పాఠశాలల్లో మళ్లీ కన్నీటి కష్టాలు.!
ఒక్కో ఆర్వో ప్లాంట్‌కు రూ.లక్షలు ఖర్చుపెట్టారు. విద్యార్థుల తాగునీటి సురక్షిత నీరు అందించారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యను పరిష్కరించారు. ప్రస్తుతం ప్రభుత్వం మారగానే మళ్లీ ఐదేళ్ల నాటి పరిస్థితులు పాఠశాలల్లో కనిపిస్తున్నాయి.
అధికారులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల పనితీరు మొదటికొచ్చింది. వారి నిర్లక్ష్యం, నిర్వహణ లోపం లాంటి కారణాలతో పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లన్నీ మూతబడ్డాయి.
ఏ ఒక్క పాఠశాలలోనూ ఆర్వో ప్లాంట్లు వినియోగంలో లేకపోవడంతో విద్యార్థులకు ఇళ్ల వద్ద నుంచి బాటిళ్లతో తాగునీరు తెచ్చుకుంటూ ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనగా, ఫ్లోరైడ్ ప్రాంతమైన కనిగిరి నియోజకవర్గంలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది.
చదవండి: Anganwadi Dress Code news: ఇకనుంచి అంగన్‌వాడీ చిన్నారులకు డ్రెస్ కోడ్
ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ తర్వాత అత్యధికంగా ఫ్లోరైడ్ బాధితులు ఉన్న నియోజకవర్గాల్లో కనిగిరి ఒకటి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం తర్వాత ఫ్లోరోసిస్ బాధితులు కనిగిరి ప్రాంతంలో అత్యధికంగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
కనిగిరి నియోజకవర్గంలోని నీటిలో అత్యధికంగా ఫ్లోరైడ్ శాతం 7 పాస్పరస్ పర్ మిలియన్ (పీపీఎం) కంటే ఎక్కువగా ఉందని వైద్య అధికారుల నివేదికలున్నాయి. ఇక్కడ పెద్దలకు కాళ్లు, చేతులు వంకరపోవడమే కాదు.. అనేక మందికి కిడ్నీలుపోయి డయాలసిస్ చేయించుకుంటున్నారు.
కనిగిరి ప్రభుత్వాస్పత్రిలోని డయాలసిస్ కేంద్రంలో సుమారు 130 మంది ప్రతి నిత్యం డయాలసిస్ చేయించుకుంటున్నారు. కనిగిరి ప్రాంతంలోని విద్యార్థులు ఫ్లోరైడ్ నీటిని తాగడం వల్ల అత్యధిక మంది పళ్లు గారతో, ఇతర సమస్యలతో కన్పిస్తాయనే విషయం తెలియనిది కాదు.
వైఎస్ జగన్ హయాంలో రూ.లక్షలు వెచ్చించి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు...
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో చేపట్టిన నాడు–నేడు కింద జిల్లాలోని 38 మండలాల్లో మొదటి విడతలో ఎంపికై న దాదాపు 1,015 పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కనిగిరి నియోజకవర్గంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఫస్ట్ ఫేజ్‌లో 150 పాఠశాలలకు టైప్ 1 నుంచి టైప్ 4 వరకు (సుమారు 5 లీటర్ల నుంచి 100 లీటర్ల వరకు) శుద్ధజలాలు అందించే ఆర్వో ప్లాంట్లు అందించినట్లు నివేదికలున్నాయి. వీటి విలువ దాదాపు ఒక్కోటి రూ.30 వేల నుంచి రూ.4.60 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పాఠశాలల్లోని విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు దాదాపు 95 శాతం ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత మూలనపడ్డాయి. కొన్ని స్కూళ్లలో ఫిల్టర్ కాయిల్స్ పనిచేయకపోగా, మరికొన్ని చోట్ల మోటార్లు కాలిపోయాయి. ఇంకొన్ని చోట్ల ఆర్వో ప్లాంట్ల బిగింపు జరగక.. వాటి పార్టులను మూలనపడేశారు. ఆర్వో ప్లాంట్లు మరమ్మతులకు గురైన వెంటనే సంబంధిత యాప్‌లో నమోదు చేసి కంపెనీ నిర్వాహకునిచే రిపేరు చేయించాల్సి ఉంటుంది.
కానీ, దానిపై అధికారులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు దృష్టి పెట్టడం లేదా.. లేకుంటే కంపెనీ నిర్వాహకుడే స్పందించడం లేదా..? అనేది అర్థం కావడం లేదు. కనీసం సమస్యను ఉన్నతాధికారుల దృష్టికై నా తీసుకెళ్లాల్సిన స్థానిక అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిరుపయోగంగా మారి ఆర్వో ప్లాంటు మూలనపడగా, చింతలపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్వో ప్లాంట్ బిగింపు కూడా జరగలేదు. కొన్నిచోట్ల ఉన్నత పాఠశాలల్లో స్కూల్ గ్రాంట్ నుంచి ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల ద్వారా మినరల్ వాటర్ వేయించి ఎండీఎంలోకి, విద్యార్థుల దాహార్తి తీర్చడానికి ఉపయోగిస్తున్నారు.
మరికొన్నిచోట్ల అందుబాటులో ఉన్న నీరే దిక్కుగా మారింది. ఇంకొన్ని పాఠశాలల్లో సాగర్ నీటి కుళాయి లైన్ ద్వారా ట్యాంక్‌లకు నీటిని ఎక్కించి తాపిస్తున్నారు. దీంతో అనేక పాఠశాలల్లో విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి బాటిళ్ల ద్వారా నీళ్లు తెచ్చుకుని ఎండీఎం సమయంలో వినియోగిస్తున్నారు.
వ్యాధుల బారిన పడే ప్రమాదం...
ప్రతిరోజూ ఒక మనిషి కనీసం 5 లీటర్ల నీటిని, చిన్నారులు కనీసం మూడు లీటర్ల నీటిని తాగాలని వైద్యుల సలహాలు, సూచనలు ఇస్తున్నారు. విద్యార్థుల్లో నీటి శాతం తగ్గితే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేగాకుండా వర్షాకాలంలో కలుషితమైన నీరు తాగడం వలన విద్యార్థులు రోగాల బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయి.
కొన్ని పాఠశాలల్లో బయట వాటర్ ప్లాంట్ల నీరు తెచ్చి వేయిస్తున్నా.. వాటిలో నాణ్యత ఏమాత్రం ఉండటం లేదు. బయట ప్లాంట్లలోని శుద్ధ జలాల్లోని స్వచ్ఛత ఎంత అనేది ప్రశ్నార్థకం. ఈ నేపథ్యంలో విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని తాగించేందుకు, రోగాల బారిన పడకుండా రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి ఆర్వో ప్లాంట్లకు మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉంది.
ఏమాత్రం అలసత్వం వహించినా.. పర్యవేక్షణ లోపించినా రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లు పూర్తిగా తుప్పుపట్టి నిరుపయోగంగా మారడమే కాకుండా ఫ్లోరైడ్ నీటితో విద్యార్థుల ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు.
కంపెనీ వారికి ఫిర్యాదు చేశాం
ఆర్వో ప్లాంట్లు కొన్ని పాఠశాలల్లో పనిచేయడం లేదనేది వాస్తవం. సుమారు నాలుగేళ్లు అయినందు వల్ల తరచూ ఏదో ఒక పార్టులు మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో ప్లాంట్లు వినియోగంలో ఉండటం లేదు. కనిగిరి ప్రాంతంలోని నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటం వల్ల ప్లాంట్లలోని లిక్విడ్ కాయిల్స్, మోటార్లు కూడా పగిలిపోతున్నాయి. ప్లాంట్ల నిర్వహణపై ఎప్పటికప్పుడు కంపెనీ వారికి ఫిర్యాదులు చేస్తున్నాం. కంపెనీవారు స్పందించి సకాలంలో మరమ్మతులు చేస్తే విద్యార్థులకు శుద్ధమైన తాగునీటిని అందించవచ్చు.
– జీ సంజీవి, ఎంఈఓ, పీసీ పల్లి