TSPSC Paper Leak: లీకేజీకి ఈ జిల్లాతో లింకులు
ఇందులో భాగంగా లీకేజీ, డబ్బుల వసూలు, లావాదేవీల్లో కీలకంగా వ్యవహరించారన్న ప్రచారంతో రాజశేఖర్‌రెడ్డి బంధువులపై సిట్ సభ్యులు దృష్టి సారించారు. జగిత్యాల జిల్లా తాటిపల్లికి చెందిన రాజశేఖర్‌రెడ్డి కంప్యూటర్ హార్డ్‌వేర్‌లో నిపుణుడని గ్రామస్తులు తెలిపారు. అదే అర్హత మీద అతను ఆఫ్గనిస్తాన్ వెళ్లి కొంతకాలంపాటు అక్కడ పనిచేశాడు. తరువాత టీఎస్‌పీఎస్‌లో చేరాక అతని లైఫ్‌స్టైల్ మారిందని అంటున్నారు. ఈ మొత్తం వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. జగిత్యాల, కరీంనగర్‌లో ఉన్న అతని బంధువుల వివరాలు, వారి కార్యకలాపాలపై తీగ లాగుతున్నారు.
చదవండి: TSPSC Paper Leak 2023 : టీఎస్‌పీఎస్సీ 26 నోటిఫికేషన్లు.. 20 పరీక్షలకు పైగా రద్దు..?
బొమ్మకల్ వాసులే కీలకమా?
రాజశేఖర్‌రెడ్డికి కంప్యూటర్ హ్యాకింగ్ కోర్సుపై అవగాహన ఉండే ఉంటుందని, దాని ఆధారంగానే అతను ప్రశ్నపత్రాలు తస్కరించి ఉంటాడని భావిస్తున్న సిట్ బృందం అతని మిత్రుల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించుకునే పనిలో పడింది. రాజశే ఖర్‌రెడ్డి గతంలో తన బంధువులు ఇద్దరికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పించాడని జరుగుతున్న ప్రచారంపై కూడా దృష్టి సారించారు. ఈ మొత్తం వ్యవహారంలో కరీంనగర్‌లోని బొమ్మకల్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రాజశేఖర్‌రెడ్డికి సహకరించారని తెలిసింది. వారిద్దరే లీకైన ప్రశ్నపత్రాలను కావాల్సిన వ్యక్తులకు అందజేయడం, వారి నుంచి డబ్బులు వసూలు చేయడం తదితర వ్యవహారాలను చక్కదిద్దేవారని సమాచారం. ఉద్యోగార్థుల నుంచి మొత్తం నగదు రూపంలోనే డబ్బులు తీసుకునే వారని, బ్యాంకులు, ఆన్‌లైన్ లావాదేవీలు అస్సలు అంగీకరించలేదని తెలిసింది.
చదవండి: TSPSC New Exam Dates 2023 : గ్రూప్-1, ఏఈ పరీక్ష కొత్త తేదీలు ఇవే.. ఈ సారి మాత్రం..
ఆ అధికారి తన బంధువని చెప్పుకునే వాడు!
వీరిద్దరే రాజశేఖర్‌రెడ్డికి బినామీలు వ్యవహరించారని, జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ వీరికి పలు ఆస్తులు ఉన్నాయని సమాచారం. అయితే, ఈ ఆస్తులు 2017 రాజశేఖర్‌రెడ్డి టీఎస్‌పీఎస్‌సీలో చేరిన తరువాత సంపాదించారా? ముందే సమకూర్చుకున్నారా? అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. రాజశేఖర్‌రెడ్డికి ఓ ఉన్నతాధికారితో దూరపు బంధుత్వం ఉందని, అతని సిఫారసుతోనే తను టీఎస్‌పీఎస్‌లో తాత్కాలిక పద్ధతిన కొలువు సాధించగలిగాడన్న ప్రచారం ఇక్కడ జోరుగా సాగుతోంది. ఆ అధికారిని పలుమార్లు తన బంధువుగా చెప్పుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.