Skip to main content

TSBIE: ఎక్కడికక్కడే సమస్యలు.. నేటి నుంచి ఇంటర్‌ క్లాసులు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ క్లాసులు జూన్‌ 1న‌ నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లు ఇంటర్‌ అధికారులు చేశారు.
Inter Classes  Interclass schedule displayed

ప్రస్తుతం వడగాడ్పులు వీస్తున్న నేపథ్యంలో మొదటివారం రోజులూ ప్రభుత్వ, గురుకుల కాలేజీలతోపాటు కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలో హాజరుశాతంపై అధికారులు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. జూన్‌ రెండోవారం వరకూ విద్యార్థులు పెద్దగా కాలేజీలకు రాకపోవచ్చని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్‌ కూడా జూన్‌ 1 నుంచే మొదలవ్వాలి. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైంది. ఈ కారణంగా ఫస్టియర్‌ విద్యార్థులకు జూన్‌ ఆఖరు వరకూ క్లాసులు జరిగే అవకాశం లేదు. అయితే, ప్రైవేట్‌ కాలేజీల్లో ఇప్పటికే దాదాపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యింది.

ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించకపోయినా, చాలాచోట్ల అనధికారికంగానే క్లాసులు నడుస్తున్నాయనే వార్తలొస్తున్నాయి. రెండో సంవత్సరం క్లాసులు కూడా ఇప్పటికే ప్రారంభించారు.  

చదవండి: Admissions: కాలేజీలో చేరగానే మెసేజ్‌.. ‌బోర్డు సరికొత్త ప్రయోగం

600 కాలేజీలకు పూర్తికాని అఫ్లియేషన్‌ 

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీలు 3 వేలకుపైగానే ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీలు 422 వరకూ ఉన్నాయి. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు తీసేస్తే 1400 కాలేజీలు ప్రైవేట్‌ రంగంలోనే ఉన్నాయి. వీటన్నింటికీ ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి.

కాలేజీల్లో ఫ్యాకల్టీ, మౌలిక వసతులు, పరిసరాలను జిల్లా అధికారులు తనిఖీ చేసిన తర్వాత ఈ గుర్తింపు ఇస్తారు. అయితే సరైన డాక్యుమెంట్లు సమర్పించని కారణంగా ఇంకా 600 ప్రైవేట్‌ కాలేజీలకు గుర్తింపు రాలేదు. అయినా ఆ కాలేజీలు అడ్మిషన్లు కొనసాగించినట్టు తెలుస్తోంది. ఒక్కో కాలేజీ రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేశాయి.

వేల సంఖ్యలో విద్యార్థులను చేర్చుకున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 72వేల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులుంటే, ప్రైవేటు కాలేజీల్లో 2.35 లక్షల మంది ఉన్నారు. ఆఖరిదశ వరకూ అప్లియేషన్ల ప్రక్రియ కొనసాగించడం వల్ల ప్రతీ సంవత్సరం విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. 

ప్రభుత్వ కాలేజీల్లో సమస్యలెన్నో... 

  • ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1,654 లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  
  • 225 ఒకేషనల్‌ అధ్యాపకుల పోస్టులూ ఖాళీనే.ళీ 26 కాలేజీల్లో కీలకమైన సబ్జెక్టులు బోధించే అధ్యాపకుల కొరత వేధిస్తోంది.  
  • 394 కాలేజీలకు పక్కా భవనాలున్నా,  నిర్వహణకు అవసరమైన నిధులు మంజూరు కావడం లేదు.  
  • కొత్తగా 26 జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేసినా, అవసరమైన అధ్యాపకులను ఇవ్వలేదు. మౌలిక వసతులూ కల్పించలేదు.  
  • సైన్స్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌పై ఇంతవరకూ ఎక్కడా నిధులు ఇవ్వలేదని అధ్యాపక సంఘాలు అంటున్నాయి. 
  • అదనపు గదులు లేకపోవడంతో కొన్ని గ్రూపులను కలిపి బోధించే పరిస్థితి ఉంది.  
  • ఇప్పటి వరకూ ఎక్కడా పాఠ్యపుస్తకాల పంపిణీ జరగలేదు.  

ఇంటర్‌ విద్యపై దృష్టి పెట్టాలి  
పేద విద్యార్థులు చేరే ప్రభుత్వ ఇంటర్‌ కాలేజీలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలి. త్వరగా పాఠ్యపుస్తకాలు అందితే బోధన అనుకున్న ప్రకారం జరుగుతుంది. ప్రైవేటు తో దీటుగా ఫలితాలు వస్తాయి. కాలేజీల్లో తాగునీటి సౌకర్యం, ఫర్నిచర్, సరిపడా గదులు ఏర్పాటు చేయాలి.      
– మాచర్ల రామకృష్ణగౌడ్, తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

అన్ని సమస్యలూ పరిష్కరిస్తాం  
జూనియర్‌ కాలేజీల్లో ఎలాంటి సమస్యలూ లేకుండా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. కాలేజీల అఫ్లియేషన్‌కు ఇంకా సమ యం ఉంది. అన్ని డాక్యుమెంట్లు సమర్పిస్తే కచ్చితంగా గుర్తింపు ఇస్తాం. మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పాఠ్య పుస్తకాల ముద్రణ కొనసాగుతోంది. త్వరలో అందించే ప్రయత్నం చేస్తాం.  
– శ్రుతి ఓజా, ఇంటర్‌బోర్డు కార్యదర్శి  

Published date : 01 Jun 2024 03:52PM

Photo Stories