Digital Education: బోధనలోను సాంకేతిక విధానానికి ప్రభుత్వం స్వీకారం
బాపట్ల అర్బన్: బోధనలోను సాంకేతిక విధానానికి ప్రభుత్వం స్వీకారం చుట్టింది. ప్రైవేట్, కార్పొరేట్లో లేని విధంగా ఇంట్రాక్టివ్ ప్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేలను ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. దీంతో పాఠశాలల్లో బ్లాక్, గ్రీన్ బోర్డుల ద్వారా బోధన విధానానికి స్వస్తి పలుకుతారు. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఐఎఫ్‌పీ డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. ఈ సరికొత్త విధానం ద్వారా ఆగస్టు నుంచి బోధన సాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌కు రెండు రోజులు చొప్పున జిల్లాలో 3687 ఉపాధ్యాయులకు జూలై 26 వరకు ఈ విధానంపై శిక్షణ జరుగుతుంది.
దశలవారీగా అన్ని పాఠశాలల్లో...
భవిష్యత్తు అంతా డిజిటల్ టెక్నాలజీ పైనే ఆధారపడి ఉంటుంది. దీనిని ఉపాధ్యాయులు అందిపుచ్చుకునేందుకు వీలుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. దశలవారీగా అన్ని పాఠశాలల్లోనూ డిజిటల్ బోధనకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
– పి.వి.జె.రామారావు, డీఈఓ, బాపట్ల
బోధన సులభతరం అవుతుంది
డిజిటల్ విద్యా విధానంలో భాగంగా ఐఎఫ్‌పీలు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. బోధన సులభతరం అవడమే కాకుండా విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. తక్కువ సమయంలో పాఠ్యాంశాన్ని ఆకట్టుకునేలా బోధించే వీలుంటుంది.
– మోపిదేవి రాము,ఐఎఫ్‌పీ బైజూస్ జిల్లా నోడల్ అధికారి, బాపట్ల
నేడు జిల్లాకు మంత్రి బొత్స రాక
బాపట్ల అర్బన్: సాల్ట్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌పై నేడు బాపట్లలో ప్రధానోపాధ్యాయులకు నిర్వహించనున్న శిక్షణ కార్యాక్రమానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రానున్నారని డీఈఓ పి.వి.జె.రామారావు సోమవారం తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, పల్నాడు జిల్లాల ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని బాపట్ల ఏజీ కాలేజీలోని బీవీ నాథ్ ఆడిటోరియంలో ప్రారంభిస్తారని వెల్లడించారు. ప్రారంభ కార్యక్రమం అనంతరం ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ నిర్వహిస్తారని చెప్పారు.
బోధనలో సరికొత్త విధానానికి శ్రీకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఐఎఫ్‌పీల వినియోగం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ