UPSC Civil Services Final Results 2023: సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. మొదటి వందలో నాలుగు ర్యాంకులు మనోళ్లకే..
సాక్షి, హైదరాబాద్: సివిల్స్‌లో ర్యాంకు సాధించడం దేశంలో చాలామంది కల. ఇందులో ఈసారీ తెలుగు విద్యార్థులు సత్తా చాటి తమ లక్ష్యాన్ని అందుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి మూడో ర్యాంకు సాధించారు. వంద లోపు ర్యాంకుల్లో ముగ్గురు తెలుగువాళ్లే ఉన్నారు. నందాల సాయి కిరణ్ 27వ ర్యాంకు సాధిస్తే, కేఎన్ చందన జాహ్నవి 50, మెరుగు కౌశిక్ 82వ ర్యాంకు సాధించారు. మొత్తం ర్యాంకుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 36 మంది ఉన్నారు. అలాగే, ఇతర కేంద్ర సర్వీసులకు 20 మందికిపైగా ఎంపికయ్యారు.
మొత్తమ్మీద కేంద్ర సర్వీసులకు 56 మందికిపైగా తెలుగు తేజాలు ఎంపికవడం విశేషం. అఖిల భారత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్– 2023 కోసం గత ఏడాది మే 28న ప్రిలిమ్స్ నిర్వహించింది. ప్రిలిమినరీలో అర్హత పొందిన వారికి గత నవంబర్‌లో మెయిన్స్ పరీక్ష నిర్వహించగా, ఈ పరీక్ష ఫలితాలను డిసెంబర్ 8న వెల్లడించారు.
మెయిన్స్‌లోనూ అర్హత పొందిన వారికి జనవరి 2, ఏప్రిల్ 9 మధ్య వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తంగా పొందిన మార్కుల ఆధారంగా ర్యాంకులను యూపీఎస్సీ మంగళవారం ప్రకటించింది. ఆలిండియా టాపర్‌గా లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాత్సవ నిలవగా, ఒడిశాకు చెందిన అనిమేష్ ప్రదాన్ రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించారు. 2022 సివిల్స్‌లోనూ తెలుగు విద్యార్థి ఉమాహారతి మూడో స్థానం పొందడం విశేషం.
1,016 మంది ఎంపిక
సివిల్స్–2023 కోసం యూపీఎస్సీ 1,016 మందిని ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కేటగిరీలో 347 మంది ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీల నుంచి 165, ఎస్టీ విభాగం నుంచి 86 మంది ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్–ఏ కేటగిరీకి 613 మంది, గ్రూప్ బీ సర్వీసెస్‌కు 113 మంది ఎంపికైనట్టు యూపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు పొందిన మార్కులను 15 రోజుల్లో తమ వెబ్‌సైట్‌లో ఉంచుతామని ప్రకటించింది.
విజేతలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు
సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల విజేతలకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ, ఏపీ నుంచి ఈసారి 50 మందికి పైగా ఎంపికవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
మహేష్ భగవత్ కృషి ఫలించింది
సివిల్స్ పరీక్షల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ గైడెన్స్ మంచి ఫలితాలను ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా శిక్షణ పొందుతున్న వారితో ప్రత్యక్షంగా, ఇతర రాష్ట్రాల వారితో ఆన్‌లైన్ ద్వారా ఆయన ఇచ్చిన సూచనలతో 200 మందికి పైగా ర్యాంకులు సాధించారు. అందులో తెలంగాణ నుంచి అనన్య రెడ్డి సహా జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్న వారు కూడా ఉన్నారు. సివిల్స్ ప్రిపేరయ్యే వారికి వ్యక్తిత్వ వికాసం, పరీక్ష సమయాల్లో ఒత్తిడి, సమయ పాలన, ఇంటర్వ్యూలో వ్యవహరించాల్సిన తీరు తదితర అంశాలపై మహేష్ భగవత్ సూచనలు చేశారు.
Tags
- upsc civils final results 2023 released
- upsc result 2023 topper list
- Civils 2023 Topper Ananya Reddy
- upsc civils topper 2024
- UPSC
- UPSC Careers
- UPSC Notification
- CivilServices
- Civil services achievement
- Telugu students success
- Telangana and Andhra Pradesh representation
- Central services selection
- sakshieducation latest news