ఎత్తు నుండి దిగడం కంటే ఎక్కడం ఎందుకు కష్టం?
Sakshi Education
కొండలు, గుట్టలు, పర్వతాలు వంటివి ఎక్కినప్పుడు ఆయాసంగా ఉంటుంది. భూమ్యాకర్షణశక్తి వల్ల ఇలా జరుగుతుంది. భూమి ప్రతి వస్తువును తన కేంద్రం వైపు ఆకర్షిస్తుంది. మనం ఎత్తుగా ఉండే ప్రదేశానికి వెళ్లాలంటే భూమ్యాకర్షణశక్తిని దాటి వెళ్లాలి. కాబట్టి ఎక్కువ శక్తిని వినియోగిస్తాం. కిందకు దిగేటప్పుడు భూమ్యాకర్షణ శక్తి వల్ల మనం వేగంగా దిగగల్గుతాం. సమతల ప్రదేశంలో ఇంత శక్తి అవసరం లేదు. ఎత్తయిన ప్రదేశాలను ఎక్కేటప్పుడు కండరాలు ఎక్కువగా పని చేస్తాయి. అందుకుగానూ గుండె నుండి కండరాలకు ఎక్కువ రక్తాన్ని పంపాలి. ఇందుకోసం ఊపిరితిత్తులు ఎక్కువగా పని చేసి గుండెలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను తొలగించి ఆక్సిజన్‌ను నింపుతాయి. అందువల్ల పైకి ఎక్కేటప్పుడు మన శ్వాస వేగం పెరుగుతుంది. ఇదంతా మనకు తెలియకుండానే జరిగిపోయే శరీర ప్రక్రియ.
Published date : 23 Dec 2013 04:52PM