Skip to main content

UPSC Results 2024: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో టాప్‌–25 ర్యాంకర్లలో ఉన్న‌ మహిళలు వీరే!!

ఆకాశంలో సగం అని చాటడం వేరు.. నిరూపించడం వేరు. నేటి అమ్మాయిలు చదువులో, మేధలో, సమర్థమైన అవకాశాలు అందుకోవడంలో తమ ఆకాశం సగం అని నిరూపిస్తున్నారు.
UPSC Civil Services Result 2023 Highlights

యూపీఎస్సీ 2023 టాప్‌ 25 ర్యాంకుల్లో 10 మంది అమ్మాయిలు ఉన్నారు. మన తెలుగు అమ్మాయి అనన్య (3), రుహానీ (5), సృష్టి (6), అన్ మోల్‌ రాథోడ్‌ (7), నౌషీన్ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10), మేధా ఆనంద్‌ (13), స్వాతి శర్మ (17), వార్దా ఖాన్ (18), రితికా వర్మ (25). 

‘స్వయం సమృద్ధి, ‘ఆర్థిక స్వాతంత్య్రం’, ‘నిర్ణయాత్మక అధికారిక పాత్ర’, ‘పరిపాలనా రంగాల ద్వారా జనావళికి సేవ’, ‘సామర్థ్యాలకు తగిన స్థానం’, ‘లక్ష్యాలకు తగిన సామర్థ్యం’.. ఇవీ నేటి యువతుల విశిష్ట ఆకాంక్షలు, అభిలాషలు, లక్ష్యాలు. అందుకే దేశంలో అత్యంత క్లిష్టతరమైన సివిల్స్‌ ప్రవేశ పరీక్షల్లో వీరు తలపడుతున్నారు. గెలుస్తున్నారు. నిలుస్తున్నారు. యూపీఎస్సీ 2023 ఫలితాల్లో టాప్‌ 25లో పది ర్యాంకులు అమ్మాయిలు సాధించడం గర్వపడాల్సిన విషయం.

మొత్తం 1016 మంది అభ్యర్థులు ఎంపిక కాగా వీరిలో అమ్మాయిలు 352 మంది ఉండటం ముందంజను సూచిస్తోంది. తల్లిదండ్రులకు భారం కాకుండా ఒకవైపు ఉద్యోగాలు చేస్తూ లేదా ఇంటి దగ్గర చదువుకుంటూ వీరిలో చాలామంది ర్యాంకులు సాధించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి టాప్‌ 3 ర్యాంక్‌ సాధించి తెలుగు కీర్తి రెపరెపలాడించింది. కోచింగ్‌ సెంటర్‌ల మీద ఆధారపడకుండా సొంతగా చదువుకోవడం ఒక విశేషమైతే, మొదటి అటెంప్ట్‌లోనే ఆమె భారీ ర్యాంక్‌ సాధించడం మరో విశేషం. అలాగే ఢిల్లీకి చెందిన సృష్టి దమాస్‌ 6వ ర్యాంక్, వార్దా ఖాన్‌ 18వ ర్యాంక్‌ సాధించి స్ఫూర్తిగా నిలిచారు. మిగిలిన ఏడుగురు విజేతల వివరాలు.

Civils Ranker Ananya Reddy Success Story: ఎలాంటి కోచింగ్‌ లేకుండానే.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో మూడో ర్యాంకు

రుహానీ(5వ ర్యాంకు)
హర్యానాకు చెందిన రుహానీ హర్యానాలోని గుర్‌గావ్‌లోనూ ఢిల్లీలోనూ చదువుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ లెక్చరర్లు. ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన రుహానీ ‘ఇగ్నో’ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసింది. 2020లో ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌కు ఎంపికయ్యి నీతి ఆయోగ్‌లో మూడేళ్లు పని చేసింది. కాని ఐఏఎస్‌ కావడం ఆమె లక్ష్యం. మరో అటెంప్ట్‌లో ఆమె ఐపీఎస్‌కు ఎంపికయ్యింది. హైదరాబాద్‌లో శిక్షణ పొందుతూ ఆఖరుసారిగా 6వ అటెంప్ట్‌లో టాప్‌ ర్యాంక్‌ సాధించింది. పేద వర్గాల ఆర్థిక స్థితిని మెరుగు పర్చడం తన లక్ష్యం అంటోంది రుహానీ.

అన్‌మోల్‌ రాథోడ్(7వ ర్యాంకు)
జమ్ము నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉద్రానా అనే మారుమూల పల్లె అన్‌మోల్‌ది. తండ్రి బ్యాంక్‌ మేనేజర్, తల్లి ప్రిన్సిపాల్‌. ఇంటర్‌ వరకూ జమ్ములో చదువుకున్నా గాంధీనగర్‌లో బి.ఏ.ఎల్‌.ఎల్‌.బి. చేసింది. 2021లో చదువు పూర్తయితే అదే సంవత్సరం సివిల్స్‌ రాసింది. కాని ప్రిలిమ్స్‌ దాటలేకపోయింది. 2022లో మళ్లీ ప్రయత్నిస్తే 2 మార్కుల్లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లే అవకాశం పోయింది. 2023లో మూడవసారి రాసి 7వ ర్యాంక్ పొందింది. అయితే ఈలోపు ఆమె ‘జమ్ము కశ్మీర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌’ పోటీ పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికైంది. ఆ ఉద్యోగ శిక్షణ తీసుకుంటూనే సివిల్స్‌ సాధించింది. ‘రోజుకు ఎనిమిది గంటలు చదివాను. చిన్నప్పటి నుంచి నాకు తగాదాలు తీర్చడం అలవాటు. రేపు కలెక్టర్‌ను అయ్యాక ప్రజల సమస్యలను తీరుస్తాను’ అంటోందామె.

నౌషీన్‌(9వ ర్యాంకు)
‘మాది ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌. కాని ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల అక్కడి విద్యార్థుల రాజకీయ, సామాజిక అవగాహన స్థాయి నన్ను ఆశ్చర్యపరిచి సివిల్స్‌ రాసేలా పురిగొల్పింది. 2020 నుంచి ప్రయత్నించి నాలుగో అటెంప్ట్‌లో 9వ ర్యాంక్‌ సాధించాను. చరిత్రలో ఈ రెండు ఘటనలు జరగకపోయి ఉంటే బాగుండేదని వేటి గురించి అనుకుంటావ్‌ అంటూ నన్ను ఇంటర్వ్యూలో అడిగారు– రెండు ప్రపంచ యుద్ధాలు జరక్కపోయి ఉంటే బాగుండేదని, ఆసియా–ఆఫ్రికా దేశాలు వలసవాద పాలన కిందకు రాకుండా ఉంటే బాగుండేదని చెప్పాను. నా జవాబులు బోర్డ్‌కు నచ్చాయి’ అని తెలిపింది నౌషీన్‌. ‘ఐఏఎస్ ఆఫీసర్‌గా పని చేయడం గొప్ప బాధ్యత. చాలా మంది జీవితాల్లో మార్పు తేవచ్చు’ అందామె.

ఐశ్వర్యం ప్రజాపతి(10వ ర్యాంకు)
లక్నోకు చెందిన ఐశ్వర్యం ప్రజాపతి రెండో అటెంప్ట్‌లో 10వ ర్యాంక్‌ సాధించింది. ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఉత్తరాఖండ్‌’లో చదువుకున్న ఐశ్వర్యం ఒక సంవత్సరం పాటు విశాఖపట్నం ఎల్‌ అండ్‌ టిలో ట్రయినీగా పని చేసింది. ‘నేను ఇన్ని గంటలు చదవాలి అని లెక్కపెట్టుకోని చదవలేదు. చదివినంత సేపు నాణ్యంగా చదవాలి అనుకున్నాను. నన్ను కలెక్టర్‌గా చూడాలన్నది మా అమ్మానాన్నల కల. సాధిస్తానని తెలుసుకాని ఇంత మంచి ర్యాంక్‌ వస్తుందనుకోలేదు. ఎవరైనా సరే తమకు ఏది నచ్చుతుందో ఆ దారిలో వెళ్లినప్పుడే సాధించాలన్న మోటివేషన్‌ వస్తుంది’ అని తెలిపిందామె.

UPSC Civils 18th Ranker Wardah Khan : ల‌క్ష‌ల్లో వ‌చ్చే జీతాన్ని వ‌దిలి.. ల‌క్ష్యం కోసం వ‌చ్చి సివిల్స్ కొట్టానిలా.. అతి చిన్న వ‌య‌స్సులోనే..

మేధా ఆనంద్(13వ ర్యాంకు)
‘మా అమ్మ ఆగ్రాలో బ్యాంక్‌ ఉద్యోగం చేస్తుంది. కలెక్టర్‌ ఆఫీసు మీదుగా వెళ్లినప్పుడల్లా నా కూతురు కూడా ఒకరోజు కలెక్టర్‌ అవుతుంది అనుకునేది. నాతో అనేది. నా లక్ష్యం కూడా అదే. కాలేజీ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నప్పటి నుంచి సివిల్స్‌ రాయాలని తర్ఫీదు అయ్యాను. సెకండ్‌ అటెంప్ట్‌లో 311వ ర్యాంక్‌ వచ్చింది. కాని నేను సంతృప్తి చెందలేదు. ప్రస్తుతం నేను నార్త్‌ రైల్వేస్‌లో పని చేస్తున్నాను. పని చేస్తూనే 50 లోపు ర్యాంక్‌ కోసం కష్టపడ్డాను. కాని 13వ ర్యాంక్‌ వచ్చింది. నేటి మహిళల్లోని సామర్థ్యాలు పూర్తిగా సమాజానికి ఉపయోగపడటం లేదు. వారికి ఎన్నో అడ్డంకులున్నాయి. వాటిని దాటి వారు ముందుకు రావాలి. కలెక్టర్‌ అయ్యాక నేను స్త్రీలు ముఖ్యభూమికగా ఆర్థిక వికాసం కోసం కృషి చేస్తాను’ అని తెలిపింది మీరట్‌కు చెందిన మేధా ఆనంద్‌.

స్వాతి శర్మ(17వ ర్యాంకు)
జెంషడ్‌పూర్‌కు చెందిన స్వాతి శర్మ తను సాధించిన 17 ర్యాంక్‌తో జార్ఖండ్‌లో చాలామంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తానని భావిస్తోంది. ‘మా రాష్ట్రంలో అమ్మాయిలకు ఇంకా అవకాశాలు దొరకాల్సి ఉంది’ అంటుందామె. అంతేకాదు కలెక్టరయ్యి దిగువ, గిరిజన వర్గాల మహిళల అభ్యున్నతికి పని చేయాలనుకుంటోంది. ‘ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదివాను. ఆ చదువే ఐఏఎస్ చదవమని ఉత్సాహపరిచింది. ఢిల్లీలో సంవత్సరం ఆరు నెలలు కోచింగ్‌ తీసుకున్నాను. రెండు మూడుసార్లు విఫలమయ్యి నాకు నేనే తర్ఫీదు అయ్యి ఇప్పుడు 17వ ర్యాంక్‌ సాధించాను. మా నాన్న రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్, అమ్మ గృహిణి. బాగా చదువుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే పిల్లలు తల్లిదండ్రులకిచ్చే కానుక’ అంది స్వాతి శర్మ.

రితికా వర్మ (25వ ర్యాంకు)
‘ఎన్నో సమస్యలున్న బిహార్‌ రాష్ట్రం కోసం పని చేయాల్సింది చాలా ఉంది. మాది పాట్నా. మా నాన్న ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌లో మేనేజర్‌. ప్రస్తుతం మేము గుంటూరులో ఉంటున్నాం. ఢిల్లీలో బిఎస్సీ మేథ్స్‌ చదివిన నేను సివిల్స్‌ ద్వారా పేదల కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. నాకు సాహిత్యం అంటే ఆసక్తి ఉంది. బిహార్‌లో పేదలకు భూమి సమస్య, పని సమస్య ఉన్నాయి. తక్కువ వేతనాల వల్ల పల్లెల నుంచి నిరవధికంగా వలస సాగుతోంది. కలెక్టర్‌గా నేను వీరి కోసం పని చేయాలనుకుంటున్నాను’ అని తెలిపింది రితికా వర్మ.

UPSC Civils Ranker Hanitha Success Story: వీల్‌ చెయిర్‌కే పరిమితమైనా..పట్టువిడవని విశ్వాసంతో సివిల్స్‌ సాధించిన వైజాగ్‌ యువతి

Published date : 20 Apr 2024 12:21PM

Photo Stories