Central and State Employees: పాత పెన్షన్ విధానానే అమలు చేయాలి
గద్వాల న్యూటౌన్: 2004 తర్వాత నియమితులైన కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులందరికి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని గద్వాల బ్రాంచ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ బంగి రంగారావు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉపాధ్యాయ, ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు కొత్త పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అలుపెరగని పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని జనవరి 2004 తర్వాత వచ్చిన ఉద్యోగులకు ముందుగా కేంద్రం వర్తింపజేసిందని, ఆతర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు వర్తింపజేశాయని తెలిపారు. ఈవిధానం 1–4–2010 నుంచి తర్వాత నియామమైన ఎల్‌ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులకు సైతం వర్తించిందన్నారు. దీంతో ఈ రంగాల ఉద్యోగులు కూడా పోరుబాట పట్టాల్సి వచ్చిందన్నారు. ఒక ఆర్డినెన్స్ ద్వారా కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేసిందని, 2014లో పార్లమెంట్‌లో చట్టం ఆమోదించబడిందన్నారు. ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, రాజ్యాంగం ద్వార సంక్రమించిన పెన్షన్ సదుపాయాన్ని అత్యంత హేయమైన పద్ధతిలో హరించిందని విమర్శించారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించి న్యాయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ నాయకులు సూరజ్, చంద్రశేఖర్, రాఘవేంద్ర, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.