Skip to main content

ఓ టాలెంట్ టెస్ట్.. జీవితాన్నే మార్చేసింది

సృష్టిలో ప్రతి పరిణామం వెనుక సైన్స్ ఉంది. సైన్స్ లేని సమాజం ఊహకే అందనిది.. సైంటిస్ట్‌గా పనిచేయడం గర్వకారణం..పరిశోధనలకు అంతర్జాతీయ గుర్తింపు రావడం అరుదైన గౌరవం.. అలాంటి గౌరవాన్ని సొంతం చేసుకున్నారు ప్రఖ్యాత రాయల్ ఫెలో అవార్డు గ్రహీత, ఐఐసీటీ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఉషారాణి..! ఏడో తరగతిలో రాసిన ఓ టాలెంట్ టెస్ట్.. తన జీవితాన్ని మార్చేసిందంటున్న ఉషారాణితో భవిత ప్రత్యేక ఇంటర్వ్యూ...

మాది విజయవాడ. నాన్న ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అడుసుమిల్లి కృష్ణమూర్తి. నా చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. ఇంటర్ బైపీసీ, తర్వాత కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చదివా. ఐఐసీటీలో పీహెచ్‌డీ పూర్తిచేశా. జపాన్‌లో ప్రీ-పీహెచ్‌డీ చేశా. 80 వరకు జర్నల్స్ ప్రచురితమయ్యాయి. జాతీయ పర్యావరణ అవార్డు, ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ బయోలాజికల్ సెన్సైస్ (నాబ్స్) ఫెలోషిప్ లభించాయి. జపాన్ కాన్సులేట్ హియోషీ పర్యావరణ జాతీయ అవార్డుతో సత్కరించింది.

సైన్స్‌పై ఆసక్తి:
ఏడో తరగతిలో ఉన్నప్పుడు సైన్స్ టాలెంట్ టెస్ట్ రాశాను. అప్పటినుంచీ సైన్స్‌పై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. పెద్దయ్యాక కచ్చితంగా సైంటిస్ట్ కావాలని నిర్ణయించుకున్నా. అందుకే ఎన్నో ఉద్యోగావకాశాలు వచ్చినా..వదులుకున్నా.

రీసెర్‌‌చ:
ప్రస్తుతం మొక్కలపై పరిశోధనలు చేస్తున్నా. హానికారక పురుగు మందుల స్థానంలో సహజ రసాయనాలతో ఉండే పురుగు మందుల తయారీపైనా, ప్లాంట్స్ డిఫెన్స్ మెకానిజంపైనా రీసెర్చ్ చేస్తున్నా. ఎవరైనా గాయపర్చినప్పుడు, వాటిని మూగజీవాలు ఆహారంగా తీసుకున్నప్పుడు మొక్కలు తమను కాపాడుకోవడానికి అప్పటికప్పుడు ఆకులు, కాండం చుట్టూ ప్రత్యేక రసాయనాలు వెలువరిస్తాయి. దీని వల్ల కొంతసేపటికి మూగజీవాలు మొక్కలను ఆహారంగా తినడం మానేస్తాయి. మొక్కలకు గాయాలైనప్పుడు అవి అంతర్గతంగా తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఈ ప్రక్రియపై పరిశోధనలు చేస్తున్నా. పర్యావరణాన్ని కాపాడడంతోపాటు వృక్షజాతి అంతరించిపోకుండా తగిన చర్యలు తీసుకోవడానికి నా రీసెర్చ్ ఉపయోగపడుతుంది.
అవకాశాలకు కొదవలేదు:
ప్రస్తుతం సైన్స్ గ్రూపుల పట్ల ఆసక్తి తగ్గుతోంది. సైన్స్‌లో ఉన్నత చదువులు అంతంతమాత్రంగా మారుతున్నాయి. ఇప్పుడంతా ఇంజనీరింగ్, మెడిసిన్ వైపే దృష్టిసారిస్తు న్నారు. ఈ పరిణామం ఆందోళనకరం. ప్రభుత్వం సైన్స్ పరిశోధనలపై రెట్టింపు స్థాయిలో నిధులు వెచ్చిస్తోంది. దాంతో కాలేజీ స్థాయి నుంచి యూనివర్సిటీలు, ల్యాబ్‌ల వరకూ... లక్షల ఉద్యోగాలు రానున్నాయి. భవిష్యత్తులో అవకాశాలు పెరిగినా.. వాటిని అందిపుచ్చుకునే సమర్థులైన సైన్స్ విద్యార్థుల కొరత ఎక్కువగా ఉంది.

భవిష్యత్‌లో ఆవిష్కరణలు!
పరిశోధనలకు ఖరీదైన ల్యాబ్స్, పరికరాలు ముఖ్యం. ఈ విషయంలో మనం కొంత వెనుకబడినా..ఇప్పుడిప్పుడే ఈ సమస్యలను అధిగమిస్తున్నాం. దేశంలో కొత్త ఆవిష్కరణల కోసం నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో వెలుగు చూడనివి ఎన్నో ఉంటున్నాయి. ఒక కొత్త ఆవిష్కరణ వెలుగుచూసే క్రమంలో ఎన్నో అవాంతరాలు ఉంటాయి.

పాఠశాల స్థాయిలోనే అవగాహన:
ప్రస్తుతం తల్లిదండ్రులు, విద్యార్థుల ఆలోచన ధోరణి మారిపోయింది. చదువుకున్న వెంటనే ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నారు. సైన్స్‌లో డిగ్రీ చేసిన వెంటనే ఉద్యోగంలో జాయిన్ కావాలనుకుంటున్నారు. ఉన్నత విద్యనభ్యసించి పరిశోధనలు చేయాలని.. ఎవరూ కోరుకోవడం లేదు. ఇది సమాజానికి మంచి పరిణామం కాదు. పాఠశాలస్థాయిలోనే పరిశోధనల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలి. భవిష్యత్తుకు అవసరమైన సైంటిస్టులను తయారు చేసుకోవాల్సిన బాధ్యత అందరిదీ.

ఇష్టమైన కోర్సుతోనే రాణింపు:
పరిశ్రమ అవసరాలకనుగుణంగా కరిక్యులం ఉండాలి. అప్పుడే ఉద్యోగాలు లభిస్తాయి. ప్రస్తుత విద్యావిధానం ప్రాక్టికల్‌గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది విద్యార్థులు ఇప్పటికీ తమ శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేకపోతున్నారు. తమకు ఇష్టమైంది చదవకుండా.. పక్కవారిని చూసి కోర్సులు ఎంచుకుంటున్నారు. ఎవరో చెప్పారని చేరుతున్నారు. దాంతో కోర్సు పూర్తయినా.. సరైన నైపుణ్యాలు లేక ఉద్యోగాలు దొరకడంలేదు.

పర్యావరణాన్ని కాపాడటమే లక్ష్యం:
సేద్యంలో పురుగులమందు వాడకం ఇప్పుడు తప్పనిసరైపోయింది. దీంతో మానవాళి మనుగడకు, పర్యావరణానికి, హాని జరుగుతోంది. పురుగుల మందులు లేకుండా వ్యవసాయం చేసే రోజులు రావాలి. అందుకోసం హానికారకం కాని ఆరు సహజ పురుగుల మందులు కనిపెట్టా. వ్యాధుల నుంచి తమను తాము రక్షించుకోగల మొక్కలపై పరిశోధనలను విసృ్తతం చేస్తా. వాటిద్వారా కొత్త మొక్కలకు ఊపిరిపోసి,పర్యావరణాన్ని రక్షించేందుకు కృషిచేస్తా.

మహిళలు రీసెర్చ్ వైపు రావాలి:
మన దేశంలో మహిళలు పరిశోధన రంగంలోకి రావలసిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే... శాస్త్రవేత్తలుగా మహిళలు సులువుగా రాణిస్తారు. ఇటీవల మన రాష్ట్రపతి సైతం దేశంలో మహిళా శాస్త్రవేత్తల సంఖ్య పెరగాల్సిన అవసరాన్ని ఓ సందర్భంలో వివరించారు. మహిళా సైంటిస్టులను ప్రోత్సహించడానికి నెలకు ’ 20వేల ఫెలోషిప్‌తోపాటు ’ 10 లక్షల ఫండ్ సైతం ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొస్తోంది. వీటిని ఉపయోగించుకోవాలి.

అద్భుతాలు ఆవిష్కరించవచ్చు:
సైంటిస్ట్‌గా పనిచేయడం ఎవరికైనా గర్వకారణం. పరిశోధన ఓ యజ్ఞం. ఎంతో సహనంతో పనిచేస్తేనే విజయాలు అందుతాయి. ఒక్కోసారి అనుకున్న ఫలితాలు రాలేదని నిరాశ చెందకూడదు. ఇష్టపడి పనిచేస్తే కచ్చితంగా సక్సెస్ వరిస్తుంది. మానవాళికి మేలు చేస్తామనే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అద్భుతాలు ఆవిష్కరించవచ్చు. సమయం, సహనం.. సైంటిస్టుకు ఎంతో కీలకం. ఆల్ ద బెస్ట్!!

Published date : 19 Apr 2012 04:42PM

Photo Stories