Inidan Origin Data Scientist Fired At Canada: విదేశాల్లో యూట్యూబ్ వీడియోలు,చివరికి ఉద్యోగం ఊడిందిగా.. ఇంతకీ ఏం జరిగిందంటే..
మీరు విదేశాల్లో ఉంటున్నారా? ఉద్యోగం చేస్తూ సైడ్ ఇన్‌కమ్ కోసం యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. స్థానిక చట్టాలు, సంస్థల గురించి ఏమాత్రం తెలుసుకోకుండా వీడియోలు తీశారా? ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉంది. ఉన్న ఫళంగా పెట్టెబేడా సర్ధుకుని స్వదేశానికి తిరిగి రావాల్సి వస్తుంది. ఇదేదో బయపెట్టే ప్రయత్నం కాదు. విదేశాల్లో ఉంటున్నవారి సంరక్షణ కోసం కాస్త అవగాహన కల్పించే ఉద్దేశమేనని గుర్తించాలని విజ్ఞప్తి.
వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన మేహుల్ ప్రజాపతి కెనడాలో ఉంటూ స్థానిక ప్రముఖ టీడీ బ్యాంక్‌లో డేటా సైంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మరోవైపు కెనడా దేశం గురించి, అక్కడి సదుపాయాల గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా వివరిస్తుంటాడు. అంతవరకు బాగానే ఉన్నా..కెనడాలో డబ్బు ఆదా చేసేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు గురించి వివరించాడు. ఫలితంగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. దీంతో జాబ్ లేక స్వదేశానికి తిరిగే ప్రయత్నాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఏం జరిగింది?
మెహుల్ ప్రజాపతి టీడీ బ్యాంక్‌లో డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అతని జీతం ఏడాది రూ.81లక్షలు. అవి సరిపోకపోవడంతో డబ్బుల్ని ఆదా చేసేందుకు కెనడాలో విద్యార్ధులకు ఉచితంగా ఆహారం అందించే ఫుడ్ బ్యాంక్‌లు ఉంటాయి. ఆ ఫుడ్ బ్యాంక్‌ల నుంచి విద్యార్ధులు ఆహారాన్ని ఉచితంగా పొందవచ్చు. ఈ ఆహారాన్ని మెహుల్ ప్రజాపతి ప్రతినెల తెచ్చుకుంటున్నట్లు, తద్వారా నెలా ఆహారం, కిరాణా సామాగ్రి ఖర్చు పూర్తిగా తగ్గిపోతుందని వివరించాడు.
అంతేకాదు ఓ వీడియోలో తాను వారానికి సరిపడ బోజనాన్ని ఉచితంగా తెచ్చుకున్నానని, వాటిల్లో పండ్లు, కూరగాయలు, బ్రెడ్, సాస్‌లు, పాస్తా, క్యాన్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయని ఆ వీడియోలో చూపించాడు.
విధుల నుంచి తొలగిస్తూ..
దీంతో టీడీ బ్యాంక్ మెహుల్ ప్రజాపతిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, చర్చిల ద్వారా కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్‌ల నుండి మెహుల్ ఎలా తెచ్చుకుంటాడు. కెనడాలో ఉంటూ విద్యార్ధుల కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంకుల్లో ఆహారాన్ని ఎలా తీసుకుంటారు. ఏడాది సుమారు 80లక్షల జీతం తీసుకుంటున్న మీరు ఫుడ్ బ్యాంక్‌ల నుంచి ఆహారం తీసుకోవడం సరైంది కాదని వార్నింగ్ ఇచ్చింది. అతడిని విధుల నుంచి తొలగించింది. సంబంధిత మెయిల్స్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.