Employment Opportunities: నిరుద్యోగుల ‘ఉన్నతి’కి భరోసా
సీడాప్‌కు ధన్యవాదాలు
నేను 2020లో డిగ్రీ పూర్తి చేశాను. ఉద్యోగం రావాలంటే సంబంధిత కోర్సుల్లో నైపుణ్యం తప్పనిసరి. ఇందుకోసం నేను హైదరాబాద్ వెళ్లి శిక్షణ తీసుకోలేక ఇంటి వద్దే ఉండిపోయాను. 2022లో సీడాప్ గురించి తెలుసుకుని అందులో చేరాను. మూడు నెలల శిక్షణలో గ్రూమింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, వెబ్ డెవలపింగ్ గురించి పూర్తిగా నేర్పించారు. అనంతరం నిర్వహించిన ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎస్‌బీఆర్ టెక్నాలజీస్‌లో క్యూసీ రిపోర్టర్‌గా పనిచేస్తున్నాను. రూ.13,700 జీతం ఇస్తున్నారు. అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీడాప్‌కు ధన్యవాదాలు. – పి.అంకరాజు, సంతజూటూరు,
బండిఆత్మకూరు, నంద్యాల జిల్లా
నంద్యాల(సెంట్రల్): కూలీల పిల్లలు కూలీలుగానే మిగిలిపోకూడదు. అర్హత, ఆసక్తి ఉన్న వారికి ప్రోత్సహించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టాలి. ఈ ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఉన్నతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ పథకంపై ఆధారపడి జీవించే వారి కుటుంబాల్లోని నిరుద్యోగ యువతీయువకులకు సీడాప్ ద్వారా ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ఇందుకు ఒక్కో అభ్యర్థిపై సర్కారు రూ.44,850 ఖర్చు చేస్తోంది.
పల్లెల్లో పేదలకు పని కల్పించి వలసలు నివారించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకంలో 100 రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న కూలీల కుటుంబాల్లో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన పిల్లలకు ‘ఉన్నతి’ కార్యక్రమాన్ని సీడాప్ అమలు చేస్తోంది. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు 100 శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. 2018 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల వరకు 100 రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలను డ్వామా సహకారంతో సీడాప్ అధికారులు గుర్తిస్తున్నారు.
చదవండి: Teachers Transfer: బదిలీ కోసం ఇన్ని వేల మంది టీచర్లు దరఖాస్తు
250 మందిలో 150 మందికి ఉద్యోగాలు
2019–20 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణాభివృద్ధి శాఖ, డ్వామా సంయుక్తంగా ‘ఉన్నతి’ కార్యక్రమాన్ని అమలు చేశాయి. కరోనా కారణంగా మొదటి ఏడాదిలో ఒక బ్యాచ్‌కు శిక్షణ అందించాయి. అనంతరం రెండేళ్లపాటు శిక్షణ నిలిపివేసినప్పటికీ...గత ఆర్థిక సంవత్సరంలో పునఃప్రారంభమైంది. ఇప్పటి వరకు కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి 250 మందికి శిక్షణ అందించగా...వారిలో 150 మందికి ఉద్యోగాలు వచ్చాయి.
మూడు నెలల శిక్షణ
పదో తరగతి చదివిన వారికి రిటైల్ రంగంలో, ఇంటర్ పూర్తి చేసినవారికి బ్రాడ్‌బాండ్ కనెక్షన్, డిగ్రీ పట్టభద్రులకు వెబ్ డెవలపర్ పైతాన్ కోర్సుల్లో మూడు నెలల శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కాలంలో భోజనం, ఏకరూప దుస్తులు, వసతి పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. కర్నూలు సీతారామనగర్‌లోని లా మెక్లిన్ అనే ప్రైవేటు సంస్థతో పాటు, బి.తాండ్రపాడులోని డీఆర్‌డీఏ శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. లా మెక్లిన్‌లో ప్రస్తుతం 35 మంది బ్యాచ్‌కు శిక్షణ నడుస్తుండగా, డీఆర్‌డీఏ వద్ద 15 మంది దాకా నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటున్నారు.
ఉపాధికూలీల పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం ఊతం సీడాప్ ద్వారా ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ 100 శాతం ప్లేస్‌మెంట్ లక్ష్యంగా తర్ఫీదు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 250 మందికి శిక్షణ 150 మందికి ఉద్యోగ కల్పన శిక్షణ ఇస్తూ కూలి డబ్బులు సైతం జమ
ఉపాధి కూలీల పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు కదా...అని కూలీల వేతనాలకు ఏమాత్రం కోత పెట్టరు. పైపెచ్చు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థికి 90 రోజుల పాటు రోజుకు రూ.273 వంతున ఖాతాలో జమచేస్తారు. దీనికోసం శిక్షణార్థులు 80 శాతం హాజరు తప్పనిసరిగా కొనసాగించాలి.
చదవండి: Contract Professors: ‘వర్సిటీ’ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి