Skip to main content

PV Narasimha Rao: పీవీ నరసింహారావు స్థిత ప్రజ్ఞడు

సంఘ సంస్కరణకర్తగా, సామాజికవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయ దురంధరుడిగా దివంగత ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు అందించిన సేవలు చిరస్మరణీయమని రాజ్యసభ సభ్యుడు, పి.వి.శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కె.కేశవరావు అన్నారు.
PV Narasimha Rao
పీవీ నరసింహారావు స్థిత ప్రజ్ఞడు

అందుకే ఆయన్ని ప్రతిఒక్కరూ ‘స్థిత ప్రజ్ఞడు’గా కొనియాడుతున్నారని, ఈ పదం పి.వి.కి నూటికి నూరుశాతం సరిపోతుందని పేర్కొన్నారు. తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి రచించిన ‘జాతిరత్న పి.వి.నరసింహారావు’గ్రంథాన్ని నవంబర్‌ 15న తెలంగాణ తెలుగు అకాడమీలో ఆయన ఆవిష్కరించారు. కేశవరావు మాట్లాడుతూ ‘పి.వి.పై ఉన్న అభిమానంతో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశంతో పుస్తకాన్ని, గ్రంథాన్ని రచిస్తున్నారు. ఒక్కో పుస్తకంలో ఒక్కో కోణాన్ని మనం గమనించి దానిని అనుసరించాలి’అని అన్నారు. కేవలం 560 పేజీలతో పి.వి.జీవితాన్ని లెక్కించలేమని పేర్కొన్నారు. ‘మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మరణం తర్వాత దేశంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల్లో పి.వి. ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఎన్నో ఒడిదుడుకులను ఆయన అధిగమించారు. ప్రత్యేక పంజాబ్‌ కావాలని వేర్పాటువాదులు పోరాడుతున్న సమయంలో అక్కడ ఎన్నికలు జరిపించి శాంతి సామరస్యాలను సాధించిన ధైర్యసాహసిగా పీవీ నిలిచారు’అని కొనియాడారు. పీవీ గొప్ప పాలనాదక్షుడని పేర్కొన్నారు. తన తండ్రి పీవీ సంస్కరణాభిలాషి అని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇటీవలి తెలుగు అకాడమీ కుంభకోణం వార్తలు ఎంతో బాధించాయన్నారు. పీవీ గురించి ఓ గ్రంథాన్ని రాయడం నిజంగా వరంలాగా భావిస్తున్నానని ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి అన్నారు. కార్యక్రమంలో అకాడమీ పూర్వ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ అవ్వం పాండయ్య తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: 

Women Police: మహిళా పోలీసులకు వరం

Degree: తొలివిడత డిగ్రీ సీట్లు సంఖ్య

EMRS: గుణాత్మక విద్య అందించేందుకే.. ఏకలవ్య మోడల్‌ స్కూళ్లు

Published date : 16 Nov 2021 03:02PM

Photo Stories