Boeing Aero Space: బోయింగ్ ఏరోస్పేస్ ట్రైనింగ్‌కు ఎంపికైన పాలిటెక్నిక్ విద్యార్థులు

మురళీనగర్: ప్రపంచంలోనే అతి పెద్ద ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్ ఏరో స్పేస్‌లో శిక్షణకు పాలిటెక్నిక్ విద్యార్థులను సోమవారం ఎంపిక చేశారు. ఈ సంస్థ తమ కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా లెర్నింగ్ లిక్స్ ఫౌండేషన్ కింద పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
దీనిలో భాగంగా విశాఖలోని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నారాయణ రావు పర్యవేక్షణలో ఈ ఎంపిక కార్యక్రమం జరిగింది. విజయనగరం, కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ మెకానికల్ విద్యార్థులు ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఏరోస్పేస్ శిక్షణ ద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉండే ఉపాధి అవకాశాలను ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నారాయణరావు విద్యార్థులకు వివరించారు.
IITM Recruitment: ఐఐటీఎంలో ప్రాజెక్టు పోస్టులకు దరఖాస్తులు..
బోయింగ్ సంస్థ ఏరోస్పేస్ రంగంలో నిర్వహిస్తున్న వివిధ విభాగాలు, ఉత్పత్తి రంగంలో వారి ప్రాముఖ్యతను సంస్థ ఏజీఎం ప్రదీప్ కుమార్, ట్రైనింగ్ ఇన్‌చార్జి రోషన్ విద్యార్థులకు తెలిపారు. అనంతరం విద్యార్థుల ఎంపిక ప్రక్రియ జరిగింది. కార్యక్రమంలో పాలిటెక్నిక్ మెకానికల్ హెడ్ మధుకుమార్, అధ్యాపకులు హేమలత, రవికాంత్ పాల్గొన్నారు.
31 మందికి అవకాశం : ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌కు 31 మందిని బోయింగ్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధులు ఎంపిక చేశారు. వీరిలో కంచరపాలెం పాలిటెక్నిక్ నుంచి 22 మందిని ఎంపిక చేయగా వీరిలో 9 మంది బాలికలు ఉన్నారు. విజయనగరం పాలిటెక్నిక్ నుంచి 9 మందిని శిక్షణకు ఎంపిక చేశారు. ఆరునెలల పాటు విశాఖపట్నం ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సంస్థలో ఏరోస్పేస్ రంగంలో శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు నెలకు రూ.3000 ఉపకార వేతనంతోపాటు ప్రతి విద్యార్థికి 35 వేలు ఫీజు బోయింగ్ సంస్థ భరిస్తుంది.