Skip to main content

EPFO: 15 ఏళ్ల సర్వీస్‌ ఉంటేనే అధిక పెన్షన్‌.. మీరు ఆప్ష‌న్ ఇచ్చారా.?

సుదీర్ఘ పోరాటం తర్వాత వేతన జీవుల ఆకాంక్ష అయిన అధిక పెన్షన్‌ కల సాకారమైంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోని ఉద్యోగుల పెన్షన్‌ స్కీమ్‌ (ఈపీఎస్‌ 95) కింద అధిక పెన్షన్‌కు అర్హత లభించింది. 2014 సెప్టెంబర్‌ 1 నాటికి ఈపీఎస్‌ సభ్యులుగా ఉన్నవారు, అంతకుముందు రిటైర్మెంట్‌ తీసుకున్న వారు, తమకు అధిక పెన్షన్‌ కావాలంటూ ఆప్షన్‌ ఇచ్చుకోవచ్చు. ఇందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.
EPFO

అంత పింఛను ఎవరు చెల్లించాలి?
ఉదాహరణకు కిరణ్‌ అనే వ్యక్తి 1996 ఏప్రిల్‌ 1న ఉద్యోగంలో చేరాడని అనుకుందాం. నాడు అతడి బేసిక్‌ వేతనం రూ.5,000. నాటి నుంచి ఏటా 7.5 శాతం చొప్పున పెరుగుతూ వచ్చిందని భావిస్తే.. అతడు అధిక పెన్షన్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకోకపోతే, 2031 నాటికి 35 ఏళ్ల సర్వీస్‌ ముగిసిన అనంతరం, అతడికి ప్రతి నెలా రూ.7,929 పెన్షన్‌ వస్తుంది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్ల‌పై...
ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కిరణ్‌ ఒకవేళ అధిక పెన్షన్‌ ఆప్షన్‌ ఇస్తే అతడికి 2031 తర్వాత నుంచి ప్రతి నెలా వచ్చే పింఛను రూ.26,879కి పెరుగుతుంది. దీనికోసం ఇప్పుడు రూ.9.74 లక్షలు జమ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తంపై వచ్చే రాబడి రేటు 23.4 శాతం. ఇంత రాబడి అంటే అది కచ్చితంగా ఉద్యోగులకు లాభించేదే. కానీ, ఇది ఈపీఎఫ్‌ నిధిపై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. అందుకుని ఈపీఎఫ్‌వో ప్రత్యామ్నాయ ఫార్ములా కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

చ‌ద‌వండి: రాష్ట్రంలో ప్రతి సెకన్‌కు ఒక మొబైల్‌ : గుడివాడ అమ‌ర్‌నాథ్‌
సర్వీస్‌ కాలం..
అదనపు పెన్షన్‌ కోరుకునే వారు ఎంత అదనపు మొత్తం ఇప్పుడు జమ చేయాలన్నది ఆసక్తికరంగా మారింది. నిబంధనల ప్రకారం రిటైర్మెంట్‌ నాటికి ఈపీఎస్‌ పథకం కింద పదేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకుంటే పెన్షన్‌కు అర్హత లభిస్తుంది. ఈపీఎస్‌ కింద సర్వీస్‌ ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత అధికంగా పెన్షన్‌ అందుకోగలరు. అధిక పెన్షన్‌ ఆప్షన్‌ ఇవ్వాలా? వద్దా? అనేదానికి కూడా ఇదే ప్రామాణికం అవుతుంది. ఈపీఎస్‌ 95 కింద 20 ఏళ్లకు పైగా సర్వీస్‌ ఉన్న వారు అధిక పెన్షన్‌ ఆప్షన్‌తో ఎక్కువగా ప్రయోజనం పొందుతారన్నది ప్రాథమిక అంచనా.
పెట్టుబడి వారసులకు రాదు..
ఈపీఎస్‌ సభ్యుడు, అతని జీవిత భాగస్వామి, వారి మరణానంతరం వైకల్యంతో ఉన్న 25 ఏళ్లకు మించని పిల్లల వరకు పెన్షన్‌ వస్తుంది. వీరి తదనంతరం పింఛను నిధిని వారసులకు చెల్లించరు. దీంతో దీన్ని మంచి సాధనం కాదని చాలా మంది అనుకుంటారు. ప్రైవేటు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ యాన్యుటీ ప్లాన్‌లో చివర్లో పెట్టుబడి తిరిగిచ్చే ప్లాన్‌లో గరిష్ట రాబడి 6.87 శాతంగా ఉంటే.. పెట్టుబడి తిరిగి ఇవ్వని (ఈపీఎస్‌ మాదిరి) ఆప్షన్‌లో రాబడి 8.6 శాతంగా ఉంది.

ఇంతకంటే అధిక రాబడిని, ప్రభుత్వ హామీతో ఇచ్చే ఏదైనా సాధనం ఉందంటే.. నిస్సందేహంగా దానికి వెళ్లొచ్చు. ఈపీఎస్‌లో కనీసం 15 ఏళ్ల సర్వీస్‌ ఉన్న వారికి సైతం ఇంతకంటే అధిక రాబడే వస్తుంది. రిటైర్మెంట్‌ తర్వాత ఎక్కువ కాలం జీవించి లేని సందర్భాల్లో పెన్షన్‌ ఫండ్‌ను తిరిగిచ్చే ప్లాన్‌ మెరుగైనది అవుతుంది. కానీ, రిటైర్మెంట్‌ తర్వాత ఎంత కాలం జీవించి ఉంటామన్నది ఎవరికీ తెలియదు.

చ‌ద‌వండి:​​​​​​​ జాయింట్ ఆప్ష‌న్ ఇచ్చారా... అధిక పెన్ష‌న్‌కు మీకు అర్హ‌త ఉందా..?
దేనికైనా కట్టుబడి ఉండాలి?
ఈపీఎస్‌ 95 కింద పెన్షన్‌ లెక్కింపు అనేది పెన్షన్‌ సర్వీస్, బేసిక్‌ వేతనంపై ఆధారపడి ఉంటుంది. ఈపీఎస్‌ 95 పథకం 1995 నవంబర్‌ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం హామీగా ఉంటుంది. ఆరంభంలో రూ.5,000 బేసిక్‌ శాలరీ పరిమితి విధించారు. 2001 జూన్‌ నుంచి రూ.6,500 చేశారు. ఆ తర్వాత 2014 సెప్టెంబర్‌ నుంచి రూ.15,000కు పెంచారు. ఇంతకంటే అధిక వేతం తీసుకుంటున్నా.. ఈపీఎస్‌కు అధికంగా జమ చేసే అవకాశం లేక రిటైర్మెంట్‌ తర్వాత తక్కువ పెన్షన్‌ తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రూ.15,000 పరిమితి తొలగిపోయింది.
చివరి ఐదేళ్ల కాలంలో...
రిటైర్మెంట్‌కు ముందు చివరి ఐదేళ్ల కాలంలో ఉన్న సగటు బేసిక్‌ వేతనం ఆధారంగా పెన్షన్‌ అందుకోవడానికి అర్హులు అవుతారు. సుప్రీంకోర్టు ఆదేశాలను యథాతథంగా అమలు చేస్తే ఎక్కువ సర్వీస్‌ ఉండి.. అధిక మూలవేతనం, డీఏ కలిగిన వారికి ఎక్కువ పెన్షన్‌ రిటైర్మెంట్‌ తర్వాత వస్తుంది. కానీ, ఈపీఎఫ్‌వో వైపు నుంచి పారదర్శకత లోపించింది. ఎంత పెన్షన్‌ ఇస్తారో చెప్పకుండా, ఈపీఎఫ్‌వో నిర్ణయించిన సూత్రం మేరకు పెన్షన్‌ తీసుకునేందుకు సమ్మతమేనంటూ అంగీకారం  తెలియజేయాలని ఆన్‌లైన్‌ దరఖాస్తులో షరతు విధించినట్లు తెలిసింది.
భారం ప‌డ‌కూడ‌ద‌నే....
కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌ పథకంలో చేసే మార్పులకు అంగీకారం తెలపాలని కూడా కోరుతోంది. అధిక పెన్షన్‌ ఆప్షన్‌ ఇచ్చినా, తనపై చెల్లింపుల భారం పడకుండా ఈపీఎఫ్‌వో చూస్తున్నట్లు అర్థమవుతోంది. పైగా 2014 నాటి నిబంధనల సవరణ తర్వాత వాస్తవ వేతనంపై జమలు చేస్తున్న వారు సైతం ఇప్పుడు అధిక పెన్షన్‌ పొందాలంటే.. నాడు ఈపీఎఫ్‌వో నుంచి ఉద్యోగి, సంస్థ ఉమ్మడిగా తీసుకున్న అనుమతి పత్రాన్ని సమర్పించాలని ఈపీఎఫ్‌వో నిబంధన విధించింది. ఇంతకాలం అధిక చందాలను అనుమతిస్తూ, ఇప్పుడు అనుమతి ఉండాలని కోరడమే విడ్డూరంగా ఉంది.

చ‌ద‌వండి: కార్డియాక్ అరెస్ట్‌కు గురైతే... సీపీఆర్ ఎలా చేయాలో తెలుకోండి
ప్రత్యామ్నాయం ఎన్‌పీఎస్‌
అధిక పింఛను ఆప్షన్‌కు ఈపీఎఫ్‌వో దరఖాస్తు తీసుకుంటున్నప్పటికీ.. అందులో పారదర్శకత లేదు. అధిక పింఛను అంటే ఎంత చెల్లిస్తామనే స్పష్టత లేదు. అన్నింటికీ కట్టుబడి ఉంటాము, షరతులకు అంగీకరిస్తాము? అన్న అంగీకారాన్ని తీసుకుంటోంది. కనుక రిటైర్మెంట్‌ తర్వాత మెరుగైన పింఛను కోరుకునే వారు ఈపీఎస్‌నే నమ్ముకోవాలనేమీ లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌), ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు.

పన్ను ప్రయోజనంతో కూడిన రాబడి కోరుకునే వారికి ఎన్‌పీఎస్‌ మెరుగైనది. రిటైర్మెంట్‌ తర్వాత ఎన్‌పీఎస్‌ కింద సమకూరిన మొత్తం నిధిలో 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీనిపై ఎలాంటి పన్ను ఉండదు. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్‌ తీసుకోవాలి. యాన్యుటీ అనేది పెన్షన్‌ ప్లాన్‌. ఇక్కడి నుంచి కనీసం మరో 20 ఏళ్ల సర్వీసు ఉన్న వారు ఎన్‌పీఎస్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని ఉదాహరణలు చూద్దాం.

- 1980 జనవరి 1న జన్మించిన వారు ఎన్‌పీఎస్‌ను ఎంపిక చేసుకుని ప్రతి నెలా రూ.2,000 చొప్పున, ఇక్కడి నుంచి మరో 17 ఏళ్లపాటు అంటే 60 ఏళ్ల వరకు ఇన్వెస్ట్‌ చేస్తే.. 10 శాతం రాబడి ప్రకారం రూ.10.7 లక్షలు సమకూరుతాయి. 40 శాతంతో యాన్యుటీ ప్లాన్‌ తీసుకుంటే 6 శాతం రాబడి రేటు ప్రకారం 2147 పెన్షన్‌గా వస్తుంది. లేదు 100% నిధితో యాన్యుటీ ప్లాన్‌ తీసుకుంటే రూ.5,367 పెన్షన్‌గా లభిస్తుంది.  
- 1990 జనవరి 1న జన్మించిన వారు ప్రతి నెలా రూ. 2,000ను ఎన్‌పీఎస్‌లో జమ చేసుకుంటే, 60 ఏళ్ల నాటికి 10 శాతం రాబడి రేటు ఆధారంగా రూ.33 లక్షలు సమకూరుతాయి. 40% నిధితో యాన్యుటీ ప్లాన్‌ తీసుకుంటే రూ. 16,594గా లభిస్తుంది.
ఇవి గమనించండి
- ఈపీఎస్‌ కింద కనీసం పదేళ్ల సర్వీస్‌ ఉన్న వారికే 58 ఏళ్ల తర్వాత నుంచి పెన్షన్‌ లభిస్తుంది.
- ఉద్యోగి మరణిస్తే పీఎఫ్‌ ఖాతాలో ఉన్న మొత్తాన్ని వారసులకు ఇస్తారు. కానీ, ఈపీఎస్‌ సభ్యుడు మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి పెన్షన్‌లో సగమే చెల్లిస్తారు.
- అధిక పెన్షన్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే, గత కాలానికి సంబంధించి అదనపు చందాలను ఇప్పుడు చెల్లించాలి. ఈపీఎఫ్‌ బ్యాలన్స్‌ నుంచి దీన్ని మిననహాయించేట్టు అయితే.. భవిష్యత్తులో పిల్లల విద్య, సొంతిల్లు వంటి లక్ష్యాల అవసరాలకు నిధి అందుబాటులో ఉండదు. ఇంతకాలం పోగు చేసుకున్న మొత్తంపై కాంపౌండింగ్‌ ప్రయోజనం కోల్పోతారు కనుక దీన్ని ఆలోచించి నిర్ణయించుకోవాలి.

Published date : 06 Mar 2023 06:12PM

Photo Stories