Skip to main content

Parents and Professionals: మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసం ఈ భాష అవసరం..

ఆంగ్ల భాష ప్రపంచాన్ని శాసిస్తోందన్న విషయం అందరికీ అవగతమైంది. ఇంగ్లిష్‌పై పట్టు ఉంటేనే పిల్లలు పోటీ పరీక్షలు గట్టెక్కగలుగుతారని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చేజిక్కించుకోవడంలో ముందుంటారనే వాస్తవాన్ని అన్ని వర్గాలు తెలుసుకున్నాయి.
Parents and Professionals
ఇంగ్లిష్‌ మీడియంలో చదివితే మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఈ కారణంగానే ఎక్కువ మంది తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ మీడియంలో బోధనను కోరుకుంటున్నారు. వ్యయ ప్రయాసలతో కూడినదైనా కుగ్రామాల ప్రజలు సైతం తమ పిల్లల్ని స్కూలు బస్సులు, వ్యానులు ఎక్కించి మరీ, సమీప పట్టణంలోనో, మండల కేంద్రంలోనో ఉన్న ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలకు పంపిస్తున్నారు. ఈ విధంగా గ్రామాల్లో ఇంగ్లిష్‌ మీడియంలో విద్యా బోధనకు పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించిన ప్రభుత్వం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సర్కారీ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

ఇంగ్లిష్‌ వైపే ఎక్కువ మంది

తెలంగాణలో 42,575 స్కూళ్లుంటే ప్రభుత్వ పాఠశాలలు 31 వేలు ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్లు ఎక్కువైనా విద్యార్థుల్లో ఎక్కువ మంది ప్రైవేటు స్కూళ్లకే వెళ్తున్నారు. దీనికి కారణం అక్కడ ఆంగ్ల బోధన ఉండటమే. ప్రైవేటులో ఫీజు కట్టలేని వారే ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. అయితే ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లిష్‌ మీడియంలో చదివే విద్యార్థులే ఎక్కువగా ఉండటం గమనార్హం.

‘సక్సెస్‌’సాధించిన స్కూళ్లు

ఇంగ్లిష్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో 2008లో సక్సెస్‌ స్కూళ్ల పేరుతో 6–10 తరగతులకు ఇంగ్లిష్‌ మీడియం ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేశారు. అప్పట్లో 5 వేలకు పైగా స్కూళ్లలో ఇలా సెక్షన్లు ఏర్పాటు చేశారు. ఈ స్కూళ్లలో మంచి ఫలితాలు కూడా వచ్చాయి. తర్వాత 2016లో ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన చేపట్టారు. 1,800 ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల బోధన ఉంటే, 4,500 వరకు ప్రాథమికోన్నత ఆపై తరగతుల్లో ఇంగ్లిష్‌ బోధన ఉంది.

  • ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే ఇంగ్లిష్‌కున్న ప్రాధాన్యత అర్థమవుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో (గురుకులాలు కలిపి) మొత్తం 26,18,413 మంది విద్యార్థులుంటే, ఇందులో 12,35,909 (47.24 శాతం) మంది తెలుగు మీడియంలో చదువుతుంటే 12,72,776 (48.61 శాతం) ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 800 గురుకుల పాఠశాలల్లో ఉన్న 4,29,540 మంది ఆంగ్లంలోనే విద్యనభ్యసిస్తున్నారు.
  • ఎయిడెడ్‌ స్కూళ్లలో 84,234 మంది ఉంటే, ఇందులో 19,491 (23.14 శాతం) మంది తెలుగు మీడియం, 56,387 (66.94 శాతం) మంది ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులున్నారు.
  • ఇక ప్రైవేటు స్కూళ్లలో 32,49,344 మంది విద్యార్థులకు గాను కేవలం 42,416 (1.31 శాతం) మంది తెలుగు మీడియంలో ఉంటే, 31,79,633 (97.85 శాతం) మంది ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులే ఉన్నారు.

లోతైన అధ్యయనం చేయాలి

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు, విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ, విద్యార్థి వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతున్నా కార్యాచరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా బోధించే సత్తా సర్కారీ స్కూళ్ళకు ఉన్నప్పటికీ ఆచరణ లోపాలే సమస్యగా మారుతున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. ఇంగ్లిష్‌ మీడియం అమలుకు కావాలి్సన వనరులేమిటి? సాధ్యాసాధ్యాలేంటి? అనే విషయాలపై ప్రభుత్వం లోతైన అధ్యయనం చేయాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే నడుస్తున్న ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్ళు, గతంలో కొన్ని పాఠశాలలు మూతపడ్డానికి కారణాలు పరిగణనలోనికి తీసుకోవాలి్సన అవసరం ఉందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

ఉపాధ్యాయుల సంగతేంటి?

రాష్ట్రంలో 1.06 లక్షల మంది టీచర్లున్నారు. వీరిలో 10 శాతం మాత్రమే ఇంగ్లిష్‌ నేపథ్యంలో చదువుకున్న ఉపాధ్యాయులున్నారు. మరో 15 శాతం టీచర్లు ఇంగ్లిష్‌ బోధించగల సామర్థ్యం ఉన్నవాళ్ళని విద్యాశాఖ సర్వేలో వెల్లడైంది. మొత్తం మీద 25 శాతం ఉపాధ్యాయులు మాత్రమే ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేందుకు సంసిద్ధులుగా ఉన్నారు. 2017లో జరిగిన డీఎస్సీలో 980 మందిని మాత్రమే ఆంగ్ల మాధ్యమం కోసం ప్రత్యేకంగా నియమించారు. కాబట్టి 75 శాతం ఉపాధ్యాయులకు ఇంగ్లిష్‌ బోధనపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

టీచర్లకు ముందుగా శిక్షణ ఇవ్వాలి

గవర్నమెంట్‌ స్కూళ్లలో టీచర్లంతా క్వాలిఫైడే ఉంటారు. కాకపోతే వాళ్ళలో ఎక్కువ మంది తెలుగు నేపథ్యం నుంచి వచ్చారు. ఇంగ్లిష్‌ భాషపై పట్టు కోసం శిక్షణ ఇస్తే బోధించే సామర్థ్యం వస్తుంది. కాబట్టి మొదట టీచర్లకు శిక్షణ ఇవ్వాలి. మరోవైపు ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తే 22 వేల మంది ఆంగ్ల భాష నేపథ్యం ఉండేవాళ్ళు వస్తారు.
– చావా రవి (యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

పేదోడి జీవితమే మారుతుంది

ఇంగ్లిష్‌ మీడియం చదువుల కోసం ఊళ్ళను వదిలేసి పట్టణాలకు పోతున్నారు. గ్రామాల్లో ఇంగ్లిష్‌ బోధన అందుబాటులోకి వస్తే పేదవాడి జీవితంలో ఊహించని మార్పులొస్తాయి. ఇలాంటి ఉన్నతమైన చదువును పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం అందించడం అభినందనీయం. దీనిని చిత్తశుద్ధిగా అమలు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఊహించని మార్పులు ఖాయం.
– తుపాకుల వెలగొండ, మాజీ సర్పంచ్, విద్యార్థి తండ్రి, వి.కృష్ణాపురం, ఖమ్మం జిల్లా

విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తు

ప్రపంచంతో పోటీపడాల్సిన పరిస్థితుల్లో ఇంగ్లిష్‌పై పట్టున్న విద్యార్థికి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుంది. అందరికీ ఆంగ్ల బోధన చేరువ చేసే దిశగా ప్రభుత్వం అడుగులేయడం అభినందనీయమే. చిన్నప్పటి నుంచే ఆంగ్లంపై అవగాహన పెంచితే ఎంతో ఉపయోగపడుతుంది. అయితే అన్ని తరగతులకు ఒకేసారి ఆంగ్ల మాధ్యమ బోధన అంటే కొంత కష్టం కావొచ్చు. పెద్ద తరగతుల్లో ఒకేసారి ఇంగ్లిష్‌ మీడియం అంటే విద్యార్థి గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది.
– కె. శేషగిరి రావు (ఉపాధ్యాయుడు, హుజూరాబాద్, కరీంనగర్‌ జిల్లా)

చదవండి:

English: స్కూళ్లలో ఆంగ్లంలో విద్యా బోధన.. సర్కారీ స్కూళ్లకు కొత్త సొబగులు

Good News: ఆంధ్రప్రదేశ్ బాటలో తెలంగాణ

Teachers: దశలవారీగా ఇంగ్లిష్‌పై శిక్షణ

English: నేటి తరానికి ఇంగ్లిష్‌ అవ‌స‌రం.. శిక్షణ కార్యక్రమం ప్రారంభం

Published date : 19 Jan 2022 03:17PM

Photo Stories