Skip to main content

Engineering Students: క్లాసులు మొదలయ్యే ముందే ఇంజనీరింగ్‌ విద్యార్థులకు కౌన్సెలింగ్‌

Engineering Students  Guidelines document for engineering colleges

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ క్లాసులు మొదలయ్యే ముందే విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలని దేశంలోని అన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విశ్వవిద్యాలయాలకు విడుదల చేసింది. దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, గుర్తింపు పొందిన ఇంజనీరింగ్‌ కాలేజీలు దీన్ని పాటించాలంది.

మారిన బోధనా ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఏఐసీటీఈ రెండేళ్లుగా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలను కూడా కౌన్సిల్‌ పరిగణనలోనికి తీసుకుంది. జాతీయ విద్యావిధానంలో వస్తున్న మార్పులపై విద్యార్థులకు తొలి దశలోనే అవగాహన కల్పించకపోవడమే మానసిక ఒత్తిడికి కారణమని భావిస్తోంది.

ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌తో కూడిన విధానం అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని విశ్వవిద్యాలయాలు ముందుకొచ్చాయి. ఇంజనీరింగ్‌ రెండో ఏడాది నుంచే పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో పాఠ్య ప్రణాళికలో మార్పు చేశారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఒక్కసారిగా మూస విధానం నుంచి స్వతహాగా ఆలోచించే విద్యావిధానంలో అడుగుపెడుతున్నారు. ఇది కూడా మానసిక ఒత్తిడికి కారణమవుతోందని ఏఐసీటీఈ అధ్యయనంలో తేలింది.  

బ్యాక్‌లాగ్స్‌తోపెరుగుతున్నఒత్తిడి... 
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిబంధనల ప్రకారం ప్రతి ఇంజనీరింగ్‌ కాలేజీలో మానసిక నిపుణులను నియమించాలి. ఇంటర్మీడియట్‌ విద్య వరకూ విద్యార్థులు బట్టీ పద్ధతిలో చదువుతున్నారు. ఇంజనీరింగ్‌ విద్య ఇందుకు భిన్నంగా ఉంటోంది. ఏదో ఒక ప్రశ్నకు సమాధానం రాబట్టే పద్ధతి ఉండదు.

కంప్యూటర్‌ సైన్స్‌లో గణితం భాష ఒక్కసారిగా మారిపోతోంది. రెండో ఏడాదికి వచ్చేసరికి అనేక కంప్యూటర్‌ లాంగ్వేజ్‌లను విద్యార్థి నేర్చుకోవడమే కాకుండా, దాని ఆధారంగా ప్రయోగాత్మకంగా ఫలితాలు సాధించాల్సి ఉంటుంది. సివిల్, మెకానికల్‌లోనూ బేసిక్‌ ఇంటర్‌ విద్య స్థానంలో ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.

విద్యార్థి వ్యక్తిగతంగా స్కిల్‌ పెంచుకుంటే తప్ప ఈ పరిస్థితుల్లో ముందుకెళ్లడం కష్టం. ఈ కారణంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులకు బ్యాక్‌లాగ్స్‌ ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే విద్యార్థి మానసిక ఒత్తిడికి కారణమవుతోంది. నిపుణులు విద్యార్థి మానసిక స్థితిని కౌన్సెలింగ్‌ ద్వారా మెరుగుపరచాలని మండలి సూచిస్తోంది.  

నైపుణ్య కొరత కూడా కారణమే.. 
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ వంటి కొత్త కంప్యూటర్‌ కోర్సుల్లో విద్యార్థులు ఎక్కువ శాతం ప్రతిభ కనబర్చడం లేదని మండలి భావిస్తోంది. ప్రతి ఏటా మార్కెట్లోకి వస్తున్న విద్యార్థుల్లో కేవలం 8 శాతం మాత్రమే అవసరమైన నైపుణ్యం కలిగిఉంటున్నారని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి.

ఈ అంతరాన్ని పూడ్చడానికి రెండో ఏడాది నుంచే సంబంధిత రంగాల్లో ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ వచ్చేలా ప్రాజెక్టులు పూర్తి చేయాలనే నిబంధన విధించారు. ఇది కూడా నామమాత్రంగా జరగడం వల్ల విద్యార్థులు ఉపాధి పొందే విషయంలో, ఉద్యోగంలో రాణించే విషయంలో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని నిపుణులు అంటున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఆరు నెలలకోసారి విద్యార్థి మానసిక ధోరణిని పరిశీలించాలని ఏఐసీటీఈ సూచించింది.  

 

Published date : 20 Mar 2024 12:43PM

Photo Stories