UPSC Civils Ranker Hanitha Success Story: వీల్ చెయిర్‌కే పరిమితమైనా..పట్టువిడవని విశ్వాసంతో సివిల్స్ సాధించిన వైజాగ్ యువతి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2023 పరీక్ష తుది ఫలితాల్లో విశాఖపట్టణానికి చెందిన హనిత వేములపాటి సివిల్స్‌లో 887వ ర్యాంక్ సాధించి సత్తాచాటారు. విధి వంచించినా.. విశ్వాసం ఆమెను నిలబెట్టింది. కాళ్లు కదలకపోయినా.. పట్టువిడవని సంకల్పం తనను ముందుకు నడిపింది. ఊహించని అనారోగ్యం ఇంటికే పరిమితం చేసినా.. చదువును మాత్రం ఏనాడు దూరం చేసుకోలేదు. దూరవిద్య ద్వారా చదువులు పూర్తి చేసి కుటుంబ సభ్యులు, గురువుల సహకారంతో సివిల్స్ సాధించారు. ఈ సందర్బంగా సివిల్స్ ర్యాంకర్ హనితతో సాక్షి ఎడ్యుకేషన్. కామ్ ప్రత్యేక ఇంటర్వ్యూ
1. ఈ ర్యాంక్ వస్తుందని అనుకున్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు?
లేదండి. ఇంత మంచి ర్యాంక్ వస్తుందని అనుకోలేదు. చాలా హ్యాపీ.
2. ఇది మీ ఎన్నో అటెంప్ట్?
ఇది నాలుగో ప్రయత్నం.
3. మూడుసార్లు అపజయం ఎదురైనా కష్టపడి మళ్లీ ప్రయత్నించారు. ఆ జర్నీ ఎలా అనిపించింది? నాలుగో ప్రయత్నంలో విజయం సాధించడంపై మీ రియాక్షన్ ఏంటి?
జర్నీ అంత ఈజీ అని మాత్రం చెప్పను. ఫెయిల్యూర్ ఎదురైనంత మాత్రానా వెనకడుగు వేయకుండా ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సొంతమవుతుంది. నాలుగో ప్రయత్నంలో సివిల్స్ సాధించడం సంతోషంగా ఉంది.
4. సివిల్స్ సాధించడంపై మీ తల్లిదండ్రులు ఎలా ఫీలయ్యారు? రిజల్ట్ వచ్చాక ఏమన్నారు?
వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు. ఫైనల్లీ సాధించావ్ అని ప్రశంసించారు.
5. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి? రోజుకు ఎన్ని గంటలు చదివేవాళ్లు?
రోజుకు 8-10 గంటలు చదివేదాన్ని. ప్రిలిమ్స్‌కి దాదాపు 30 ఏళ్ల నుంచి వస్తున్న ప్రశ్నలు, మెయిన్స్‌కి 10 ఏళ్ల నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు వంటి వాటిమీద ఎక్కువగా ఫోకస్ చేసేదాన్ని.
6. ఇప్పుడు ర్యాంక్ సాధించారు కదా తర్వాత ఏం చేయబోతున్నారు? మీ లక్ష్యం ఏంటి?
ఐఏఎస్ అవ్వడమే నా జీవిత లక్ష్యం. 887 ర్యాంక్‌తో వస్తుందో లేదో తెలీదు. ఒకవేళ రాకపోతే మళ్లీ ఇంకోసారి సివిల్స్ రాస్తాను. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రిపరేషన్ మొదలుపెట్టాను.
7. మీ స్వస్థలం, కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి.
మాది వైజాగ్. మా తల్లితండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. నాన్న రైల్వే, అమ్మ ఐసీడీఎస్ గ్రేడ్-1 సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు.
8. సివిల్స్ రాయాలని మిమల్ని ఇన్స్‌పైర్ చేసిన వ్యక్తులెవరు? ఈ జర్నీలో మీకు సపోర్ట్‌గా ఎవరెవరు ఉన్నారు?
మా గురువు గారు శ్రీ రామధూత స్వామిగారు నన్ను చాలా మోటివేట్ చేసేవాళ్లు. ఈ జర్నీ మొత్తంలో నాకు మా ఫ్యామిలి, మా తాతయ్య సపోర్ట్ ఎక్కువగా ఉంది.