TS SI and Constable Final Results 2023 : ఎస్సై, కానిస్టేబుల్ తుది ఎంపిక ఫలితాలు విడుదల.. ఎప్పుడంటే..? కటాఫ్ మార్కులు మాత్రం..
ఈ మేరకు రాష్ట్రంలో 17,516 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) ముమ్మరం చేసింది. ఆగస్టులో ఎస్సై, సెప్టెంబర్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల తుది ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా 90,175 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఎస్సై, ఏఎస్సై పోస్టులు 587 ఉన్నందున తదుపరి ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.
శిక్షణ మాత్రం అప్పుడే..
దీంతో ఆగస్టులోనే ఎస్సై అభ్యర్థులకు శిక్షణ ప్రారంభంకానున్నట్టు విశ్వసనీయ సమాచారం. 16,929 కానిస్టేబుల్ అభ్యర్థుల తుది జాబితాను సెప్టెంబర్ నాటికి సిద్ధమైతే.. అదే నెల చివరిలో లేదా అక్టోబర్ మొదటివారంలో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిసింది. కొత్తగా నియామకమయ్యే పోలీసు అభ్యర్థులకు రాష్ట్రంలోని 28 శిక్షణా కేంద్రాలు సిద్ధమవుతున్నాయి.
వెంటనే కటాఫ్ మార్కులు..
ప్రస్తుతం ప్రొవిజనల్ ఎంపికకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం ప్రక్రియ కూడా వేగవంతం చేయనున్నట్టు తెలిసింది. ఆ వెంటనే క్యారెక్టర్ అండ్ యాంటిస్పెంట్ వెరిఫికేషన్(ఎస్బీ), మెడికల్ ఫిట్‌నెస్ కూడా రెండు మూడు వారాల వ్యవధిలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తున్నది. ఇవి పూర్తయిన వెంటనే కటాఫ్ మార్కులు ప్రకటించి, అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను వెల్లడించనున్నట్టు తెలిసింది.