Skip to main content

AP TET 2024: బీఈడీ అభ్యర్థుల అకౌంట్‌కు ‘టెట్‌’ ఫీజు

సాక్షి, అమరావతి: ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్‌–2024, డీఎస్సీ కోసం ఫీజు చెల్లించి అనర్హులైన అభ్యర్థులకు వారి ఫీజును తిరిగి ఇస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు.
TET fee for BED candidates account

హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన అభ్యర్థులు టెట్‌ పేపర్‌–1కు, డీఎస్సీలో ఎస్‌జీటీలకు అనర్హులు అవడంతో బీఈడీ అభ్యర్థులు ఈ పరీక్షలకు చెల్లించిన ఫీజును వారి ఆధార్‌ నంబర్‌తో లింక్‌ అయ్యి ఉన్న బ్యాంక్‌ ఖాతాల్లో వేస్తున్నట్లు చెప్పారు.

ఈ విభాగంలో టెట్, డీఎస్సీకి 50,206 మందికి ఫీజు మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు 44,690 మందికి డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) విధానంలో జమ చేశామన్నారు. కొంతమంది అభ్యర్థుల ఆధార్‌ నంబర్‌ వారి బ్యాంక్‌ ఖాతాకు లింక్‌ చేసుకోకపోవడంతో వారికి ఫీజు జమ కావడం లేదని ఇలాంటి వారు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి వారి ఆధార్‌ కార్డ్‌కు లింక్‌ చేసిన బ్యాంక్‌ ఖాతా వివరాలను ఇవ్వాలని సూచించారు.

చదవండి: TS TET 2024 Registrations Extended: టెట్‌ దరఖాస్తు గడువు పెంపు.. వీరూ కూడా టెట్ రాయాలి: సుప్రీంకోర్టు

కొంతమంది అభ్యర్థులు ఫీజు చెల్లించినా వారికి ఐడీ జనరేట్‌ కాలేదని, వీరికి కూడా ఫీజును తిరిగి ఇచ్చేందుకు అభ్యర్థి ఖాతాకు సరిగా జమ అవుతున్నాయో లేదో పరిశీలించేందుకుగాను అభ్యర్థులకు రూ.7.50 (ఫీజులో ఒక్క శాతం) చెల్లించామని, అన్నీ సక్రమంగా ఉన్నవారి అకౌంట్‌కు మిగిలిన ఫీజు మొత్తాన్ని వారి ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు.

ఫీజును ఇంటర్నెట్‌ సెంటర్ల వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని కోరారు. అభ్యర్థి వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్న బ్యాంక్‌ ఖాతా నంబర్‌ ఆధారంగానే ఫీజును తిరిగి జమ చేస్తున్నామని స్పష్టం చేశారు.

Published date : 11 Apr 2024 01:29PM

Photo Stories