TSPSC Group I: ప్రిలిమినరీ కీ వివరాలు!
ప్రాథమిక కీ విడుదలకు ముందే అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను వారి ఓటీఆర్ లాగిన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటివరకు 60 శాతం స్కానింగ్ పూర్తయినట్లు సమాచారం. దీపావళి పండుగ తర్వాత స్కానింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి అక్టోబర్ 29 నాటికి ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 16న 1,019 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది హాజరైనట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
☛ TSPSC Group 1 - 2022 Question Paper with Key (Held on 16.10.2022 )
పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో 75 శాతం మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. అక్టోబర్ 28 నాటికి స్కానింగ్ పూర్తి! అక్టోబర్ 16న పరీక్ష నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ... 18వ తేదీ నుంచి ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియను ప్రారంభించింది. కమిషన్ ఆధ్వర్యంలోని సాంకేతిక విభాగం సామర్థ్యం ప్రకారం అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్‌కు కనీసం ఎనిమిది పని దినాల గడువు పడుతుందని అంచనావేసి ప్రకటించింది. అక్టోబర్ 28 నాటికి స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. స్కానింగ్ పూర్తయిన వెంటనే అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాల కాపీలను వారి ఓటీఆర్ లాగిన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ప్రాథమిక కీ విడుదల చేసి.. దానిపై ఏవైనా అభ్యంతరాలుంటే ఆన్‌లైన్ పద్ధతిలో స్వీకరించిన తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తారు.