Skip to main content

Digital Teaching: బోధన..లక్షలు వెచ్చించినా నెరవేరని లక్ష్యం

కొత్తగూడెం అర్బన్‌: ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రతి ఏడాది నూతన పథకాలను అమలు చేస్తున్నప్పటీకి.. క్షేత్ర స్థాయిలో అవి పూర్తిగా అమలు కావడం లేదు.
Digital Teaching

విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇష్టారాజ్యం అన్నట్టుగా సాగుతోంది. దీనికి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తోడవుతుండడంతో నిర్లక్ష్యం మితిమిరిపోతోందనే ఆరోపణలు వస్తున్నాయి. తద్వారా విద్యార్థులు కూడా నష్టపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు డిజిటల్‌ బోధన అందించేందుకు రెండేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఇంట్రాక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌(ఐఎఫ్‌పి)ను ఏర్పాటుచేసింది. జిల్లాలో వీటికి అనుగుణంగా గదులు ఉన్న 270 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. మొదటి విడతగా జిల్లాలో 60, రెండో విడతలో 100, మూడో విడతలో 110 పాఠశాలలకు మూడు చొప్పున ప్యానళ్లు మంజూరు చేశారు. ప్రారంభంలో ఆయా స్కూళ్లలో డిజిటల్‌ బోధన జరిగినా.. ఆ తర్వాత ప్యానళ్లను పక్కన పడేసి మామూలుగానే బోధిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎంపిక చేసిన 270 పాఠశాలల్లో పది శాతం పాఠశాలల్లో మాత్రమే డిజిటల్‌ బోధన సాగుతుండగా.. 90 శాతం స్కూళ్లలో సాధారణ బోధనే సాగుతోంది. దీంతో విద్యార్థులు సాంకేతిక విద్యలో వెనుకబడే ప్రమాదం ఉందని విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అన్ని పాఠశాలల్లో డిజిటల్‌ బోధన కొనసాగేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

నెట్‌, విద్యుత్‌ సమస్యల పేరుతో..

జిల్లాలోని 270 పాఠశాలల్లో డిజిటల్‌ ప్యానళ్లు ఉన్నాయి. వీటిని ఏర్పాటు చేసే సమయంలోనే ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఇవ్వాల్సి ఉండగా నాడు అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌ల నుంచి ప్యానళ్లకు ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఇచ్చి బోధించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 20 పాఠశాలల్లో మాత్రమే ఇలా బోధన జరుగుతోంది.

మిగతా పాఠశాలల ఉపాధ్యాయులు తమ ఫోన్ల ద్వారా నెట్‌ వినియోగానికి ముందుకు రాకపోవడంతో సాధారణ పద్ధతిలోనే పాఠాలు చెబుతున్నారు. మరి కొన్ని పాఠశాలల్లో తరుచూ విద్యుత్‌ సమస్య తలెత్తుతోందని, దీంతో డిజిటల్‌ బోధన చేయలేకపోతున్నామని ఉపాధ్యాయులు అంటున్నారు.

చదవండి: Ekalavya Adarsh ​​Gurukula School: చదువుకు చక్కని ప్రాధాన్యం

ఇక జిల్లాలో అత్యధిక ప్రాంతాలు మారుమూలన ఉండే ఏజెన్సీ ఏరియాలే కావడంతో అక్కడ సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు సరిగా ఉండడం లేదు. ఏదేమైనా ఒక్కో ఐఎఫ్‌పీ ప్యానల్‌కు రూ.3 లక్షల చొప్పున ఖర్చు చేయగా ప్రస్తుతం అవి నిరుపయోగంగా ఉంటున్నాయి.

ముఖ్యంగా 8, 9, 10 తరగతి విద్యార్థులకు సంబంధించి ప్రతీ సబ్జెక్టును ప్యానళ్లలో లోడ్‌ చేసి బోధిస్తే వారు పాఠ్యాంశాలతో పాటు సమాజంపై అవగాహన కలిగే అంశాలు, ప్రాంతాలు, వాటి ప్రాముఖ్యత, జనరల్‌ నాలెడ్జ్‌ వంటి మరెన్నో నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు అన్ని పాఠశాలల్లో విద్యుత్‌, ఇంటర్‌నెట్‌ ఏర్పాటు చేయడంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

డిజిటల్‌ బోధనకు చర్యలు చేపడతాం

జిల్లాలోని 270 పాఠశాలల్లో డిజిటల్‌ బోధన నిర్వహణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు సాంకేతిక పరమైన నాలెడ్జ్‌ రావాలంటే ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఐఎఫ్‌పీ ప్యానళ్లను వినియోగించి డిజిటల్‌ బోధన చేయాల్సిందే.

– ఎం.వెంకటేశ్వరాచారి, డీఈఓ
 

Published date : 26 Jun 2024 09:06AM

Photo Stories