Inter Spot Valuation: ఇంటర్ స్పాట్ షురూ.. మూల్యాంకన ప్రక్రియ ఇలా..
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలు గురువారంతో ముగిశాయి. దీంతో స్పాట్ ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాకు సంబంధించిన ఇంటర్ మూల్యంకనం రెండు కేంద్రాల్లో, నాలుగు విడతల్లో పూర్తి చేయనున్నారు.
నాలుగు విడతల్లో
నాలుగు విడతల్లో మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇంగ్గిష్, తెలుగు, హిందీ, గణితం, పౌరశాస్త్రం సబ్జెక్టులను మొదటి విడతలోనే చేపట్టనున్నారు. శనివారం నుంచి మొదటి విడత మూల్యాంకనం ప్రారంభించనున్నారు.
చదవండి: Careers After 12th Class: ఉన్నత విద్యకు ఈ ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సిందే!!
పద్మనగర్‌లోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టులు, బాలికల ప్ర భుత్వ జూనియర్ కళాశాలలో గణితం, పౌరశాస్త్రం, తెలుగు సబ్జెక్టులు మూల్యంకనం చేపట్టనున్నారు. మార్చి 20 తేదీ నుంచి రెండో విడతలో భాగంగా ఫిజిక్స్, ఎకనామిక్స్, 22 నుంచి మూడో విడతలలో కెమిస్ట్రీ, కామర్స్ 24 నుంచి నాలుగో విడతలో చరిత్ర, బాటనీ, జువాలజీ సబ్జెక్టుల పేపర్లు దిద్దేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.
1,800 మంది ఎగ్జామినర్లు
ఇంటర్ మూల్యాంకనం కోసం నాలుగు విడతల్లో జవాబు పత్రాలను దిద్దేందుకు 1,800 మంది ఎగ్జామినర్లు, ఇతరత్రా సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రంలో 5 లక్షల 50 వేల మంది విద్యార్థుల పేపర్లు దిద్దేందుకు అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని సన్నద్దం చేశారు.
బోర్డు ఆదేశాలకు అనుగుణంగా
ఇంటర్ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా మూల్యాంకన ప్రక్రియ సక్రమంగా నిర్వహించేందుకు క్యాంపు పర్సనల్స్‌గా నలుగురు అధికారులను నియమించారు. వీరితోపాటు క్యాంపు ఆఫీసర్ ఉంటారు.
సమాధాన పత్రాలు కేంద్రానికి రాగానే కోడింగ్ చేస్తారు. దీనివల్ల సమాధాన పత్రం ఏ విద్యార్థిది, ఏ కళాశాల అనే వివరాలు దిద్దేవారికి తెలియదు. ఇంటర్ బోర్డు నుంచి నియామకపత్రాలు అందిన అధ్యాపకులు విధిగా మూల్యాంకన విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఎగ్జామినర్లకు కేటాయించిన ఆయా మూల్యాంకన కేంద్రాలకు సకాలంలో హజరుకావాలని సూచించారు.
ఒకేషనల్‌లో 160 మంది గైర్హాజరు
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వోకేషనల్ పరీక్షలో మార్చి 15న 160 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 1229 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 160 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 1069 మంది విద్యార్థులు పరీక్షలకు హజరయ్యారని డీఐఈవో వెల్లడించారు.
- రెండు కేంద్రాల్లో క్యాంపు
- 1,800 మంది ఎగ్జామినర్లు
- 5.50 లక్షల జవాబు పత్రాలు
- నాలుగు విడతల్లో స్పాట్
నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
మూల్యాంకన ప్రక్రియను నిర్వహించేందుకు అవసరమైన వసతులు ఏర్పాటు చేశాం. ఇంటర్ బోర్డు అధికారులు ఇక్కడికి వచ్చి అన్నీ పరిశీలించాకే ఏర్పాటుకు ఉత్తర్వులు జారీచేశారు. సిబ్బంది తమకు కేటాయించిన తేదీల్లో నిర్దేశిత కేంద్రానికి వచ్చి రిపోర్టు చేయాలి. నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– జగన్మోహన్‌రెడ్డి, జిల్లా ఇంటర్ విద్యాధికారి