Skip to main content

Engg Counselling Postponed: ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా.. సవరించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదీ..

సాక్షి, హైదరాబాద్‌: జూన్ 27 నుంచి జరగాల్సిన ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ వాయిదా పడింది. కొత్త షెడ్యూల్‌ను సాంకేతిక విద్య విభాగం జూన్ 25న‌ విడుదల చేసింది.
Engineering counseling postponed notice  New Schedule Released for Engineering Counselling in Hyderabad   TS Engineering Counselling Scheduled Postponed  Technical Education Department Announcement on Counselling Schedule

ఈ మార్పునకు కారణాలేంటనేది అధికారులు వెల్లడించలేదు. కొన్ని కాలేజీలు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అను మతి పొందాల్సి ఉందని మాత్రమే చెబుతున్నారు. కానీ వాస్తవానికి రాష్ట్ర యూనివర్సిటీల నుంచి ఇప్పటివరకు ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు రాలేదు. ఇది వస్తేనే ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది తెలుస్తుంది. కౌన్సెలింగ్‌ వెబ్‌సైట్‌లో కాలేజీలు, కోర్సుల వివరాలు ఉంటేనే విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వగలుగుతారు.

ఏటా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. కానీ ఈ ఏడాది ముందే పూర్తయింది. మే 21తో 10 విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల పదవీకాలం ముగిసింది. అయితే వారు ఆలోగానే కాలేజీల్లో తనిఖీలు పూర్తి చేశారు. కానీ కాలేజీలకు అఫిలియేషన్‌ ఇచ్చే సమయంలో తనిఖీలపై ఫిర్యాదులొచ్చాయి. దీంతో కాలేజీలకు ఇప్పుడే గుర్తింపు ఇవ్వొద్దంటూ ప్రభుత్వం ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

చదవండి: Top 20 Engineering (Branch wise) Colleges in Telangana - Click Here

మే 21 తర్వాత వీసీల పదవీకాలం ముగియడంతో ప్రతి వర్సిటీకి ఐఏఎస్‌ అధికారులను ఇన్‌చార్జి వీసీలుగా ప్రభుత్వం నియమించింది. పాత వీసీలు చేపట్టిన తనిఖీలపై వారికి అనుమానాలు రావడంతో ప్రక్రియను నిలిపివేసినట్లు తెలుస్తోంది.  

గోల్‌మాల్‌ జరిగిందా? 

రాష్ట్రంలో 178 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండగా వాటిలో 17 కాలేజీలు ప్రభుత్వ అధీనంలోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్నాయి. మిగిలిన 161 కాలేజీలు ప్రైవేటువి. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బ్రాంచీలు, సెక్షన్లు, సీట్లకు సంబంధించి యాజమాన్యాలు ముందుగా ఏఐసీటీఈ నుంచి అనుమతి తీసుకోవాలి. 33 కాలేజీలు మినహా మిగతా కాలేజీలన్నీ ఏఐసీటీఈ అనుమతి తీసుకున్నాయి. అంటే 128 కాలేజీలు తమ పరిధిలోని విశ్వవిద్యాలయం నుంచి గుర్తింపు పొందాల్సి ఉంటుంది.

అయితే వర్సిటీల అధికారులు తనిఖీల సందర్భంగా ఇష్టానుసారం వ్యవహరించారని, ప్రైవేటు కాలేజీలకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఫ్యాకల్టీ, మౌలికవసతులు లేకున్నా సక్రమంగానే ఉన్నట్లు నివేదికలు ఇచ్చినట్లు విమర్శలున్నాయి.

చదవండి: College Predictor - 2024 (AP&TG - EAPCET, POLYCET and ICET) - Click Here

ఈ నేపథ్యంలో ఇన్‌చార్జి వీసీలుగా నియమితులైన ఐఏఎస్‌ అధికారులు తనిఖీల్లో అవకతవకలపై విచారణ మొదలుపెట్టారు. దీంతో అనుబంధ గుర్తింపులో జాప్యం జరుగుతోందని అధికారులు అంటున్నారు. ఈ పరిణామాలపై ఆందోళన చెందుతున్న కాలేజీ యాజమాన్యాలు ఏదో విధంగా గుర్తింపు తెచ్చుకోవడానికి పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో బేరసారాలకు ఆస్కారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

సీట్ల లెక్క ఇలా.. 

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1.22 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు ఉండగా వాటిలో 83 వేల సీట్లు కన్వీనర్‌ కోటా కింద ఉన్నాయి. అందులోనూ 58 శాతం సీట్లు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఇతర కంప్యూటర్‌ కోర్సుల్లోనే ఉన్నాయి.

గత కొన్నేళ్లుగా డిమాండ్‌ లేని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచీల్లో సీట్లను, సెక్షన్లను ప్రైవేటు కాలేజీలు తగ్గించుకుంటున్నాయి. వాటి స్థానంలో కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచీల్లో సీట్లు పెంచాలని కోరుతున్నాయి. ఈ ఏడాది కూడా ఇదే తరహాలో 80 కాలేజీల నుంచి దరఖాస్తులు వచ్చాయి.

గతేడాది బ్రాంచీ మార్చుకున్నవి, కొత్తగా మంజూరైన కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు 14 వేల వరకు ఉన్నాయి. పెరిగిన సీట్లను ఆఖరి కౌన్సెలింగ్‌లోకి తెచ్చారు. ఏయే కాలేజీల్లో, ఏ బ్రాంచీల్లో సీట్లు పెరుగుతాయి? ఎందులో తగ్గుతాయి? అనే వివరాలతో ముందే కౌన్సెలింగ్‌ కేంద్రంలో సాఫ్ట్‌వేర్‌ రూపొందించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అనుబంధ గుర్తింపే కాలేజీలకు రాకపోవడంతో సీట్లపైనా అధికారులకు స్పష్టత రావడం లేదు. 

sakshi education whatsapp channel image link

సవరించిన ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదీ...

ఏ తేదీన

ఏం చేయాలి?

మొదటి దశ

జూలై 4 నుంచి 12 వరకు

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, స్లాట్‌ బుకింగ్‌

జూలై 6 నుంచి 13 వరకు

ధ్రువపత్రాల పరిశీలన

జూలై 8 నుంచి 15 వరకు

ఆప్షన్ల ఎంపిక

జూలై 19

తొలి దశ సీట్ల కేటాయింపు

జూలై 19 నుంచి 23 వరకు

సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

రెండో దశ

జూలై 26

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, స్లాట్‌ బుకింగ్‌

జూలై 27

సర్టిఫికెట్ల పరిశీలన

జూలై 27, 28

ఆప్షన్ల ఎంపిక

జూలై 31

రెండో దశ సీట్ల కేటాయింపు

జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు

సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

ఆగస్టు 4

కాలేజీలో చేరిన విద్యార్థుల వివరాల వెల్లడి

ఫైనల్‌ ఫేజ్‌

ఆగస్టు 8

స్టాల్‌ బుకింగ్, రిజిస్ట్రేషన్‌

ఆగస్టు 9

ధ్రువపత్రాల పరిశీలన

ఆగస్టు 9, 10

ఆప్షన్ల ఎంపిక

ఆగస్టు 13

సీట్ల కేటాయింపు

ఆగస్టు 13–15

సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

ఆగస్టు 16–17

బ్రాంచ్‌ మారితే కాలేజీలో రిపోర్టింగ్‌ చేయాలి

ఆగస్టు 18

కాలేజీల సీట్ల వివరాల వెల్లడి

అంతర్గత స్లైడింగ్‌

ఆగస్టు 21–22

కాలేజీలో బ్రాంచ్‌ మార్పుకు ఆప్షన్లు

ఆగస్టు 26

సీట్ల కేటాయింపు

ఆగస్టు 27–28

మారిన బ్రాంచ్‌తో కాలేజీలో రిపోర్టింగ్‌

ఆగస్టు 28

వెబ్‌సైట్‌ ద్వారా స్పాట్‌ అడ్మిషన్లు

Published date : 26 Jun 2024 12:00PM

Photo Stories