Skip to main content

Supervision of Schools: పాఠశాలలపై పర్యవేక్షణ ఏది?

ఎల్లారెడ్డి పేట(సిరిసిల్ల): విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వం పదే పదే చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు.
Supervision of Schools

పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి వసతులు కల్పిస్తున్నా పర్యవేక్షించే అధికారులు లేక విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇన్‌చార్జీ ఎంఈవోలకు విద్యావ్యవస్థ బాధ్యతలతోపాటు గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారులుగా నియమించడంతో విధులకు సరైన న్యాయం చేయలేకపోతున్నారు.

అధికారుల పర్యవేక్షణలోపంతో ప్రైవేట్‌ పాఠశాలలు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. నోట్‌బుక్కులు, యునిఫాంలు, ఫిట్‌నెస్‌ లేని బస్సులు నడిపిస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఫీజుల నియంత్రణ లేకుండా పోయింది. కొంతమంది ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదు. ఫలితంగా విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు రోజురోజుకు పడిపోతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: Dr BR Ambedkar Gurukul School : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల ప్రతిభా పాఠశాలలో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

13 మండలాలు.. ముగ్గురే అధికారులు

రాజన్నసిరిసిల్ల జిల్లాలో 13 మండలాల్లో 511 ప్ర భుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 73వేల మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎంఈవోలు మండలాల్లోని పాఠశాలలను పర్యవేక్షించాలి. కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న ముగ్గురు ఎంఈవోలు సైతం ఇన్‌చార్జీలు కావడం గమనార్హం. ఒక్కో ఎంఈవోకు మూడు నుంచి ఐదు మండలాల బాధ్యతలు ఉండడంతో ఏ మండలంలోనూ పూర్తి స్థాయి పర్యవేక్షణ చేయలేకపోతున్నారు.

మండలాల బాధ్యతలకు తోడు గ్రామపంచాయతీల ప్రత్యేకాధికారులుగా వీరిని సైతం నియమించడంతో ఏ శాఖకు న్యాయం చేయలేకపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అధికారులు కరువయ్యారు. ఫలితంగా కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేస్తుండడంతో నాణ్యతా ప్రమాణాలు కొరవడుతున్నాయి. అంతేకాకుండా సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. ఫలితంగా ఈ విద్యాసంవత్సరంలో ప్రారంభంలోనే సౌకర్యాలు దరిచేరాల్సి ఉండగా ఇంకా పనులు కొనసాగుతున్నాయి.

సీనియర్‌ హెచ్‌ఎంలే ఎంఈవోలు !

  • ● జిల్లాలోని ముగ్గురు ఇన్‌చార్జి ఎంఈవోలు ఉన్నారు. వీరంతా హెచ్‌ఎంలుగా పనిచేస్తున్న వారే.
  • ● సిరిసిల్ల పరిధిలోని వెంకంపేట స్కూల్‌ హెచ్‌ఎం రఘుపతి ప్రస్తుతం ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల, తంగళ్లపల్లి, కోనరావుపేట, వీర్నపల్లి మండలాలకు ఇన్‌చార్జి ఎంఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
  • ● చందుర్తి మండలానికి చెందిన హెచ్‌ఎం శ్రీనివాస్‌ బోయినపల్లి, చందుర్తి, రుద్రంగి మండలాలకు ఇన్‌చార్జి ఎంఈవోగా ఉన్నారు.
  • ● వేములవాడ బాలికల పాఠశాల హెచ్‌ఎం బన్నాజి ఇల్లంతకుంట, ముస్తాబాద్‌, గంభీరావుపేట, వేములవాడఅర్బన్‌, వేములవాడరూరల్‌ మండలాల ఇన్‌చార్జి బాధ్యతలు నెరవేరుస్తున్నారు.
  • ● వీరికి మూడు నుంచి ఐదు మండలాల బాధ్యతలు ఉండడంతో ఏ మండలంలోనూ అందుబాటులో ఉండడం లేదు.

ఎంఈవోలను నియమించాలి

జిల్లాలో ముగ్గురు కూడా ఇన్‌చార్జి ఎంఈవోలు పని చేస్తున్నారు. పూర్తి స్థాయి ఎంఈవోలను నియమించాలని విద్యార్థులతో కలిసి అనేక ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇన్‌చార్జి అధికారులతో విద్యావ్యవస్థ కుంటుపడుతోంది. పర్యవేక్షణ లోపంతో ప్రధానోపాధ్యాయులే ఇష్టానుసారంగా స్కూళ్లను నడిపిస్తున్నారు.

– ప్రశాంత్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం

రాష్ట్రవ్యాప్తంగా ఎంఈవోల నియామకంపై ఓ పాలసీ ప్రకారం ప్రభుత్వం ముందుకుపోతుంది. ఎంఈవోలను నియమించుకునే అధికారం జిల్లా విద్యాశాఖకు లేదు. అయినా విద్యార్థులకు సమస్యలు లేకుండా చూస్తాం. ఎంఈవోల ఖాళీల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం.

– రమేశ్‌కుమార్‌, డీఈవో

Published date : 25 Jun 2024 03:21PM

Photo Stories