Online Courses: ఎడ్టెక్ సంస్థలతో ఆన్ లైన్ కోర్సులు వద్దు
ఏ సంస్థ కూడా ఎడ్‌టెక్ కంపెనీలతో ‘ఫ్రాంచైజీ’ ఒప్పందాలు చేసుకోవడానికి అనుమతి లేదని పేర్కొన్నాయి. ఈ మేరకు యూజీసీ, ఏఐసీటీఈ వేర్వేరుగా పబ్లిక్ నోటీసులు జారీ చేశాయి. నిబంధనల ప్రకారం.. ఉన్నత విద్యా సంస్థలు ఆన్ లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ లేదా ఆన్ లైన్ ప్రోగ్రామ్‌లను ఏ ఫ్రాంచైజీ ఏర్పాటు కింద అందించకూడదు. అయితే కొన్ని విద్యాసంస్థలు తాము నిర్వహిస్తున్న కోర్సులను ఎడ్‌టెక్ కంపెనీలతో అందించడానికి ఒప్పందాలు చేసుకున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఏఐసీటీఈ, యూజీసీ పేర్కొన్నాయి. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని, ఇందుకు ఆయా ఉన్నత విద్యా సంస్థలు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించాయి. యూజీసీ గుర్తింపు పొందిన కొన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలతో కలిసి ఆన్ లైన్ లో డిగ్రీ, డిపొ్లమా ప్రోగ్రామ్‌లను అందిస్తున్నట్లు కొన్ని ఎడ్‌టెక్ కంపెనీలు సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు కూడా ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని యూజీసీ కార్యదర్శి రజనీష్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటువంటి ఫ్రాంచైజీల ఏర్పాటుకు అనుమతించబోమని, చట్ట నిబంధనల ప్రకారం ఎడ్‌టెక్ కంపెనీలతోపాటు ఉన్నత విద్యా సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు ఏదైనా కోర్సులో చేరబోయే ముందు యూజీసీ వెబ్‌సైట్‌లో ఆయా కోర్సులకు గుర్తింపు ఉందో, లేదో తెలుసుకోవాలన్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కూడా జనవరి నెల ప్రారంభంలో ఎడ్‌టెక్ సంస్థల కోర్సుల్లో చేరేటప్పుడు, చెల్లింపులు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచనలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
చదవండి:
Online Classes: సెలవుల పొడిగింపుతో..మళ్లీ ఆన్‌లైన్ విద్య..!
Education: సరికొత్తగా ఆన్ లైన్ బోధన.. దిశ, దశ మార్చుకోనున్న డిజిటల్ విప్లవం..