Skip to main content

Government School Students: స్కూల్‌ డ్రెస్‌ ఏదీ?

students in government schools have not received uniforms

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నేటికీ యూనిఫామ్స్‌ అందలేదు. పాఠశాలలు తెరిచిన తొలిరోజే పుస్తకాలతో పాటు యూనిఫామ్స్‌ను పిల్లల చేతికి ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. దీనికి అనుగుణంగా కావాల్సిన వస్త్రాన్ని వేసవి సెలవులకు ముందే జిల్లాలకు చేరవేశారు. అయితే జిల్లా విద్యాశాఖకార్యాలయ అధికారులకు సమన్వయం లేక, ఇష్టారీతిగా ఏజెన్సీలకు కట్టబెట్టడంతో ఇప్పటికీ అందించలేకపోయారు. ఈ పరిస్థితిపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నారాయణపేట రూరల్‌: జిల్లా వ్యాప్తంగా 22 ప్రభుత్వ, 478 లోకల్‌బాడీ (జెడ్పీ, మండల పరిషత్‌), రెండు ఎయిడెడ్‌, 11 కేజీబీవీ, రెండు మాడల్‌ స్కూల్‌లతో కలిపి 515 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 32,745మంది బాలురు, 34,739మంది బాలికలతో కలిపి 67,484మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ఏటా ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫామ్స్‌ కుట్టి అందిస్తుంది. బాలురకు రెండు ప్యాంట్లు, రెండు షర్టులు, బాలికలకు చుడిదార్‌ రెండు జతలు ఇస్తారు. దీనికిగాను గత ఏప్రిల్‌లోనే అవసరమైన బట్టను జిల్లా కేంద్రాలకు పంపింది.

టెండర్‌, నోటిఫికేషన్‌ లేకుండానే..
ప్రభుత్వ కార్యాలయంలో ఏ పనికై నా తప్పనిసరిగా నోటిఫికేషన్‌ ఇవ్వాలి. దీనికి సంబంధించి టెండర్‌ కాల్‌ ఫర్‌ చేయాలి. అలాంటిది ఏమీ లేకుండానే తమకు కావాల్సిన ఏజెన్సీలకు కట్టబెట్టారు. వాస్తవానికి ప్రభుత్వ లక్ష్యం మేరకు విద్యార్థుల యూనిఫామ్స్‌ కుట్టడానికి వారు చదువుతున్న పాఠశాల ఏ ప్రాంతంలో ఉంటే అక్కడి స్థానికులకే ఇవ్వాలి. కానీ ఇక్కడ మాత్రం గ్రామం, మండలం దాటి ఇతర జిల్లా వారికి అప్పగించారు. ప్రభుత్వం నుంచి యూనిఫామ్స్‌కు సంబంధించిన ప్రొసీడింగ్‌ వచ్చిన వెంటనే గతంలో కుట్టిన ఏజెన్సీ నిర్వాహకులు డీఈఓ కార్యాలయంలో సంబంధిత సెక్షన్‌ ఇన్‌చార్జ్‌ని కలుసుకున్నారు. దీంతో వారికే ఒక్కొక్కరికీ రెండు, మూడు మండలాలు కేటాయించి వస్త్రాన్ని అప్పగించారు. దీనిపై స్థానిక దర్జీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. యూనిఫామ్స్‌ విభాగం చూసే సెక్టోరియల్‌ అధికారి మారడంతో ఒకరిపై మరొకరు నెట్టుకుని తప్పించుకుంటున్నారు.

APSCHE: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

15శాతం యూనిఫామ్స్‌ పూర్తి..
జిల్లాకు సంబంధించి 67,484మంది విద్యార్థులకు యూనిఫామ్స్‌ అందించడానికి 3,24,619 మీటర్ల వస్త్రాన్ని ప్రభుత్వం ఏప్రిల్‌లోనే సరఫరా చేసింది. దీన్ని ఇష్టారీతిగా ఏజెన్సీలకు కట్టబెట్టడంతో వారు ఒకటికి రెండు జిల్లాల్లో పనులు పొంది కుట్టడంలో ఆలస్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజుకు ధన్వాడ, దామరగిద్ద, మక్తల్‌ మండలాలకు చెందిన స్కూల్స్‌, ప్రహ్లాద్‌కు కోస్గి, కృష్ణా, మద్దూర్‌ మండలాలు, సౌధామినికి మరికల్‌, నర్వ, బాలుకు నారాయణపేట, ఊట్కూర్‌ మండలాలు కేటాయించారు. మాగనూర్‌ మండలం మాత్రం డీఆర్‌డీఏ (మహిళా సంఘాలకు) కేటాయిస్తే వారు సైతం ప్రహ్లాద్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇలా ఇష్టారీతి కేటాయింపులతోనే యూనిఫామ్స్‌ రాలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇప్పటివరకు కుట్టాల్సిన యూనిఫామ్స్‌లో 15శాతం మాత్రమే కుట్టడం పూర్తికాగా, ఒక్కొక్కరికీ రెండు జతలు ఇవ్వాల్సిన చోట ఒక్కొక్కటి అందించి వాటిని 30శాతం మంది విద్యార్థులకు సరిపెట్టారని తెలుస్తోంది.

సమస్యను అధిగమిస్తాం..
జిల్లాలో యూనిఫామ్స్‌ పంపిణీ విషయంలో పనులు వేగవంతం చేస్తున్నాం. నేను రాకపూర్వం యూనిఫామ్స్‌ కుట్టేందుకు ఏజెన్సీలకు అప్పగించారు. వారి నుంచి తొందరగా కుట్టించి విద్యార్థులకు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. దర్జీలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నాం. మండలాలకు నేరుగా యూనిఫామ్స్‌ వెళ్లడంతో పూర్తి డాటా తీసుకోవాల్సి ఉంది.
– రవీందర్‌, డీఈఓ

నారాయణపేట మండలంలో ఇలా..
కోటకొండ జెడ్పీ స్కూల్‌లో 610మంది విద్యార్థులు 6నుంచి 10వ తరగతి తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం చదువుతున్నారు. వీరికి ఈ విద్యా సంవత్సరంలో యూనిఫామ్స్‌ రాలేదు. కొంతమందికి దుస్తులు చిరిగిపోవడంతో సివిల్‌ డ్రస్‌తో తరగతులకు హాజరవుతున్నారు. నెలన్నర అవుతున్నా ఒక్కరికి ఒక్కజత కూడా పంపిణీ చేయలేదు.
శేర్నపల్లి యూపీఎస్‌లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు 260మంది విద్యార్థులు ఉన్నారు. వీరికిసైతం ఈఏడాది ఒక్క యూనిఫామ్‌ జత కూడా ఇవ్వలేదు. దీంతో సివిల్‌ డ్రెస్‌లతోనే పాఠశాలకు హాజరవుతున్నారు.
శ్యాసన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో 112 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి 15రోజుల క్రితం ఒక జత మాత్రం యూనిఫామ్స్‌ అందించారు. ప్రతిరోజు అదే బట్టలు వేసుకుని వస్తున్నారు.

Digital Classes: డిజిటల్‌ బడులు.. దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో

Published date : 21 Jul 2023 06:55PM

Photo Stories