అమెరికాలో అప్పు చేసి చూడు!
Sakshi Education
అప్పులోళ్ల జైళ్ల లాభాలు రుచి మరిగిన బ్యాంకులు, హెల్త్‌కేర్ సంస్థలు నోటీసులైనా పంపకుండానే వారెంట్లు పంపి జైళ్లల్లోకి నెట్టేసి, జరిమానాలతో సహా వసూలు చేస్తున్నాయి. అసలు కంటే వడ్డీ ముద్దయితే, అసలు వడ్డీల మీద జరిమానాలు మరింత ముద్దుగా మారాయి. ఉన్నత చదువులతో అమెరికన్ డ్రీమ్‌కు సోపానాలు నిర్మిస్తున్నామని భావిస్తూ రుణగ్రస్తులవుతున్న విద్యార్థుల కోసం ఉద్యోగాలు ఎదురు చూడకపోయినా జైళ్లు ఎదురుచూస్తున్నాయి.
అప్పు తప్పా, ఒప్పా? చెప్పడం తేలికేం కాదు. ఎప్పుడు బడితే అప్పుడు అప్పు పుట్టని ఊరిలో కాలుబెట్డొద్దని సుమతీ శతకకారుడంటే... అప్పుంటే కంటికి కునుకు పట్టదు... వద్దుగాక వద్దన్నాడు భర్తృహరి. ప్రభుత్వం విదేశీ బ్యాంకులను రప్పించి మరీ మనకు అప్పులు, క్రెడిట్ కార్డులు ఇప్పించేస్తానంటోంది. మనం కాదనలేకనూ ఉన్నాం. కాబట్టి మన బోటివాళ్లకు అప్పూ తప్పదు... నిద్ర కరవుగాకనూ తప్పదు. అమెరికా విద్యార్థులకు ఇప్పటికే నిద్రపట్టడం మానేసింది. సుందర స్వప్న సీమల్లో విహరించాల్సిన రోజుల్లో జైళ్లు, సంకెళ్ల పీడకలలు కంటున్నారు. గత మూడు దశాబ్దాల కాలంలో ఉన్నత విద్య వ్యయం ఆరు వందల శాతం పెరిగింది. ఇంకా పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఏడాదికి 30 వేల డాలర్ల విద్యా రుణంతో పట్టా అందుకున్న రెయన్నా రోకా 14 వేల డాలర్లు చెల్లించి, 70 వేల డాలర్ల రుణ భారంతో క్యాంపస్ నుంచి బయటపడింది. ఐదేళ్ల తర్వాత ఇన్ స్టాల్‌మెంట్లు కడుతూనే ఉన్నా 1,06,000 డాలర్ల బకాయి తేలింది. అదృష్టవంతురాలు, ఆమెకో చిన్న ఉద్యోగం ఉంది. కానీ పట్టాలు పట్టుకొని నిరుద్యోగులుగా తిరుగుతున్నవారి పరిస్థితి? పోనీ 30 ఏళ్ల క్రితం విద్యార్థి రుణాలు తీసుకున్నవారి పరిస్థితి బావుందా? లక్ష కోట్ల డాలర్లను మించిపోయిన విద్యార్థి రుణంలో 3,000 కోట్ల డాలర్ల రుణం 60 ఏళ్లకు పైబడిన వారిది! విద్యార్థి రుణం అంటే కాలేజీ మెట్ల మీద కాలికి ఇనుప గుండై తగులుకొని, కాటికి పోయే దాకా ఈడ్చుకుపోక తప్పనిదిగా మారిపోతోంది.
అమెరికన్ కాంగ్రెస్ జూలై 31న ఆమోదించిన విద్యార్థి రుణం బిల్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15 శాతం లోపు విద్యా రుణాలకే పరిమితం. రిపబ్లికన్ల బిల్లుగా పేరుమోసిన ఆ బిల్లు భారీ ఆధిక్యతతో ఆమోదం పొందింది. విద్యా రుణాలపై లాభాలను ఆశించడం కంటే దుర్మార్గం మరొకటి లేదన్న కొందరు కాంగ్రెస్ సభ్యుల వాదన పట్టించుకున్నవాడు లేడు. ఫెడరల్ సంస్థలకు విద్యారుణాలపై ఏడాదికి 2,000కోట్ల డాలర్ల లాభం! వడ్డీ రేట్లను కనీసం 4.5 శాతం నుంచి గరిష్టంగా 10.5 శాతం వరకు ఉండేలా నిర్ణయించి తగ్గించామని అనిపించుకొని, విద్యార్థి రుణాలపై సబ్సిడీలో కోత పెట్టారు. ఇక బ్యాంకు వడ్డీ రేట్ల సంగతి చెప్పనవసరం లేదు. ఇష్టానుసారం వడ్డీలు, వడ్డీలకు వడ్డీలు, పెనాల్టీల వడ్డింపులతో నేడు రుణం విద్యార్థులకు ఉరితాడుగా మారుతోంది. ‘చిన్న అప్పు చేస్తే నీకు నిద్ర పట్టదు, పెద్ద అప్పు చేస్తే నీకు అప్పిచ్చినవాడికి నిద్ర పట్టదు’ అంటూ రుణ మాయాబజార్ గుట్టును అప్పుడెప్పుడో కీన్స్ విప్పి చెప్పనే చెప్పాడు. అదే అక్షరాలా జరుగుతోంది. బడా వ్యాపార, పారిశ్రామిక కుబేరుల బడా అప్పుల్లాగా ‘విద్యార్ధుల రుణాలకు దివాలా పిటిషన్‌కు అవకాశం లేదు. ఇది జలగల్లాగా పీల్చి పిప్పి చేసే రుణవ్యవస్థను, అప్పులు రాబట్టుకునే యంత్రాంగాన్ని అతి లాభదాయకం చేసింది. రుణం చెల్లిస్తే లాభం. చెల్లించకపోతే నాలుగింతల లాభం. ప్రభుత్వ పరపతి సంస్థలు సైతం విద్యార్థుల బకాయిలపై భారీ లాభాలు పిండుతున్నాయి’ అని విద్యారంగ నిపుణుడు పాట్ గారో ఫాలో వాపోయాడు. యుక్తవయస్కులైన వెంటనే తల్లిదండ్రుల నుంచి వేరుపడి స్వతంత్రంగా బతికే అమెరికన్ యువతలో కొందరు అదృష్టవంతులు సిగ్గువిడిచి వారి గూటికే చేరుతున్నారు. సామాజిక, సంక్షేమ వ్యయాల కోతలతో అంతంతమాత్రంగా ఉన్న పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు పిల్లల చదువులకు ఆసరాగా నిలవలేకపోవడమే కాదు, పిల్లలను తమతో ఉంచుకోలేని దుస్థితికి కుమిలిపోవాల్సివస్తోంది. అర్ధాంతరంగా చదువు వదిలినా రుణ సంకెళ్ల మోత తప్పడం లేదు.
విద్యార్థి రుణం గాలిబుడగ పగలబోతోందా?
ప్రస్తుతం నెలకు 1.5 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తున్నామని చెబుతున్న అమెరికా ప్రభుత్వం అవి ఉన్నత విద్య అవసరం లేని తక్కువ వేతనాల ఉద్యోగాలేనని చెప్పడం లేదు. నిరుద్యోగం 7.4 శాతానికి పడిపోయిందని గొప్పలు పోవడమేగానీ ఉద్యోగులుగా లెక్కిస్తున్న వారిలో పార్ట్‌టైమ్ ఉద్యోగులు కూడా ఉన్నారనేది చెప్పడంలేదు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని మాత్రం చెబుతోంది. 2007లో ఆర్థిక సంక్షోభం బద్దలు కావడానికి కారణమైన రుణాల గాలి బుడగ విస్తరణతోనే అది సాధ్యమవుతోంది. రియల్ ఎస్టేట్ రంగం తర్వాత పెద్దదిగా విద్యార్థి రుణం గాలి బుడగ విస్తరిస్తోంది. ఈ ఏడాది అది లక్ష కోట్ల డాలర్లను మించి ప్రమాదకరస్థాయికి చేరింది. సంక్షోభానికి ముందు స్థోమతలేని వారికి గృహ తనఖా రుణాలను ఇచ్చినట్టే బ్యాంకులు తిరిగి చెల్లించే స్థోమత లేని విద్యార్థులకు రుణాలిస్తున్నాయి. జలగల్లా వదలక పట్టి పీడించే బ్యాంకు నిబంధనలతో విద్యార్థి రుణాల అసలు లక్ష్యమే నీరుగారిపోతోంది. సంపాదనాపరులయ్యాక విద్యార్థులు కార్లు, దుస్తులు వగైరా వస్తు వినియోగదారులుగా ఉత్పత్తి వృద్ధికి కారణం కావడంలేదు. తమ కుటుంబాలకు అండగా నిలవాల్సి వస్తోంది, అప్పులు, వడ్డీల కిస్తీలకు వెచ్చించాల్సివస్తోంది. ఫలితంగా విద్యార్థి రుణం గాలి బుడగ విస్తరిస్తోందే తప్ప దానివల్ల జరుగుతున్న వృద్ధి మాత్రం శూన్యం. వినియోగదారుల, క్రెడిట్ కార్టుల రుణం కంటే కూడా ఎక్కువగా ఉన్న విద్యార్థి రుణం గాలి బుడగ బద్దలై మరో సంక్షోభానికి కారణమవుతుందని కూడా భయపడుతున్నారు. 2018 నాటికి 30 లక్షల మంది కళాశాల పట్టభద్రుల కొరతను ఎదుర్కోవాల్సివస్తుందని జార్జిటౌన్ విశ్వవిద్యాలయం 2012లో అంచనా వేసింది. పేద, మధ్య తరగతి విద్యార్థులు కళాశాలల మొహం చూడటం మానేసిన ఫలితం ఇది. ఇది దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి తీవ్ర ప్రతిబంధకం కాక తప్పదు.
సూట్ కేస్ కుటుంబాలు
నాలుగు లక్షల మంది విద్యార్థులు ఇల్లనేది లేకుండా గడుపుతున్న కుటుంబాల పిల్లలని తాజా అంచనా. కళాశాల చదువును ముగించుకున్న విద్యార్థులు తరచుగా గూడు కరువై అల్లాడాల్సి వస్తోంది. నిస్సహాయులైన వృద్ధ మహిళల్లాగా, యువత కూడా వారం రోజులు ఆశ్రయం కల్పించే చర్చిల చుట్టూ తిరగాల్సి వస్తోంది. 2009తో పోలిస్తే దీర్ఘకాలంగా ఇల్లులేని వారి సమస్యలను నిర్మూలించామని ప్రభుత్వం చెబుతోంది. కానీ 2013లో కూడా ఇంకా దాదాపు 6.5 లక్షలకు పైగా గృహవసతి లేనివారు మిగిలారని నేషనల్ అలయన్స్ టు ఎండ్ హోమ్‌లెస్‌నెస్ తాజా సమాచారం. ఇదిగాక, ఉద్యోగం దొరకడం, ఊడటంపై ఆధారపడి అస్థిర గృహ సమస్యను ఎదుర్కొనే ‘సూట్‌కేస్ కుటుంబాలు’ 20 లక్షలకుపైగానే ఉన్నాయి. పాఠశాల విద్యార్థుల్లో కనీసం 80 లక్షల మంది గత ఏడాది కాలంలో ఏదో ఒక సమయంలో వారం కంటే ఎక్కువగా ఇల్లు లేకుండా బతకాల్సి వచ్చినవారే. కళాశాల నుంచి బిడ్డను చంకనేసుకొని బయటపడ్డ ఒంటరి తల్లుల బాధ వర్ణనాతీతం. ఏ చిన్న పని దొరికినా చేయడం, ఊడిన వెంటనే ఇల్లు ఖాళీ చేసి, బిడ్డను చంకనేసుకొని, పెట్టే బేడా పట్టుకొని ఉద్యోగాన్వేషణ. ఒంటరి జీవితాలు మెరుగు. ఉద్యోగాన్వేషణలో, షాపింగ్ మాల్స్‌లో విండోషాపింగ్‌లతో పగలు వెళ్ల బుచ్చి, రాత్రికి ఏదో ఓ చర్చిని ఆశ్రయిస్తారు. చర్చిల తాత్కాలిక ఆశ్రయాల్లో పగటిపూట ఉండనివ్వరు. తిండిపెట్టరు, మధ్యవయసుకే పండు ముదుసలులుగా మారిన ఒంటరి మహిళలు పగలంతా సిటీ బస్సుల్లోనో, ప్రభుత్వ వైద్య కేంద్రాల విజిటర్స్ కుర్చీల్లోనో గడపాల్సిందే. 2008 నుంచి ఒక దాని తర్వాత ఒకటిగా దాదాపు సగం రాష్ట్రాలు వీధుల్లో, పార్కుల్లో నిద్రపోవడాన్ని నిషేధించాయి!
అప్పులోళ్ల జైళ్లు
వీధుల్లో గడిపినా, అద్దె ఇంట్లో గడిపినా విద్యార్థులనే కాదు, అప్పు చేసిన వారినందరినీ నక్షత్రకులు వెంటాడటం మానరు. డెట్ రికవరీ ఏజెన్సీలు బాగా వెలిగిపోతున్న కాలం ఇది. క్రెడిట్ కార్డు రుణాలు, గృహరుణాల్లాగే, విద్యార్థి రుణాల విషయంలో కూడా ఆస్తుల జప్తును అత్యధిక రాష్ట్రాలు అనుమతిస్తున్నాయి. జప్తు చేసుకోడానికి ఏమీ లేని వారి వద్ద ఏం జప్తు చేస్తారు? జైళ్లల్లోకి తోస్తున్నారు. 19వ శతాబ్దంలోనే అంతరించిపోయాయనుకున్న అప్పులోళ్ల జైళ్లు ఇప్పుడు అమెరికాలో నోళ్లు తెరుస్తున్నాయి. ఇంకా దేశంలో ఎక్కడా ప్రత్యేకించి అప్పులోళ్ల జైళ్లు నిర్మించలేదు. రాని బాకీల కోసం జైలు శిక్షను విధించే ముందు రుణగ్రస్తునికి చెల్లించే స్థోమత లేదేమోనన్న విషయాన్ని పరిశీలించాలనే నిబంధన కొన్ని రాష్ట్రాల్లో ఉంది. కానీ కోర్టులు వాటిని పట్టించుకోవడం లేదు. రాని బాకీల కోసం జైలుకు పంపిన రాష్ట్రాల్లో ఆరిజోనా, ఫ్లోరిడా, ఇల్లినాయిస్, ఇండియానా, ఓక్లహామా, వాషింగ్టన్ మొదలైనవి ఉన్నట్టుగా ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ ఏప్రిల్ రెండో వారంలో తెలిపింది. ఇక రుణగ్రస్తులను జైళ్లపాలు చేయడానికి వీల్లేని రాష్ట్రాల్లో అది అక్రమంగా జరుగుతోంది. అలాంటి రాష్ట్రం ఒహాయో గత ఏడాది కనీసం 5,000 మందిని అప్పులోళ్ల జైళ్లలో వేసింది. జాక్ డాలే కథ మరింత విచిత్రమైనది. 1990 నాటి మాదకద్రవ్య వినియోగం కేసులో 1,500 డాలర్ల జరిమానా చెల్లించనందుకు మూడున్నరేళ్లు జైల్లో గడిపి, ఎప్పటికీ తీరని జరిమానాను, జరిమానాకు జరిమానాలను ఏళ్ల తరబడి చెల్లిస్తూనే ఉన్నాడు. ఒహాయోలాగా చట్టవిరుద్ధమైన అప్పులోళ్ల జైళ్ల నుంచి అప్పు చెల్లిస్తేనే బయటపడతారు. లేదా రీసెటిల్‌మెంట్ పేరిట జరిమానాలతో సహా మరింత పెద్ద అప్పుకు అంగీకరించి బయటపడాల్సిందే. అప్పులోళ్ల జైళ్ల లాభాలు రుచి మరిగిన బ్యాంకులు, హెల్త్‌కేర్ సంస్థలు నోటీసులైనా పంపకుండానే వారెంట్లు పంపి జైళ్లల్లోకి నెట్టేసి, జరిమానాలతో సహా వసూలు చేస్తున్నాయి. అసలు కంటే వడ్డీ ముద్దయితే, అసలు వడ్డీల మీద జరిమానాలు మరింత ముద్దుగా మారాయి. ఉన్నత చదువులతో అమెరికన్ డ్రీమ్‌కు సోపానాలు నిర్మిస్తున్నామని భావిస్తూ రుణగ్రస్తులవుతున్న విద్యార్థుల కోసం ఉద్యోగాలు ఎదురుచూడకపోయినా జైళ్లు ఎదురుచూస్తున్నాయి. ప్రపంచానికి మరో షాక్ ఇవ్వడానికి అమెరికా విద్యార్థి రుణం గాలి బుడగ ఎదురుచూస్తోందా?
-పిళ్లా వెంకటేశ్వరరావు

Published date : 03 Aug 2013 11:45AM