Skip to main content

NEET(UG) 2023: నీట్‌ (యూజీ) నోటిఫికేషన్ విడుద‌ల‌... ఇలా అప్లై చేసుకోండి

దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ, ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌) యూజీ–2023 పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్షను మే 7న నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సోమవారం అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
NEET Notification

ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించనున్నారు.  
మే 7న ప‌రీక్ష‌
ఆన్‌లైన్‌ దరఖాస్తులను మార్చి 6 నుంచి ఏప్రిల్‌ 6 వరకు స్వీకరించనున్నారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1700 కాగా, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ, ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/థర్డ్‌ జండర్‌ అభ్యర్థులకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు చెందిన అభ్యర్థులైతే దరఖాస్తు రుసుం రూ.9500గా నిర్ణయించారు. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 7న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది.

చ‌ద‌వండి: 15 ఏళ్ల సర్వీస్‌ ఉంటేనే అధిక పెన్షన్‌.. మీరు ఆప్ష‌న్ ఇచ్చారా.?
17 ఏళ్లు నిండిన వారు మాత్ర‌మే...
17 ఏళ్ల వయసు కలిగి, గుర్తింపు కలిగిన బోర్డుల్లో బయోలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ కోర్‌ సబ్జెక్టులుగా ఇంటర్‌ లేదా సమానమైన డిప్లమో కోర్సులు చేసిన విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. దేశ వ్యాప్తంగా 645 మెడికల్, 318 డెంటల్, 914 ఆయుష్, ఇతర కళాశాలల్లో నీట్‌–యూజీ అర్హత ఆధారంగా ప్రవేశాలుంటాయి. నీట్‌ యూజీ–2022ను గ‌తేడాది జూలై 17న దేశ వ్యాప్తంగా నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. ఈ పరీక్షకు ఏపీలో 65,305 మంది హాజరు కాగా 40,344 మంది అర్హత సాధించారు.
ఏపీలో 5,360 సీట్లు
గ‌తేడాది దేశవ్యాప్తంగా 17,64,571 మంది పరీక్ష రాస్తే.. 9.93 లక్షల మంది అర్హత సాధించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 11 ప్రభుత్వ, 16 ప్రైవేట్, 2 మైనారిటీ, శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలలున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 2,185, ప్రైవేట్, మైనారిటీ కళాశాలల్లో 3,175 ఎంబీబీఎస్‌ సీట్లు కలిపి ఏపీలో 5,360 ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం 5 వైద్య కళాశాలల్లో 2023 నుంచి అకడమిక్‌ కార్యకలాపాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

చ‌ద‌వండి: రాష్ట్రంలో ప్రతి సెకన్‌కు ఒక మొబైల్‌ : గుడివాడ అమ‌ర్‌నాథ్‌
ద‌ర‌ఖాస్తు ఇలా చేసుకోండి...
నీట్‌ యూజీ 2023 దరఖాస్తును ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ nta.ac.in, neet.nta.nic.inలలో లభిస్తాయి. అర్హులైన విద్యార్థులు నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించి రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే.. నీట్‌ యూజీ ఎగ్జామ్‌ విధానం, సిలబస్‌, దరఖాస్తు వివరాలు, అర్హత, విద్యార్హతల వంటి వివరాలు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌నుంది ఎన్‌టీఏ.

Published date : 07 Mar 2023 01:20PM

Photo Stories