Jagananna Vidya Deevena: నేడు జగనన్న విద్యా దీవెన
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కేవలం చదువుతోనే పేదల తలరాతలు మారుతాయని, పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరచూ చెబుతారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఆయన విద్యా విప్లవాన్ని తీసుకుని వచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇంటర్మీడియెట్ తర్వాత పై చదువులు చదివే విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. బీటెక్, ఎంటెక్, బీ ఫార్మసీ, ఎంబీఏ, ఎం ఫార్మసీ తదితర ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్(జగనన్న విద్యా దీవెన) అందిస్తున్నారు. విద్యా సంవత్సరంలో ప్రతి త్రైమాసికానికి సంబంధించిన కళాశాలల ఫీజులను ఆ త్రైమాసికంలోనే చెల్లిస్తూండటంతో పేద విద్యార్థుల చదువులు సాఫీగా సాగుతున్నాయి. చిత్తూరు జిల్లా నగరిలో సోమవారం జరిగే బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడో విడత జగనన్న విద్యా దీవెన సొమ్ము జమ చేయనున్నారు. ఈ పథకం కింద జిల్లాలోని 36,090 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.24,63,37,848 మేర జమ చేయనున్నారు.
నియోజకవర్గం | విద్యార్థులు | నిధులు(రూ.లలో) |
కాకినాడ సిటీ | 6,002 | 4,29,51,322 |
కాకినాడ రూరల్ | 5,108 | 3,69,60,692 |
పెద్దాపురం | 5,026 | 3,50,35,918 |
పిఠాపురం | 6,137 | 4,11,18,209 |
ప్రత్తిపాడు | 4,737 | 3,02,03,270 |
జగ్గంపేట | 3,611 | 2,42,97,570 |
తుని | 5,469 | 3,57,70,857 |
అర్హులందరికీ జమ
అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ జగనన్న విద్యా దీవెన మూడో విడత సొమ్ములు అందేలా చర్యలు తీసుకుంన్నాం. కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యాన సోమవారం జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహిస్తాం. – డీవీ రమణమూర్తి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి