RUSA for Universities: సాంకేతిక విశ్వవిద్యాలయాలకు రూసా భరోసా! జేఎన్‌టీయూఏకు అందిన ప్రాజెక్టులు ఇవే..
అనంతపురం: సాంకేతిక విశ్వవిద్యాలయాలకు తొలిసారి రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్ (రూసా) భరోసా దక్కింది. దేశీయంగా ఉన్నత విద్యకు ఆర్థిక చేయూత అందించేందుకు దశాబ్దం క్రితం రూసా తొలి దశ ప్రారంభమైంది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ కేవలం సంప్రదాయ విశ్వ విద్యాలయాలకు మాత్రమే రూసా పథకం కింద నిధులు మంజూరయ్యేవి. తాజాగా సాంకేతిక విశ్వవిద్యాలయాలకూ ఈ పథకాన్ని వర్తింపజేశారు.
TS Teacher Jobs Recruitment: త్వరలో 13వేల టీచర్ పోస్టుల భర్తీ.. వెల్లడించిన మంత్రి కోమటిరెడ్డి
జేఎన్‌టీయూఏకు నూతన పరిశోధన ప్రాజెక్టులు..
ఏ దేశమైనా ప్రగతి పథంలో సాగాలంటే పరిశోధనలే కీలకం. ఈ క్రమంలో విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం కల్పించడంపై కేంద్రం దృష్టి సారించింది. దీంతో దేశీయంగా ఉన్నత విద్యకు ఆర్థిక చేయూతనిచ్చేలా రూసా పథకం కింద ప్రత్యేకంగా నిధులు సమకూరుస్తూ పరిశోధనలు చేపట్టేలా ప్రోత్సాహిస్తోంది. ఇప్పటి వరకూ సంప్రదాయ విద్యాబోధన సాగించే యూనివర్సిటీలకు మాత్రమే నిధులు సమకూర్చిన కేంద్రం... తాజాగా సాంకేతిక విద్యనందించే విశ్వవిద్యాలయాలకూ చేయూతనిస్తోంది.
దీంతో జేఎన్‌టీయూఏకు ఏకంగా రూ.88 లక్షలు విలువ చేసే 8 పరిశోధన ప్రాజెక్టులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులను రెండేళ్ల కాలవ్యవధిలో పూర్తి చేయాలనే నిబంధన విధించారు. కాగా, ప్రాజెక్ట్‌ల కేటాయింపుపై జేఎన్‌టీయూఏ వీసీ డాక్టర్ జీవీఆర్ శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. పరిశోధన ప్రాజెక్ట్‌లకు ఎంపికైన ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను అభినందించారు. జేఎన్‌టీయూను ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు ఈ ప్రాజెక్టులు కీలకం కానున్నాయన్నారు.
మంజూరైన ప్రాజెక్ట్‌లు ఇవే..
● నానో కాంక్రీట్ స్థిరత్వాన్ని అంచనా వేసే ప్రాజెక్ట్‌ను సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి బి.అజితకు కేటాయించారు. ఇందు కోసం రూ.10లక్షలు కేటాయించగా తొలి దశలో రూ.4.40 లక్షల నిధులను మంజూరు చేశారు.
● మూర్చ రోగులకు తక్కువ ఖర్చుతోనే ఇంటి వద్దనే వైద్య పరీక్ష చేసుకునే పరికరాన్ని రూపకల్పన చేసే ప్రాజెక్ట్ బాధ్యతలను ఎలక్ట్రానిక్స్ విభాగంలో డాక్టర్ ఎస్.అరుణామస్తానీకి కేటాయించారు. ఇందు కోసం ఈసీఈ విభాగానికి రూ.11 లక్షలు నిధులు కేటాయించగా రూ.4.84 లక్షలు మంజూరయ్యాయి.
● లర్నింగ్ అల్గరిథమ్‌ను ఉపయోగించి క్లిష్టమైన జబ్బుల మెడికల్ ఇమేజ్‌ను విశ్లేషించేలా ఎలక్ట్రానిక్స్ విభాగం ప్రొఫెసర్ డి.విష్ణువర్ధన్‌కు ప్రాజెక్ట్ కేటాయించారు. ఇందు కోసం ఈసీఈ విభాగానికి రూ.11 లక్షలు కేటాయించి, రూ.4.84 లక్షలు మంజూరు చేశారు.
● రూ. 12 లక్షల వ్యయంతో కూడిన బ్యాటరీలు, సూపర్ కెపాసిటర్ ఎలక్ట్రోడ్ మెటీరియల్ రూపకల్పన ప్రాజెక్ట్ బాధ్యతలను కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ బి.దిలీప్‌కుమార్‌కు అప్పగించారు. ఇందు కోసం రూ.12 లక్షలు కేటాయించగా, రూ.5.28 లక్షలు మంజూరు చేశారు.
● ఇథనాల్ బయోఫ్యూయల్ వాడకానికి కావలసిన సపరేషన్ టెక్నిక్స్ పరికరాలను పరీక్షించే ప్రాజెక్ట్‌ను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణకు కేటాయించారు. ఇందుకోసం కెమికల్ ఇంజినీరింగ్ విభాగానికి రూ.11 లక్షల నిధులు కేటాయించారు. ఇందులో రూ.4.84 లక్షలు మంజూరయ్యాయి.
● మేగ్నటో హైడ్రోడైనిక్ కన్వోక్టివ్ హీట్ అండ్ మాస్ ట్రాన్స్‌ఫర్ ఇన్ మైక్రోపోలార్ ఫ్లూయిడ్ అంశంపై పరిశోధన బాధ్యతను మేథమేటిక్స్ విభాగం ప్రొఫెసర్ ఆర్. భువనవిజయకు అప్పగించారు. ఇందు కోసం రూ.10 లక్షలు కేటాయించగా, తొలి దశలో రూ.4.40 లక్షలు మంజూరు చేశారు.
● వృద్ధాప్యం పైబడిన వారు నడిచేటప్పుడు కింద పడకుండా ఉండేలా ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్, మెషిన్ లర్నింగ్ ద్వారా ఓ జాకెట్ రూపకల్పన బాధ్యతను ప్రొఫెసర్ ఈ.కేశవరెడ్డికి అప్పగించారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.10 లక్షలు కాగా, రూ.4.40 లక్షలు మంజూరు చేశారు.
● వృథా ఇనుమును ఉపయోగించి కాంక్రీట్‌లో స్థిరత్వాన్ని పెంపొందించేలా ఆవిష్కరణ చేసిన జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ఆచార్య సి.శశిధర్‌కు రూ.11 లక్షల విలువైన ప్రాజెక్ట్‌ను మంజూరు చేశారు. ఇందులో తొలి విడతగా రూ.4.84 లక్షలు మంజూరు చేశారు.
Mission Life Program: పాఠశాలల్లో మిషన్ లైఫ్ కార్యక్రమం.. విద్యార్థులచే ప్రతిజ్ఞ ఇలా..!