Additional Collector Radhika Gupta: పదో తరగతిలో 100% ఫలితాలే లక్ష్యంగా..
సబ్జెక్టు టీచర్ల కొరత..
జిల్లాలోని అనేక హైస్కూళ్లలో పలు సబ్జెక్టు టీచర్ల కొరత వేధిస్తోంది. గణితం, బయోసైన్స్, సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లు సరిపడా లేకపోవడంతో బోధనకు ఆటంకం కలుగుతోంది. సబ్జెక్టు టీచర్లు ఎక్కువ మంది హెచ్‌ఎంలుగా పదోన్నతి పొందడంతో ఈ సమస్య ఏర్పడింది. ఎంఈఓల ద్వారా డీఈఓ టీచర్లను సర్దుబాటు చేశారు. సబ్జెక్టు టీచర్లు ఎక్కువ ఉన్న పాఠశాల నుంచి అవసరం ఉన్న పాఠశాలలకు పంపారు. కొంతమంది ఎస్జీటీలకు వర్క్ అడ్జెస్ట్‌మెంట్ చేశారు. కానీ, పలువురు ఎస్జీటీలు టెన్త్ విద్యార్థులకు బోధించేందుకు ముందుకు రావడంలేదనే ఆరోపణలున్నాయి. సర్దుబాటు చేసినా కూడా చాలా చోట్ల ఆయా సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ఇప్పటికే వివిధ హైస్కూళ్లలో 80 నుంచి 90 శాతం సిలబస్ పూర్తయినట్లు తెలుస్తోంది.
విద్యారణ్యపురి: పదో తరగతిలో వంద శాతం ఫలితాలే లక్ష్యంగా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ ఏడాది మార్చి 18 నుంచి నిర్వహించనున్న వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ఇటీవల అదనపు కలెక్టర్ రాధికాగుప్తా కలెక్టరేట్‌లో హనుమకొండ డీఈఓ ఎండీ.అబ్దుల్‌హై, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, టెన్త్ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న 23 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రణాళికాబద్ధంగా బోధన చేయాలని సూచించారు. కాగా, హనుమకొండ జిల్లాలోని 143 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఈనెల 19, 20, 22 ,23 తేదీల్లో పదో తరగతి విద్యార్థులకు స్లిప్‌టెస్ట్‌లు నిర్వహించాలని డీఈఓ ఆదేశించారు. స్లిప్‌టెస్ట్‌లు, మూల్యాంకనం తర్వాత విద్యార్థులు ఎలా చదువుతున్నారో గుర్తించాల్సి ఉంటుంది. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్.. డీఈఓ ఎండీ.అబ్దుల్‌హై జిల్లాలోని హెచ్‌ఎంలతో సమీక్షిస్తారు.
Also Read : 10th Class Preparation Tips
కొనసాగుతున్న ప్రత్యేక తరగతులు
పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతి రోజూ సబ్జెక్టు టీచర్లతో ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. ఉదయం పాఠశాల ప్రారంభ సమయానికి ఒక గంట ముందు, ఆ తర్వాత పాఠశాల సమయం ముగిశాక మరోగంట బోధన చేస్తున్నారు.
మండలాలా వారీగా పర్యవేక్షణ బాధ్యతలు..
హనుమకొండ జిల్లాలో 143 హైస్కూళ్లు ఉండగా అందులో 138 హైస్కూళ్లలో టెన్త్ విద్యార్థులకు చేస్తున్న బోధన, విద్యార్థుల హాజరు ఎలా ఉంది తదితర అంశాల పర్యవేక్షణకు జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డిప్యూటీ తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగిస్తూ ఈనెల 17న అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.
మొత్తం 12 వేల మంది విద్యార్థులు..
హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ హైస్కూళ్లలో 297 మంది, కేజీబీవీల్లో 379 మంది, మోడల్ స్కూళ్లలో 263 మంది, టీఎస్‌ఆర్‌ఎస్‌లో 207 మంది, జిల్లా పరిషత్ హైస్కూళ్లలో 2012 మంది, ప్రభుత్వ ఎయిడెడ్ హైస్కూల్స్‌లో 172 మంది మొత్తం 3,836 మంది విద్యార్ధులున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 12వేల మందికిపైగా టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.