Skip to main content

ఎడిసన్ దృక్పథం...ఎన్నో ఆవిష్కరణలకు మూలం

థామస్ ఆల్వా ఎడిసన్... ఈ పేరు చెప్పగానే మనకు కరెంటు బల్బు గుర్తొస్తుంది. అంతకంటే ముందు గుర్తురావాల్సింది ‘‘ ప్రతి ఓటమి గెలుపునకు పునాది’’ అని. ఎందుకంటే బల్బు కనిపెట్టడానికి ముందు ఎడిసన్ 10 వేల సార్లు విఫలమాయ్యరు. అయినా నిరాశ చెందకుండా విజయం సాధించి మన జీవితాల్లో వెలుగులు నింపారు. బల్బు కనిపెట్టిన అనంతరం ఆయణ్ను ఓ జర్నలిస్టు ‘సర్ మీరు 10 వేల సార్లు విఫలమయ్యారట కదా అని ప్రశ్నిస్తే’ ...దానికి ఎడిసన్ సమాధానమిస్తూ...’ బల్బుని ఎలా తయారు చేయగలమో మీ అందరికి ఒకేలా తెలుసు కానీ, నాకు ఎలా తయారు చేయకూడదో పదివేల విధానాలు తెలుసు’ అని చెప్పారు. ఇది ఒక్కటి చాలదా ఎడిసన్ ఎంత సానుకూల దృక్ఫథంతో ఉంటాడో అని తెలుసుకోడానికి. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న అన్నీ ఎలక్టాన్రిక్ వస్తువులకు మూలం ఎడిసస్ ఆలోచనలే అంటే మీరు నమ్మగలరా. ఎడిసన్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు తెలుసుకుందాం...
పేపర్ బాయ్‌గా చేస్తూ..
ఎడిసన్ అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని మిలన్ అనే ప్రాంతంలో జన్మించారు. ఆయన పుట్టింది మిలన్‌లో అయినప్పటికీ పెరిగింది మాత్రం పోర్టుహ్యురాన్‌లో. తండ్రి శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్, తల్లి నాన్సీ మాథ్యూస్ ఎడిసన్. ఆల్వా ఎడిసన్ వీరికి ఏడవ సంతానం. ఇతని కుటుంబం డచ్ మూలాలను కలిగి ఉంది. ఈయన పదేళ్ల వయస్సు వచ్చే సరికి సొంతంగా లాబొరేటరీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం రైళ్లల్లో న్యూస్ పేపర్లు, స్వీట్లు అమ్మేవాడు. ఎడిసన్ అతి చిన్నవయస్సులోనే టెలిగ్రాఫ్ నమూనా యంత్రాన్ని తయారు చేశాడు. 1861లో సివిల్ వార్ ప్రబలినప్పుడు ఎడిసన్ ‘గ్రాంట్ ట్రంక్ హెరాల్డ్‌‘ అనే ఓ మోస్తరు న్యూస్ పేపర్ నడిపాడు. ఈ సమయంలోనే ఆయనకు ప్రమాద వశాత్తు చెవుడు వచ్చింది. రైల్వే బోగీలోనే లాబొరేటరీ పెట్టి కొన్ని రోజులు ప్రయోగాలు చేశాడు. పొరపాటుగా అగ్ని ప్రమాదం జరగడంతో రైల్వే అధికారులు ఆయనను దూరంగా ఉంచారు.

కెరీర్ ప్రారంభం...
ఎడిసన్ మొదటగా న్యూజెర్సీలోని నెవార్క్‌లో పరిశోధకుడిగా తన ప్రస్థానాన్ని ఆరంభించాడు.ఆయన మొదట పని చేసినవి ఆటోమాటిక్ రిపీటర్, టెలిగ్రాఫిక్ పరికరాల ఆవిష్కరణల్లో కానీ అతనికి పేరు తెచ్చి పెట్టినది మాత్రం 1877 లో కనిపెట్టబడిన ఫోనోగ్రాఫ్. ఈ పరికరాన్ని కనిపెట్టినపుడు ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆయనకు మెన్లో పార్క్ మాంత్రికుడు అనే పేరు పెట్టారు.

బల్బు ఆవిష్కరణ..
ఈ రోజు మనం చీకట్లో కూడా ఇంత హాయిగా ఉంటున్నామంటే దానికి కారణం ఎడిసనే అని కచ్చితంగా చెప్పవచ్చు. ఎడిసన్ బల్బుని కనుక్కోవడం అనేది అంత సులువుగా జరగలేదు. ఈ అద్భుతం వెనక ఎంతో కృషి పట్టుదల, సానుకూల దృక్పథం ఉంది. బల్బును కనిపెట్టే క్రమంలో ఎడిసన్ యాభై మంది సహాయకులతో పరిశోధనలు మొదలు పెట్టారు. వివిధ లోహాలు, సిద్ధాంతాలతో దాదాపు రెండేళ్లు కృషి చేసి విసిగి వేసారి పోయారు. అప్పుడు కాకతాళీయంగా ఆయన చేతికి నూలుదారం తగిలింది. వెంటనే ఆ నూలు దారాన్ని కార్బనైజ్ చేయడానికి ప్రయత్నించారు. అందుకు నూలు దారపు ముక్కను నికెల్ మోల్డ్‌లో పెట్టి దాదాపు ఐదు గంటలపాటు కొలిమిలో ఉంచారు. ఆ మోల్డ్ ను చల్లార్చి నూలు దారం తీసి బల్బులో పెట్టి సీల్ వేయాలి. రెండు రాత్రులు ఒక పగలు కష్టపడి ఒక దారపు ఉండనంతా ఉపయోగించి, నూలు దారపు ముక్క విరగకుండా ఎడిసన్ ఆయన సహాయకుడు ‘ బాచ్‌లర్ ‘ కలిసి తీయగలిగారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఆయన మాటల్లోనే....’ అంత కష్టపడి తయారు చేసిన కార్బన్‌ను గాజు తయారు చేసే అతని వద్దకు తీసుకువెళ్లాల్సి వచ్చింది. బాచ్‌లర్ ఆ విలువైన కార్బన్‌ను ఎంతో జాగ్రత్తగా తీసుకొని బయలు దేరాడు. ఆయన వెనుక నేను ఒక పెద్ద ధనాగారాన్ని కాపాడే వాడిలాగా కాపలా కాస్తూ నడిచాను. ఆ గాజు తయారు చేసే వాడి వద్దకు వచ్చేసరికి ఆ దురదృష్టపు కార్బన్ విరిగింది. మేము మరలా పరిశోధనాలయానికి వెళ్ళి మధ్యాహ్నానికి మళ్లీ కార్బన్‌ను తయారు చేశాం. కాని దానిమీద స్క్రూడ్రైవర్ పడి అదీ విరిగింది. మరలా వెనక్కు పోయి రాత్రికల్లా కార్బన్ తయారు చేసి దానిని బల్బులో చొప్పించగల్గాము. బల్బులోని గాలి తీసేసి సీల్ వేసి కరెంట్ ఆన్ చేశాము. ఎంతో కాలంగా మేము కలలుగన్న దృశ్యం మా కళ్లబడింది. ఆ బల్బ్ దాదాపు నలభై గంటలు వెలిగింది. కారు చీకటి రాత్రులను పట్టపగలుగా మార్చే ఎలక్ట్రిక్ దీపం కల సాకరమైంది’.

మరి కొన్ని ఆవిష్కరణలు
1889లో పారిస్‌లో ఒక గొప్ప వైజ్ఞానిక వస్తు ప్రదర్శన జరిగింది. అందులో ప్రదర్శించిన వస్తువుల్లో 90 శాతంపైగా ఎడిసన్‌వే కావడం విశేషం. ఇంతటి గొప్ప వస్తువులను ప్రదర్శించినవారు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న అనేక పరికరాలు ఎడిసన్ కృషి ఫలితాలే అని చెప్పవచ్చు. ఎలక్ట్రికల్ బల్బు వెలిగినప్పుడు, గ్రామ్ ఫోన్ విన్నప్పుడు, టెలిఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు ఇలా ప్రతి పనిలో ఎడిసన్ మనకు గుర్తొస్తూనే ఉంటారు. 1847-1889 మధ్యకాలంలో టైప్ రైటర్, ఎలక్టిక్ పెన్, గ్రామ్ ఫోన్, మోషన్ పిక్చర్ కెమెరా, ఇలాంటివి ఎన్నో ఆయన తయారు చేశారు. 1931లో చనిపోయేంతవరకు సరికొత్త ఆవిష్కరణలకై ఆయన చాలా ఆరాటపడ్డారు. ఎడిసన్ 1300 ఆవిష్కరణలపై పేటెంట్ హక్కులు పొందాడు. ఆయన అంత్యక్రియల రోజు ఆయన గౌరవార్ధం అమెరికా ప్రజలు తమ గృహాల్లో లైట్లను ఆర్పివేసి నివాళి అర్పించారు. ఊహాశక్తితో సృజనాత్మకమైన ఆలోచనలతో సాధించవచ్చని ఎడిసన్ నిరూపించారు. ఆయన చనిపోయే నాటికి అతని ఆస్తుల విలువ 2,500 కోట్ల డాలర్లని తేలింది. ఊహశక్తి, సృజనాత్మకమైన ఆలోచనలు, ప్రతి విషయాన్ని పరిశీలించటం వల్ల ఎన్ని అద్భుతాలు చేయవచ్చో తెలసుకున్నారు కదా...కాబట్టి మీరు కూడా కొంత సమయాన్ని సృజనాత్మకమైన పనులకు, ఆలోచలకు కేటాయించండి. ఏమో చెప్పలేం మీలోనూ ఒక ఎడిసన్ ఉండి ఉంటాడు.

పిల్లలతో జాలీగా..
ఎడిసన్ 24 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు 16 ఏళ్ల మారీ స్టిల్ వెల్‌ను 1871, డిసెంబర్ 25న వివాహమడాడు. వీరికి ముగ్గురు సంతానం. వారి పేర్లు...మరియన్ ఎడిసన్, థామస్ అల్వా ఎడిసన్ జూనియర్, విలియం లెస్ల్య ఎడిసన్. వీరంటే థామస్‌కు చాలా ఇష్టం. పరిశోధనల తర్వాత ఆయన పిల్లలతో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.

జన్మ నామం: థామస్ ఆల్వా ఎడిసన్
జననం: ఫిబ్రవరి 11, 1847మిలాన్ ఓహియో, యూఎస్
స్వస్థలం: యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
మరణం: అక్టోబర్ 18, 1931 వెస్ట్ ఆరెంజ్, న్యూజెర్సీ, యూఎస్
వృత్తి: శాస్త్రవేత్త
Published date : 17 Sep 2016 11:09AM

Photo Stories