Tenth Class Public Exams 2024: ‘పది’ పరీక్షలకు సన్నద్ధం
అచ్చంపేట: ఈనెల 18నుంచి ప్రారంభంకానున్న పదోతరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు ఆరు పేపర్లు ఉండేవి. ఈసారి ఏడు పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిజికల్ సైన్స్ ఫార్ట్–1గా, బయోలజికల్ సైన్స్ పార్ట్–2గా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఉదయం 9:30నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి. పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు తావివ్వకుండా విద్యాశాఖ, పోలీస్, రెవెన్యూ అధికారులు పర్యవేక్షించనున్నారు.
జిల్లాలో 60 పరీక్ష కేంద్రాలు..
జిల్లాలో మొత్తం 10,559 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అందులో 5,227 మంది బాలురు, 5,332 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 30 జోన్‌లలో 60 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇప్పటికే ఆయా మండలాల పోలీస్‌స్టేషన్‌లకు ప్రశ్నపత్రాలు చేరుకున్నాయి. బార్‌కోడింగ్ పద్ధతి ఉన్నందున విద్యార్థులు మొదటి రోజున పరీక్ష కేంద్రానికి ముందే హాజరు కావాల్సి ఉంటుంది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు ఎస్‌ఐల పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్ సెంటర్లన్నీ మూసి ఉంచనున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు పరీక్షల సమయానుగుణంగా ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని ట్రాన్స్‌కో అదికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటారు.
అధికారుల నియామకం..
పరీక్షల నిర్వహణకు 60 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 60 మంది డిపార్టుమెంట్ అధికారులు పనిచేయనున్నారు. విద్యాశాఖ, రెవెన్యూ, పోలీస్ ఇతర శాఖల అధికారులతో నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు నలుగురు రూట్ ఆఫీసర్లను నియమించారు. 20నుంచి 25 మంది విద్యార్థులకు ఒకరి చొప్పున 440 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. 26 మంది జోనల్ అధికారులు, 26 సహాయ అధికారులను రూట్ల వారీగా నియమించారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎవరికి కూడా సెల్‌పోన్ అనుమతి ఉండదు.
18నుంచి ఏప్రిల్ 2 వరకు వార్షిక పరీక్షలు ఇప్పటికే పోలీస్‌స్టేషన్లకు చేరుకున్న ప్రశ్నపత్రాలు హాజరుకానున్న 10,559 మంది విద్యార్థులు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు గంట ముందే చేరుకోవాలి..
ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకుంటే, ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఒక నిమిషం నిబంధన ఏమీ లేదు. పరీక్ష సమయం తర్వాత 5 నిమిషాల వరకు అనుమతిస్తారు. విద్యార్థులకు పాఠశాలలో హాల్‌టికెట్లు ఇవ్వకుంటే.. ఆన్‌లైన్‌లో నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, భయాందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, పరీక్షలకు సిద్ధంచేశారు.
అన్ని ఏర్పాట్లు చేశాం..
ఎస్‌ఎస్‌సీ పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ అధికారుల పాత్ర కీలకం. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్ అనుమతి లేదు. విధి నిర్వహణలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు. – గోవిందరాజులు, డీఈఓ
అవగాహన కల్పించాం..
పదోతరగతి పరీక్షలు రాసే విధానంపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాం. ప్రత్యేక తరగతులు నిర్వహించి, పాఠ్యాంశాల్లోని సందేహాలను నివృత్తిచేశాం. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా తీర్చిదిద్దాం. పరీక్ష సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు అవసరమైన సూచనలు చేశాం.
– జె.శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌ఎం, ఉప్పునుంతల