Inspire: భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికే ఇన్‌స్పైర్
గంగవరం: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు బాల మేధావులను భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికే ఇన్‌స్పైర్ మానక్ స్టేట్ లెవల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నట్టు డీఈఓ దేవరాజులు తెలిపారు. గంగవరం జెడ్పీ హైస్కూల్‌లో అందుకు సంబంధించి చిత్తూరు డీవైఈఓ చంద్రశేఖర్, వివిధ మండలాల ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులతో బుధువారం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతల కలయికే రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ మానక్ కాంపిటీషన్స్ అని అన్నారు. ఈ ఎగ్జిబిషన్‌ను 11వ తేదీ నుంచి 13వ తేదీ మూడు రోజుల పాటు మండలంలోని మదర్‌థెరిసా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అందుకోసం 26 కమిటీలను ఇదివరకే ఏర్పాటు చేశామన్నారు. 11వ తేదీన రాష్ట్రస్థాయి ప్రదర్శనకు రాష్ట్ర, జిల్లా అధికారులు, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఢిల్లీ నుంచి అబ్జర్వర్లు విచ్చేస్తున్నారని తెలిపారు. బాలురు/జెంట్స్ గైడ్ టీచర్లకు పలమనేరు లిటిల్ ఫ్లవర్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, బాలికలు/ఉమెన్స్ గైడ్ టీచర్లకు ఎలినా బెటిని హైస్కూల్‌లో వసతి ఏర్పాటు చేశారన్నారు. డీఎస్‌ఓ రమణ, తదితరులు పాల్గొన్నారు.