు న్నారు. కొన్ని సందర్భాల్లో డిపో స్థాయి సిబ్బందితో కూడా ఆన్‌లైన్‌ సమావేశాల్లో ముచ్చటిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులు మొదలు డిపో స్థాయి సిబ్బంది వరకు జీన్స్‌ ప్యాంట్లు, టీ షర్టుల్లో కనిపిస్తున్నారు. ఇది ఆయనకు చికాకు తెప్పించింది.

ఫార్మల్‌ డ్రెస్సుల్లోనే రావాలని ఆదేశాలు
దేశంలోనే పేరున్న రవాణా సంస్థలో ఇలా ఇష్టం వచ్చిన వస్త్రధారణతో అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొనటాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదే విషయాన్ని ఆయన ఈడీ ‘అడ్మిన్‌) దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు తాజాగా ఈడీ (అడ్మిన్‌) లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. సంస్థకు ఉన్న పేరు, డిపో కార్యాలయాల గౌరవానికి వారి డ్రెస్సింగ్‌ భంగంగా ఉందంటూ ఆయన అందులో అభిప్రాయపడ్డారు. ఇక నుంచి గౌరవప్రదంగా ఉండే ఫార్మల్‌ డ్రెస్సుల్లోనే అధికారులు విధుల్లో కనిపించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆయా అధికారుల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు.

Karnataka 10th Class Results: టెన్త్‌ ఫలితాల్లో రైతు కుమార్తెకు 625/625 మార్కులు.. రిషబ్‌ శెట్టి అభినందనలు

 

యూనిఫాంలో కనిపించని స్పష్టత
ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫాంలో కనిపిస్తారు. కొన్ని బస్సుల్లో నీలి రంగు యూనిఫాం ఉంటోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించింది. ఆర్టీసీలో అతిపెద్ద సమ్మె విరమణ తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో సిబ్బంది యూనిఫాంపై ప్రస్తావించారు. మహిళా కండక్టర్లకు యాప్రాన్‌ అందజేస్తామని చెప్పి..  ఆ యాప్రాన్‌ ఏ రంగులో ఉండాలో నిర్ధారించేందుకు ఓ కమిటీ వేశారు.

రెండు మూడు సమావేశాలు నిర్వహించిన తర్వాత, మెరూన్‌ రంగులో ఉండే యాప్రాన్‌ను సిఫారసు చేశారు. ఆ మేరకు ఓ ప్రముఖ కంపెనీకి వస్త్రం కొనుగోలు ఆర్డర్‌ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ యాప్రాన్‌ కూడా కనిపించటం లేదు. డ్రైవర్లు, కండక్టర్లకు యూనిఫాం కూడా కొన్నేళ్లపాటు సరఫరా కాలేదు. వారికి ఖాకీ బదులు మరో రంగు ఇవ్వాలన్న అంశం కూడా తెరమరుగైంది.

Published date : 11 May 2024 05:02PM

Photo Stories