Skip to main content

Technozion: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద టెక్నోఫెస్ట్‌.. ఎక్క‌డంటే..

నిట్‌ వరంగల్‌లో ప్రతి ఏడాది విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహించే మూడు రోజుల సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–24 జ‌న‌వ‌రి 19వ తేదీ ప్రారంభమైంది.
NIT Warangal's annual tech fest Technozion   Interactive Tech Workshops for Students    Technogeon-24 Opening Ceremony

దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద టెక్నోఫెస్ట్‌గా పేరుగాంచిన టెక్నోజియాన్‌ మూడు రోజులపాటు జరగనుంది. ఈ సాంకేతిక మహోత్సవానికి దేశవ్యాప్త ఇంజనీరింగ్‌ కళాశాలల నుంచి 6 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సాంకేతిక విద్య, ఆవిష్కరణలను పంచుకునే వేదికగా టెక్నోజియాన్‌–24 నిలువనుంది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను అలవర్చేందుకు, పరస్పరం సాంకేతికతను పంచుకునేందుకు నిట్‌ వరంగల్‌లో 2006 సంవత్సరంలో టెక్నోజియాన్‌ ప్రారంభించారు. ప్రతి ఏడాది వివిధ థీంలతో ఆవిష్కరిస్తున్న ఈ వేడుకకు ఈ ఏడాది ఇంజీనియస్‌గా నామకరణం చేశారు. ఇంజీనియస్‌ అంటే నూతన ఆవిష్కరణలు, సాంకేతికత స్ఫూర్తి అనే అర్థం.

40 టెక్నికల్ ఈవెంట్లు..
టెక్నోజియాన్‌–24 (ఇంజీనియస్‌)ను 40 టెక్నికల్‌ ఈవెంట్లతో రూపాందించారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల్లో స్పాట్‌లైట్స్‌ పేరిట జహాజ్‌, ఆర్‌సీ బగ్గీ, హోవర్‌ మానియా, వర్చ్యువల్‌ రియాల్టీ, డీ బగ్గింగ్‌ మానియాలతో అలరించనుంది. మ్యాట్‌ల్యాబ్‌, టీ–వర్క్స్‌, రాపిడ్‌ ప్రోటోటైపింగ్‌, సిమూలింక్‌ మాస్టర్‌, ఇన్సోసర్చ్‌ వంటి వర్క్‌షాప్స్‌ ఆకర్షణగా నిలువనున్నాయి. నిట్‌ మెకానికల్‌ విభాగానికి చెందిన స్పర్థక్‌ టీం వెహికిల్‌ ఎగ్జిబిషన్‌ ప్రత్యేకంగా నిలువనుంది. అదే విధంగా గెస్ట్‌ లెక్చర్స్‌ అయిన రెడ్‌బస్‌ సీఈఓ ప్రకాష్‌ సింగం, ఇస్రో సైంటిస్ట్‌ టీఎన్‌.సురేష్‌కుమార్‌ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించనున్నారు.

ప్రో షోలు రద్దు..
ప్రతి ఏడాది టెక్నోఫెస్ట్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పాట్‌లైట్స్‌, వర్క్‌షాపుల్లో విద్యార్థులు సాంకేతిక విద్యను పంచుకుని రాత్రి వేళ్లలో నిట్‌ మైదానంలో ఉత్సాహంగా ప్రో షోలు నిర్వహించేవారు. ఈ ఏడాది ప్రోషోలు అయిన వివిధ ఆర్టిస్టులతో పాట లు పాడించడం, డ్యాన్స్‌, ర్యాంప్‌పై మోడలింగ్‌ వంటి వాటిని రద్దు చేశారు. టెక్నాలజీని మాత్రమే పంచేందుకు వేదికగా సిద్ధం చేసినట్లు సమాచారం. 

ఆవిష్కరణలకు వేదిక టెక్నోజియాన్‌..
సాంకేతిక విద్యనభ్యసించే విద్యార్థులు సమాజానికి దోహదపడే నూతన ఆవిష్కరణలను చేపట్టేందుకు వేదికగా ఇంజీనియస్‌ టెక్నోజియాన్‌–24 నిలుస్తుందని నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ తెలిపారు. నిట్‌లోని సెనేట్‌ హాల్‌లో జ‌న‌వ‌రి 18వ తేదీ ఆయన టెక్నోజీయాన్‌–24 వివరాలను వెల్లడించారు. విద్యార్థులు నగరంలోని మున్సిపల్‌ శాఖకు దోహదపడేందుకు గాను మురుగు కాల్వలు, చెత్తడబ్బాలు నిండిపోయిన తరుణంలో మున్సిపల్‌ అధికారులకు సమాచారం అందించేందుకు ఐఓటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) సాయంతో ఏర్పాటు చేసిన సెన్సార్లను ఉపయోగించేందుకు ప్రత్యేక యాప్‌లను రూపొందించారని తెలిపారు. దేశవ్యాప్త సాంకేతిక కళాశాలలతో పాటు నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు, టెక్నోజియాన్‌–24ను వీక్షించే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. నిట్‌ డీన్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్‌ శ్రీనివాసాచార్య, టెక్నోజియాన్‌–టీం సభ్యులు పాల్గొన్నారు.

10th Exams 2024 Preparation: పదో తరగతిలో వంద శాతం ఫలితాలే లక్ష్యంగా... పాఠశాలల్లో స్లిప్‌టెస్ట్‌లు!

Published date : 20 Jan 2024 02:52PM

Photo Stories