Digital Classes: డిజిటల్ బడులు.. దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో
విద్యార్థులకు ఇప్పటివరకూ తరగతి గదిలో ఉపాధ్యాయులు బ్లాక్, గ్రీన్ బోర్డులపై చాక్‌పీస్‌లతో బోధించేవారు. బోధనా పద్ధతుల్లో.. మౌలిక వసతుల్లో ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలతో పోల్చుకునేవారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ పాఠశాలలను ప్రభుత్వ పాఠశాలలతో పోల్చుకునే పరిస్థితి వచ్చింది. మన బడి నాడు–నేడు పథకం ద్వారా కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో మౌలిక వసతులు కల్పించి, అభివృద్ధి చేశారు.
ఇప్పుడు బోధనలోనూ సాంకేతిక విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ / కార్పొరేట్ పాఠశాలల్లో లేని విధంగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ డిస్‌ప్లే (ఐఎఫ్‌పీడీ)లను ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. ఈ విధానంతో పాఠశాలల్లో బ్లాక్, గ్రీన్ బోర్డుల ద్వారా బోధనకు స్వస్తి పలుకుతారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీ డిస్‌ప్లేలను వినియోగించే విధానంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.
చదవండి: Digital Education: బోధనలోను సాంకేతిక విధానానికి ప్రభుత్వం స్వీకారం
ఐఎఫ్‌పీ అంటే
అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ డిస్‌ప్లే ద్వారా ఇప్పటికే బోధన సాగిస్తున్నారు. ఈ విధానాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో అమలు చేస్తోంది. వీటి ద్వారా ఎంత క్లిష్టమైన పాఠ్యాంశాన్నైనా సులువుగా బోధించవచ్చు. ఉపాధ్యాయులు గతంలో ఏదైనా కొత్త విషయాన్ని బోధించాలంటే తమ ఆండ్రాయడ్ ఫోన్లో ఆ విషయాన్ని డౌన్‌లోడ్ చేసుకుని బోధించాల్సి వచ్చేది. కానీ నూతన విధానంలో ఒక క్లిక్‌తో ఈ ప్యానల్‌పై పాఠ్యాంశాలను బోధించే అవకాశముంటుంది. గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులు బోధించే సమయంలో ఆయా చిత్రాలను బోర్డుపై గీస్తూ బోధన చేయవచ్చు. వీటిని బ్లాక్, వైట్ బోర్డులుగా ఉపయోగించవచ్చు.
ఐఎఫ్‌పీలపై త్రిభుజాలు, చతుర్భుజాలు, మానవ అవయవాలు, వివిధ రకాల పటాలను, చిత్రాలను స్వయంగా గీసి చూపిస్తూ బోధించడం వల్ల విద్యార్థులు సులువుగా అభ్యసించే వీలవుతుంది. ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి విద్యార్థులకు వీడియోలను, ఫొటోలను చూపించవచ్చు. ఉపాధ్యాయుడు బోధించిన పాఠాన్ని సేవ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. నాన్ లాంగ్వేజెస్ ఉపాధ్యాయులే కాకుండా లాంగ్వేజ్ ఉపాధ్యాయులు తమ సబ్జెక్టులను బోధించే అవకాశముంది. మొబైల్ ఫోన్‌తో కూడా ఐఎఫ్‌పీని ఆపరేట్ చేసుకోవచ్చు. తరగతి గదుల్లో ఉపాధ్యాయుల బోధనను ప్రధానోపాధ్యాయుడి గది నుంచి పర్యవేక్షణ చేసే వీలుంది. 1–5 తరగతులకు స్మార్ట్ టీవీలు, 6–10 తరగతులకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ డిస్‌ప్లేలు ఏర్పాటు చేశారు.
చదవండి: Digital Education: విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేయాలి
అవగాహన తరగతులు
డిజిటల్ విద్యా విధానంలో ఐఎఫ్‌పీ డిస్‌ప్లేలు ఏ విధంగా ఉపయోగించాలి? అనే అంశంపై ప్రధానంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు ఐఎఫ్‌పీలతో పాటుగా, స్మార్ట్ టీవీలు, బైజూస్ ట్యాబ్స్ వినియోగంపై కూడా శిక్షణ ఇచ్చారు. ఒక్కో బ్యాచ్‌కు రెండు రోజుల వంతున కాకినాడ జిల్లాలో ఉన్న 4,437 మంది ఉపాధ్యాయులకు జేఎన్‌టీయూకే, ఆదర్శ, ప్రగతి, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలల్లో తరగతులు నిర్వహించారు.
చదవండి: Tenth Class: డిజిటల్‌గా పరీక్ష రాసిన దివ్యాంగ విద్యార్థులు
కాకినాడ జిల్లాలో పరిస్థితి ఇదీ..
జిల్లాలో 933 ప్రాథమిక, 105 ప్రాథమికోన్నత, 247 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లో 1,356 ఐఎఫ్‌పీ డిస్‌ప్లేలకు గాను 504 ఏర్పాటు చేయగా, ప్రాథమిక పాఠశాలల్లో 430కు గాను 325 స్మార్ట్ టీవీలను ఆయా పాఠశాలల్లో ఇనస్టాలేషన్‌ను కూడా పూర్తి చేశారు.
కోనసీమ జిల్లాలో ఇలా..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో డిజిటల్ బోధనకు ఈ విద్యా సంవత్సరం నుంచి శ్రీకారం చుట్టారు. తొలి విడతగా నాడు–నేడు పథకంలో అభివృద్ధి చేసిన పాఠశాలల్లో ప్రారంభించారు. 142 పాఠశాలల్లో 951 ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేశారు. ఒక్కో ఐఎఫ్‌పీకి రూ.1.20 లక్షలు వెచ్చించారు. 951 ఐఎఫ్‌పీలకు ప్రభుత్వం రూ.11.41 కోట్లను ఖర్చు చేసింది.
జూలై 15 నుంచి డిజిటల్ విద్య ద్వారా తరగతుల్లో బోధన చేపట్టారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 3,895 మంది ఉపాధ్యాయులు, సీఆర్పీలు, పార్ట్‌టైమ్ అసిస్టెంట్లకు ఐఎఫ్‌పీల ద్వారా బోధన చేపట్టే అంశాలపై శిక్షణ ఇచ్చారు. గత విద్యా సంవత్సరంలో 17,039 మంది 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్స్‌ను పంపిణీ చేశారు. 14,561 మంది విద్యార్థులకు, 2,478 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్స్ అందజేశారు. డిజిటల్ విద్యను విద్యార్థులు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు.