Schools: ఇప్పటికిప్పుడు స్కూళ్ల పునఃప్రారంభంకష్టమే
ఈ నేపథ్యంలో 31 నుంచి విద్యా సంస్థలను తెరుస్తారా? లేదా? అన్న ఉత్కంఠ అన్ని వర్గాల్లో కనిపిస్తోంది. ప్రభుత్వం మాత్రం దీనిపై ఇంత వరకూ ఎలాంటి స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించ లేదు. తెలంగాణ విద్య, వైద్య శాఖల నివేదికలు అందిన తర్వాతే ముఖ్యమంత్రి కార్యాలయం ఓ నిర్ణయం తీసుకునే వీలుందని అధికార వర్గాలు అంటున్నాయి. విద్యాశాఖ మాత్రం జనవరి 31 నుంచి విద్యా సంస్థల పునఃప్రారంభం కష్టమనే అభిప్రా యంతో ఉన్నట్టు తెలుస్తోంది. ‘ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో పాఠశాలలను తెరిచేందుకు సిబ్బందిని, ఉపాధ్యాయులను సన్నద్ధం చేయలేదు’ అని పాఠశాల విద్యా శాఖాధికారి ఒకరు తెలిపారు. 50 శాతం ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది ఇప్పటికే విధులకు హాజరవుతున్నారు. ఒకవేళ ప్రత్యక్ష బోధన చేపట్టాల్సి వస్తే కోవిడ్ నిబంధనల మేరకు విద్యార్థులను అనుమతిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపైనే అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెరవడం సమస్యే..
జనవరి 8వ తేదీ నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి. అప్పట్నుంచీ తరగతి గదులు, పాఠశాల ఆవరణ, మరుగుదొడ్ల పరిశుభ్రత గురించి పట్టించుకున్న నాథుడే లేడు. కనీసం రెండు రోజుల పాటు వాటిని రసాయనాలతో శుభ్రం చేసి వాడాల్సి ఉంటుందని పాఠశాల హెచ్‌ఎంలు అంటున్నారు. స్థానిక పారిశుధ్ధ్య సిబ్బంది సహకారం అంతంత మాత్రంగానే ఉందని క్షేత్రస్థాయి సిబ్బంది అంటున్నారు. ఈ నేపథ్యంలో 31 నుంచి పాఠశాలల పునఃప్రారంభం కష్టమేనని అధికారులు భావిస్తున్నారు. అదీగాక వైద్య ఆరోగ్య శాఖ నుంచీ స్పష్టమైన భరోసా లేదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థుల ఆరోగ్యం పరిశీలించాలి.. అవసరమైతే వైద్య పరీక్షలు చేయాలి. వైద్యశాఖ సమన్వయంతోనే ఇవన్నీ సాధ్యమని విద్యాశాఖ చెబుతోంది.
ఆన్ లైన్ అవకాశం
విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించినా.. విద్యార్థులను పాఠశాలలకు పంపుతారా? అనే సందేహాలను ఉపాధ్యాయ వర్గాలు లేవనెత్తుతున్నాయి. దీని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల హాజరును తప్పనిసరి చేయకూడదనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘పునఃప్రారంభించినా పాఠశాలలకు వచ్చే వాళ్ళు వస్తారు.. రానివాళ్ళు టీ–శాట్, డీడీ ద్వారా పాఠాలు వినే వెసులుబాటు కల్పించడమే మంచిది’ అని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆన్ లైన్ క్లాసులు నడుస్తున్నాయి. 63 శాతం వరకూ వీటిని వింటున్నారు. ఆన్ లైన్ అందుబాటులో లేని విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరై, మిగతా వారిలో కొంతమంది ఆన్ లైన్ కే పరిమితమైనా... తరగతి గదిలో కోవిడ్ నిబంధనల మేరకు విద్యార్థులుండే వీలుందని అధికారులు అంటున్నారు. అన్ని వివరాలతో ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితిని తెలిపే నివేదిక పంపామని పాఠశాల విద్యా శాఖాధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు.
చదవండి:
Education: ఉన్నత విద్యకూ ‘విద్యాంజలి’