Skip to main content

English: స్కూళ్లలో ఆంగ్లంలో విద్యా బోధన.. సర్కారీ స్కూళ్లకు కొత్త సొబగులు

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది.
English
స్కూళ్లలో ఆంగ్లంలో విద్యా బోధన.. సర్కారీ స్కూళ్లకు కొత్త సొబగులు

2023 సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్కారీ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అలాగే ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ఫీజులను నియంత్రించడం ద్వారా పేదలకు, సామాన్య మధ్యతరగతికి విద్యను మరింత చేరువ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ రెండు అంశాలపై సమగ్ర అధ్యయనం జరపడంతో పాటు విధివిధానాల రూపకల్పన కోసం తెలంగాణ‌ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్, జగదీశ్‌ రెడ్డి, హరీశ్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కె.తారక రామారావుతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. వచ్చే శాసనసభా సమావేశాల్లో ఈ మేరకు నూతన చట్టాన్ని ప్రభుత్వం తీసుకురానుంది. మరోవైపు నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7,289 కోట్లతో ‘మన ఊరు–మన బడి’ ప్రణాళిక అమలుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జనవరి 17న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దాలి

విద్యారంగంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలో వ్యవసాయం తదితర అనుబంధ రంగాలు బలోపేతం కావడం, తద్వారా గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో.. పల్లెల్లో తల్లిదండ్రుల్లో తమ పిల్లల విద్య, భవిష్యత్తు పట్ల ఆలోచన పెరిగిందని కేబినెట్‌ గుర్తించింది. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధన చేపట్టినట్టయితే తమ పిల్లలను స్థానిక పాఠశాలల్లోనే చేర్పించేందుకు వారు సంసిద్ధంగా ఉన్నారని భావించింది. ఈ నేపథ్యంలోనే సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. అందుకు కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని కేబినెట్‌ నిర్ణయించింది. విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిషు మీడియంలో బోధించేందుకు టీచర్లకు తర్ఫీదునిచ్చేందుకు, నాణ్యమైన ఆంగ్ల విద్యను అందించడం ద్వారా ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖను ఆదేశించింది.

సర్కారీ స్కూళ్లకు కొత్త సొబగులు

రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 19,84,167 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు దశలవారీగా డిజిటల్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు వీలుగా ‘మన ఊరు – మన బడి’ ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యంగా సాంకేతికత విజ్ఞాన ఆధారిత విద్యను అందించడం కోసం డిజిటల్‌ క్లాస్‌ రూంలు, అదనపు తరగతి గదులు, అవసరమైన మేరకు ఫర్నిచర్‌ ఏర్పాటు, మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర వసతుల కల్పన ఈ ప్రణాళిక ఉద్దేశం. సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారం.. గతంలో రెండుసార్లు సమావేశమైన సబిత నేతృత్వంలోని మంత్రుల బృందం ‘మన ఊరు – మన బడి’ విధివిధానాలను రూపొందించింది. 12 రకాల విభాగాలను పటిష్టపరిచేందుకు ప్రతిపాదించడం జరిగింది. అవి.. నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, త్రాగు నీటి సరఫరా, విద్యార్థులు మరియు సిబ్బందికి సరిపడ ఫర్నిచర్, పాఠశాల మొత్తానికి కొత్తగా రంగులు వేయడం, పెద్ద ..చిన్న మరమ్మతులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ప్రహరీ గోడలు, వంట గదులు (షెడ్లు), శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్‌ రూంలు, ఉన్నత పాఠశాలల్లో భోజనశాలలు, డిజిటల్‌ విద్య అమలు. ఇందుకు రూ.7,289.54 కోట్లు అవసరమవుతాయి. అన్ని పనులను వేగంగా అమలు చేయడం కోసం ‘పాఠశాల నిర్వహణ కమిటీ’ (ఎస్‌.ఎమ్‌.సి.)లకు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నిధుల సమీకరణ కోసం ఆర్థిక శాఖ నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది. ప్రతి స్కూల్లో పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. 


మున్సిపల్, పంచాయతీరాజ్‌ శాఖల సమన్వయంతో కోవిడ్‌ వ్యాక్సినేషన్ ను సత్వరంగా పూర్తి చేయాలి. ఇందుకు ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలి. 

– సీఎం కేసీఆర్‌

చదవండి:

Schools Reopen: ‘ఉత్సాహంగా పాఠశాలలకు’

Online Courses: ఎడ్టెక్ సంస్థలతో ఆన్ లైన్ కోర్సులు వద్దు

Published date : 18 Jan 2022 03:51PM

Photo Stories