Medical College: సెప్టెంబర్ 15న వైద్య కళాశాల ప్రారంభం
వికారాబాద్ అర్బన్: ఈ నెల 15న వైద్య కళాశాల ప్రారంభిస్తున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతగిరిలోని వైద్య కళాశాల భవనాలు, అక్కడి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 15న ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్‌గా కళాశాలను ప్రారంభిస్తారని తెలిపారు. అప్పటిలోగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కళాశాల ఆవరణలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డిప్యూటీ ఇంజనీర్ లక్ష్మీనారాయణకు సూచించారు. 20 రోజుల్లో పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించుకొని, రోజు వారి పనుల వివరాలను అదన పు కలెక్టర్‌కు నివేదిక రూపంలో ఇవ్వాలని సంబంధిత కాంట్రాక్టర్, డీఈకి సూచించారు. కళాశాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను సందర్శించి వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. మూత్రశాలలు, తలుపులు, కిటికీలు, ఇతర మరమ్మతు పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారి రాజుకు సూచించారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మశాల్ మాలిని, సూపరింటెండెంట్ డాక్టర్ రామచంద్రయ్య, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ప్రదీప్ కుమార్, డీఎస్డీఓ మల్లేశం, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ పాల్గొన్నారు.
చదవండి: DEO D Madhavi: విద్యాప్రమాణాల పెంపునకే ‘ఉన్నతి’
పారిశుద్ధ్య పనులు చేపట్టండి
జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు చేపట్టాలన్నారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఆదేశించారు. గ్రీన్ బడ్జెట్‌ను మొక్కల సంరక్షణకు మాత్రమే వినియోగించాలని, ఇతర పనులకు ఖర్చు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. అలాగే మన ఊరు – మన బడి పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీవో కృష్ణన్, డీపీఓ తరుణ్ కుమార్, జెడ్పీ సీఈవో సుభాషిని, డీఈవో రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Employment Opportunities: నిరుద్యోగుల ‘ఉన్నతి’కి భరోసా
కళాశాల సూపరింటెండెంట్‌గా డాక్టర్ రామచంద్రయ్య
వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల సూపరింటెండెంట్‌గా డాక్టర్ రామచంద్రయ్యను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణంలోని కొత్తగడికి చెందిన డాక్టర్ రామచంద్రయ్య ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, నిజామాబాద్ వైద్య కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.ఏడాది నుంచి వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలోని జనరల్ సర్జన్ విభాగం హెచ్‌ఓడీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు కళాశాల సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించారు.