Skip to main content

నిరుద్యోగ యువతకు స్టడీ సర్కిల్ ఫౌండేషన్ కోర్సు

రాష్ట్రంలో నిరుద్యోగ యువత కల ప్రభుత్వ కొలువు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో ఉద్యోగాల భర్తీకి ఉపక్రమించింది.
Alok Kumar
టీఎస్‌బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌

80 వేల ఉద్యోగాలను నేరుగా భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో నిరుద్యోగ యువతకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చినట్లయింది. సర్కారు కొలువే లక్ష్యంగా యువత సన్నద్ధమవుతోంది. కొందరైతే తాము పనిచేస్తున్న చిన్నాచితకా ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పి శిక్షణ సంస్థల ఎంపికలో బిజీ అయ్యారు. ఈక్రమంలో బీసీ నిరుద్యోగ యువత కోసం తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్‌ ప్రత్యేక కార్యాచరణతో రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులకు వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఫౌండేషన్ కోర్సు, శిక్షణ ఇవ్వనున్నట్లు టీఎస్‌బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌ ‘సాక్షి’కి వివరించారు. శిక్షణ యజ్ఞానికి సంబంధించిన కార్యాచరణ ఆయన మాటల్లోనే...

చదవండి: 

టీఎస్‌పీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్న గ్రూప్‌ –1 పోస్టులు ఇవే..

గ్రూప్స్ సిలబస్‌లోని ‘ తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం ’ ఎలా ప్రిపేర్ కావాలి ?

పోటీ పరీక్షల్లో జాగ్రఫీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?

మూడు నెలలకో బ్యాచ్‌..

ప్రభుత్వం పెద్దఎత్తున ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమవడంతో అభ్యర్థులు కఠోర దీక్షతో సిద్ధమవుతున్నారు. ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ/ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీని ఎంపిక చేసుకుని గ్రూప్‌ ఉద్యోగాలకు ఫౌండేషన్ కోర్సు ఇవ్వనున్నాం. వచ్చేనెల మొదటి వారంలో కోర్సును ప్రారంభించి మూడు నెలలపాటు కొనసాగిస్తాం. ప్రతి మూడు నెలలకు ఒక బ్యాచ్‌ పూర్తవుతుంది. మొత్తంగా లక్ష మంది అభ్యర్థులకు ఫౌండేషన్ కోర్సు అందిస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో గ్రూప్‌–1 అభ్యర్థులకు, డివిజన్ కేంద్రంలో గ్రూప్‌–2 అభ్యర్థులకు శిక్షణ ఇస్తాం. అభ్యర్థులను వడపోసి ఎంపిక చేస్తున్నాం. 

ప్రైవేటు కోచింగ్‌తో అనుసంధానం

ప్రస్తుతానికి టీఎస్‌బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారానే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. పోటీ, భవిష్యత్‌ అవసరాలపైన మరింత స్పష్టత రావాలి. ప్రైవేటు శిక్షణ సంస్థలతో కలిసి గతంలో ఇతర స్టడీ సర్కిళ్లు శిక్షణ ఇచ్చాయి. అయితే, ఈ అంశం పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనిది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా స్టడీ సర్కిళ్లు పనిచేస్తాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వివిధ కేటగిరీల్లో 15,610 మందికి శిక్షణ ఇవ్వగా, 2,200 మంది ఉద్యోగాలు సాధించారు.

Published date : 25 Mar 2022 05:30PM

Photo Stories