AP NIT: నిట్‌లో టెక్రియ వేడుకల ప్రారంభం
తాడేపల్లిగూడెం: వినూత్న పరిశోధనలతో నవశకానికి నాంది పలకాలని నిట్ రిజిస్ట్రార్ దినేష్ పి.శంకరరెడ్డి కోరారు. ఏపీ నిట్‌లో టెక్రియ– 2023 వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్ మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెడితే అద్భుత ఆవిష్కరణలు సాధ్యమవుతాయన్నారు. పరిశోధనలు దేశానికి దిక్సూచీ వంటివన్నారు. సాంకేతిక రంగంలో ప్రపంచంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. ప్రతిభ, సృజనాత్మకత కలిగిన విద్యార్థులకు తగిన గుర్తింపు, డిమాండ్ ఉంటుందన్నారు. విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహను పెంచడానికి టెక్రియా వంటి కార్యక్రమాలను నిట్ నిర్వహిస్తోందన్నారు. సమాజ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు కొత్త ప్రాజెక్టులు, ఆవిష్కరణలు చేసి దేశఖ్యాతిని, విద్యనభ్యసిస్తున్న సంస్థ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలన్నారు.
చదవండి: Govt and Private Schools: సజావుగా ‘సీస్’ పరీక్ష
ఆకట్టుకున్న ప్రాజెక్టులు
ఇటీవల దేశఖ్యాతిని ప్రపంచానికి చాటిన చంద్రయాన్, సాంకేతిక విప్లవంలో భాగంగా క్షేత్రస్థాయిలో అందుబాటులోకి వచ్చిన డ్రోన్ టెక్నాలజీ, ఇతర టెక్నాలజీలపై విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వీటిని రిజిస్ట్రార్, తదితర అధికారులు పరిశీలించారు. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ జీబీ వీరేష్‌కుమార్, డీన్‌లు ఎన్.జయరామ్, టి.కురుమయ్య, వి.సందీప్, టి.రమేష్, కిరణ్ తీపర్తి, తపస్ రేష్మా, హిమబిందు, సుదర్శన్ దీప, ప్రోగ్రామ్ సెక్రటరీ జకీర్ ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు.