Skip to main content

Young Computer Scientist Success Story: పిన్న వయసులోనే ప్రపంచం మెచ్చిన కంప్యూటర్‌ కమాండర్‌....సిద్ధార్థ శ్రీవాత్సవ్‌.

Young Computer Scientist Success Story: పిన్న వయసులోనే ప్రపంచం మెచ్చిన కంప్యూటర్‌ కమాండర్‌....సిద్ధార్థ శ్రీవాత్సవ్‌.
Young Computer Scientist Success Story: పిన్న వయసులోనే ప్రపంచం మెచ్చిన కంప్యూటర్‌ కమాండర్‌....సిద్ధార్థ శ్రీవాత్సవ్‌.

తెనాలి: ఈ చిన్నోడు సామాన్యుడు కాదు. కంప్యూటర్‌ లాంగ్వేజెస్, డేటా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో దిట్ట. కంప్యూటర్‌ సైంటిస్టులకే పాఠాలు చెబుతాడు. ఐఐటీ విద్యార్థులకు రోల్‌ మోడల్‌. కంప్యూటర్‌ ప్రపంచం మెచ్చిన డేటా సైంటిస్ట్‌. పన్నెండేళ్ల వయసులో ఏడో తరగతి చదువుతూ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం చేసిన ఘనుడు. ప్రపంచంలో అతి పిన్న వయసు్కడైన డేటా సైంటిస్ట్‌గా గూగుల్‌తోనే చెప్పించుకున్న  తెనాలి చిన్నోడు. పేరు పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్‌. ఇప్పుడు వయస్సు 17 ఏళ్లు. చదువుతున్నది ఇంటర్మిడియట్‌ ద్వితీయ సంవత్సరం. హైదరాబాద్‌ ఐఐటీలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంజినీరుగానూ పని చేస్తున్నాడు. వారంలో మూడు రోజులు చదువు.. మూడు రోజులు ఉద్యోగం. ఏడో తరగతి నుంచి ఇదే పని.  

PILLI

చిన్నప్పటి నుంచే కంప్యూటర్‌పై పట్టు 
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రియమానస, రాజ్‌కుమార్‌ దంపతుల ఏకైక కుమారుడు సిద్ధార్థ. తల్లిదండ్రులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కావడంతో సి­ద్ధార్థకు చిన్నతనం నుంచీ కంప్యూటర్‌పై బలమైన అభిరుచి కలిగింది. కొడుకు ఆసక్తిని గమనించిన తండ్రి నాలుగో తరగతి నుంచే కంప్యూటర్‌ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్‌ నేర్పించారు. నాలుగైదేళ్లు గడిచేసరికి సిద్ధార్థకు 
కంప్యూటర్‌పై పట్టు చిక్కింది. అడ్వాన్స్‌ లెవెల్‌కు చేరుకోగలిగాడు. సొంతంగా ఆన్‌లైన్‌లో కొన్ని నమూనా ప్రాజెక్టులూ చే­య­టంతో ఆత్మవిశ్వాసం కలిగింది. అప్పుడే ఉద్యోగం చేస్తానని తండ్రితో చెప్పాడు. తండ్రి పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. మరింత పరిజ్ఞానం కోసం తండ్రి అతడిని ఓ కంప్యూటర్‌ సంస్థలో చేర్చాలని తీసుకెళ్లగా.. బాలుడన్న కారణంతో చేర్చుకోలేదు. దీంతో తండ్రి ఆన్‌లైన్‌ కోర్సుల్లో చేర్పించారు. ఇలా వీడియోలు చూస్తూ స్వయంగా అధ్యయనం ప్రా­రంభించిన సిద్ధార్థ వాటిపై గట్టి పట్టు సాధించాడు.

చదవండి: IAS and IPS Ranker Success Stories : ఫెయిల్స్ అయ్యాం.. కానీ ప‌ట్టు ప‌ట్టాం ఇలా.. సివిల్స్‌లో ర్యాంకులు కొట్టాం ఇలా... 

ఉద్యోగ సాధన 
ఉద్యోగం చేస్తానని మరోసారి చెప్పినా భారత్‌లో సాధ్యం కాదని తండ్రి చెప్పేశారు. పట్టువదలని సిద్ధార్థ తనే ఓ రెజ్యూమె తయారు చేసుకుని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశాడు. కొన్ని కంపెనీలు ఫోన్‌­లో సంప్రదించాయి. అతడి కంప్యూటర్‌ పరిజ్ఞానానికి అబ్బురపడుతూనే.. వయసు, చదువు తక్కువన్న భావనతో పట్టించుకోలేదు. సుదీర్ఘ ఇంట­ర్వ్యూ చేసిన మోంటెగ్న్‌ కంపెనీ సీఈవో ‘నీతో వండర్స్‌ చేయిస్తా’ అంటూ ఉద్యోగం ఇచ్చారు. చదువుకు ఆటంకం కలగకూడదని తండ్రి షరతు విధించడంతో మూడు రోజులు ఉద్యోగానికి ఓకే చేశారు. పాఠశాల యాజమాన్యం సహకారంతో ఏడో తరగతిలోనే ఐటీ ఉద్యోగిగా నెలకు రూ.25 వేల జీతంతో చేరాడు.

కొద్దికాలంలోనే అదే హో­దా­తో మరో సంస్థకు మారాడు. నెలకు రూ.45 వేల వేతనంతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో వినూత్నమైన గేమ్‌ డిజైనింగ్‌లో కృషి చేశాడు. మూడురోజులు స్కూలుకు, మూడురోజులు ‘ఇన్‌ఫినిటీ లెర్న్‌’ ఐటీ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా చేస్తూనే, అమెరికన్‌ కంపెనీ ‘రైట్‌ ఛాయిస్‌’ తరపున అక్కడి విద్యార్థులకు కోడింగ్‌ క్లాసులూ నిర్వహించాడీ బాల మేధావి.  

Success Story : మాది పేద కుటుంబం. కానీ చ‌దువులో మాత్రం కాదు... నేను ఈ ఉద్యోగం చేస్తూనే...

అవార్డులు, అవకాశాలు.. 
సిద్ధార్థ ప్రతిభను గుర్తించిన బైజూస్‌ కంపెనీ ‘యంగ్‌ జీనియస్‌’ అవార్డుతో సత్కరించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ బుడతడిని స్వయంగా ఆహా్వనించి భూకంపాలను ముందుగానే గుర్తించే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును అప్పగించింది. పదో తరగతి తర్వాత హైదరాబాద్‌లోనే గటిక్‌ కాలేజిలో ఇంటర్‌లో చేరాడు. మరోవైపు అక్కడి ట్రిపుల్‌ ఐటీలో రీసెర్చ్‌ ఇంజినీరుగానూ పరిశోధన కొనసాగించాడు. ఇంకోవైపు కోడింగ్‌ క్లాసులూ చెబుతున్నాడు. అక్కడితో ఆగకుండా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పైనా ఫ్రీలాన్సర్‌గా చేయసాగాడు. ఇవన్నీ గమనించిన ఐఐటీ–హైదరాబాద్‌ అతడికి ఆర్టిఫిషియల్‌ ఇంజినీరుగా ఉద్యోగాన్నిచ్చింది.

ప్రస్తుతం సిద్థార్థ ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ చదువుతూనే.. ఏడాదిగా ఐఐటీలో ఏఐ, మెషీన్‌ లెరి్నంగ్‌ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నాడు. ఇటీవల శాంసంగ్‌ కంపెనీ జాతీయస్థాయిలో నిర్వహించిన ‘సాల్వ్‌ ఫర్‌ టుమారో’ పోటీలో టాప్‌ టెన్‌లో ఒకడిగా వచ్చా­డు. కృత్రిమ మేధలో అతడి నవీన ఆలోచన అందు­లో ఎంపికైందని సిద్థార్థ తండ్రి రాజ్‌కుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు. 2022–23లో ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్‌ అవార్డునూ సిద్ధార్థ అందుకున్నాడు. ‘సాక్షి’ మీడి­యా చైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. జాతీయస్థాయి న్యూస్‌ ఛానల్స్‌ ఇతని ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి.

 

ఇదే లక్ష్యం.. 
తల్లిదండ్రుల ప్రోత్సాహం, జుకర్‌ బర్గ్, సుందర్‌ పిచాయ్‌ల జీవిత చరిత్రలు, బిల్‌ గేట్స్‌ మాటలు, స్టీవ్‌ జాబ్స్‌ పనితీరుతో తన కలల సౌధాన్ని నిర్మించుకున్నట్టు సిద్ధార్థ చెప్పాడు. ప్రపంచ టాప్‌ ఫైవ్‌లోని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం కంపెనీల్లో రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ విభాగాల్లో ఆరి్టషిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉండాలని, మంచి గేమ్‌ డిజైన్‌ చేయాలనేది తన ఆకాంక్ష అని చెప్పాడు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కూడా చేస్తానని, వీలైతే మైక్రోసాఫ్ట్‌ లాంటి అప్లికేషన్‌కు రూపకల్పన చేయాలనే ఆశయంతో ప్రతి క్షణం కష్టపడుతున్నట్టు తెలిపాడు.

2

Published date : 03 Jan 2025 10:30AM

Photo Stories