Skip to main content

TSPSC: ఇక అన్నీ సీబీ పరీక్షలే!

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీతో తీవ్ర అపవాదును మూటగట్టుకున్న Telangana State Public Service Commission (TSPSC) దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
TSPSC
ఇక అన్నీ సీబీ పరీక్షలే!

ఇప్పటికే ఆయా పరీక్షలు రద్దు చేసిన కమిషన్‌.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ నిర్వహించే అర్హత పరీక్షల్లో 50 వేల లోపు అభ్యర్థులున్న పరీక్షలను మాత్రమే సీబీటీ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) పద్ధతిలో నిర్వహిస్తోంది. అంతకంటే ఎక్కువున్నప్పుడు ఓఎంఆర్‌ (ఆప్టికల్‌ మార్క్‌ రికగ్నిషన్‌) ఆధారిత పరీక్షలను నిర్వహిస్తోంది. ఓఎంఆర్‌ ఆధారిత పరీక్షల నిర్వహణకు సుదీర్ఘ కసరత్తు అవసరం. ప్రశ్నపత్రా లను మూడు నెలలకు ముందుగానే ఖరారు చేసి రూపొందించడం, ఆ తర్వాత వాటిని అత్యంత గోప్యంగా ముద్రించడం, వాటిని పరీక్షా కేంద్రాలకు తరలించాల్సి వస్తోంది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఈ క్రమంలో ప్రశ్నపత్రాలను కంటికి రెప్పలా కాపాడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఓఎంఆర్‌ పరీక్షల విధానాన్ని క్రమంగా వదిలించుకోవాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలతో సహా అన్ని రకాల నియామక పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత పరీక్షా విధానంలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ దిశగా చర్యలు మొదలు పెట్టింది. 

చదవండి: TSPSC Paper Leak : న‌మ్మ‌లేని నిజాలు ఎన్నో.. 42 మంది టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకు సిట్‌ నోటీసులు.. ఇంకా..

లీకేజీకి చెక్‌..! 

సీబీటీ విధానంలో కఠినం, మధ్యస్థం, సులభతరం అనే మూడు కేటగిరీల్లో ప్రశ్న బ్యాంకులను తయారు చేసి సర్వర్‌లో అందుబాటులో ఉంచుతారు. ఎంతోముందుగా ప్రశ్నపత్రం ఖరారు చేయడం ఉండదు. పరీక్ష సమయంలో నిర్దేశించిన నిష్పత్తుల్లో అప్పటికప్పుడు ప్రశ్నలు అభ్యర్థులకు కంప్యూటర్‌లో ప్రత్యక్షమవుతాయి. అభ్యర్థులకు ప్రత్యేకంగా ప్రశ్నపత్రం ఏదీ ఇవ్వరు. కంప్యూటర్‌ స్క్రీన్‌లో ప్రత్యక్షమైన ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాయాల్సి ఉంటుంది. ఈ విధానంతో ప్రశ్నపత్రాల లీకేజీకి దాదాపు చెక్‌ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే సర్వర్‌ సిస్టంను హ్యాక్‌ చేయడం లాంటి ఇబ్బందులు ఉంటాయి. వీటిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక సైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు. 

చదవండి: High Court: తెలుగుభాషలోనూ ఈ ప్రశ్నపత్రం

సాధ్యాసాధ్యాల పరిశీలన 

సీబీటీ పరీక్షల నిర్వహణలో మరో కీలక అంశం మౌలిక వసతులు. సీబీటీ పరీక్షలను నిర్వహించాలంటే తగినన్ని కంప్యూటర్లతో ల్యాబ్‌లు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం అయాన్‌ డిజిటల్‌ లాంటి సంస్థలతో పలు సంస్థలు అవగాహన కుదుర్చుకుని సీబీటీ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. అయితే భారీ సంఖ్యలో అభ్యర్థులున్నప్పుడు సీబీటీ పరీక్షలు నిర్వహించడం సాధ్యమేనా? అనే కోణంలో కమిషన్‌ పరిశీలన చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్, పీజీ నీట్‌ తదితర పరీక్షలన్నీ సీబీటీ పద్ధతిలోనే జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు సగటున లక్ష నుంచి రెండు లక్షల వరకు అభ్యర్థులుంటున్నారు.

చదవండి: TSPSC: జూన్‌ నుంచి పేపర్ల కోసం ప్రయత్నాలు.. ఇంకా న‌మ్మ‌లేని నిజాలు ఎన్నో..

అందువల్ల వీటిని ఒకేరోజు కాకుండా విడతల వారీగా నిర్వహిస్తుండడంతో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఆ మేరకు సర్దుబాటు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షలను కూడా పూర్తిగా సీబీటీ పద్ధతిలో నిర్వహిస్తే అవసరమైన వ్యవస్థపై అధికారులు అంచనాలు తయారు చేస్తున్నారు. అభ్యర్థుల సంఖ్య లక్షల్లో ఉంటే ఏయే వ్యవస్థలను వినియోగించుకోవాలి? పరీక్షలను ఒకేరోజు కాకుండా విడతల వారీగా నిర్వహిస్తే ఏం చేయాలి? మౌలిక వసతుల కల్పన ఎలా? తదితర అంశాలపై దృష్టి సారించారు. ప్రత్యేక ప్రణాళికను రూపొందించిన తర్వాత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు సమాచారం. 

Published date : 23 Mar 2023 01:39PM

Photo Stories