TS 10th Class Exams: పదో తరగతి పరీక్షలు ప్రారంభం, పకడ్బందీగా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయమే పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులను పరీక్ష సమయానికి సెంటర్‌లోకి అనుమతించారు. 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. ఇక, ఏప్రిల్ రెండో తేదీ వరకూ జరిగే పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు కొనసాగుతాయి.
అయితే ఈనెల 26, 27 తేదీల్లో జరిగే ఫిజిక్స్, బయాలజీ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకే ఉంటాయి. నిర్ణీత పరీక్ష సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఇప్పటికే డీఈవోలకు, సీఎస్‌లకు ఆదేశాలు జారీ చేశారు.
కాగా, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. గతేడాది వరంగల్‌లో జరిగిన ఘటన నేపథ్యంలో.. ఈసారి పరీక్ష కేంద్రాల సిబ్బందితో పాటు, తనిఖీలకు వచ్చే అధికారులు, స్క్వాడ్స్ కూడా ఫోన్లను బయటపెట్టేలా ఆదేశాలు జారీ చేశారు.