Indian School of Business: దేశంలో టాప్ ర్యాంకింగ్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)..
రాయదుర్గం: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) మరోసారి దేశంలోని బిజినెస్ స్కూళ్లలో టాప్‌లో నిలిచింది. ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్‌టీ) ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్స్ ర్యాంకింగ్స్–2024ను సోమవారం విడుదల చేశారు.
ఈ ర్యాంకింగ్స్‌లో వరుసగా మూడవ ఏడాదీ హైదరాబాద్ ఐఎస్‌బీ నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది. ఆసియా స్థాయిలో నంబర్–2గా గుర్తింపు పొందింది. ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్స్ ర్యాంకింగ్స్‌ను ప్రతి ఏటా విడుదల చేస్తుంటారు.
వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించగా.. భవిష్యత్తు ఉపయోగం విషయంలో ఐఎస్‌బీ నంబర్ వన్ స్థానం పొందింది. బోధనా పద్ధతులు, మెటీరియల్స్ విషయంలో 25, డబ్బుకు తగిన విలువలో 15, తయారీ రంగంలో 27, ప్రోగ్రామ్ డిజైన్‌లో 28వ స్థానం పొందింది.
గత ఏడాది 29..ఈ ఏడాది 26
అంతర్జాతీయ స్థాయిలో చూస్తే (గ్లోబల్ ర్యాంకింగ్స్) ఈ ఏడాది ఐఎస్‌బీ 26వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ర్యాంకు మెరుగుపర్చుకోవడం విశేషం. 2023లో ఐఎస్‌బీ 29వ స్థానంలో నిలిచింది.
కాగా దేశంలో ఐఎస్‌బీ మూడేళ్లుగా నంబర్ వన్ స్థానంలో నిలువడంపై విద్యాసంస్థ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అండ్ డిజిటల్ లెరి్నంగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రొఫెసర్ దీపామణి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ప్రపంచానికి భవిష్యత్తు నాయకులను అందజేసే అంతర్జాతీయ స్థాయి నిర్వహణ సంస్థగా ఐఎస్‌బీ భవిష్యత్తులో మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగేందుకు సంస్థ డీన్ పర్యవేక్షణలో అన్ని చర్యలు చేపడతామని చెప్పారు.