Canada Study Visa New Rules: కెనడాలో చదవాలనుకుంటున్నారా? ఈ కొత్త రూల్స్ తెలిస్తే..
ఉన్నత విద్యను అభ్యసించడానికి ఏటా వేలాది మంది భారతీయ విద్యార్థులు కెనడా వెళ్తుంటారు. అక్కడి యూనివర్సిటీల్లో చదివే విదేశీ విద్యార్థుల్లో ఎక్కువమంది మనవాళ్లే ఉంటారు. అయితే తాజాగా విదేశీ విద్యార్థుల కోసం కెనడా విధించిన కొత్త ఇమిగ్రేషన్ విధానం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తుంది. తాజా నిబంధనల వల్ల స్టూడెంట్ స్టడీ వీసా సక్సెస్ రేటు ఎంతన్నది ప్రశ్నార్థకంగా మారింది. కెనడా విధించిన కొత్త వీసా నిబంధనలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.
ప్రావిన్షియల్ అటెస్టేషన్ లెటర్ (PAL) అవసరం:
కెనడాలో స్టూడెంట్ వీసాకు అప్లై చేయాలనుకునేవాళ్లు తప్పనిసరిగా ప్రొవిజినల్ అటెస్టేషన్ లెటర్(PAL)ను జతచేయాల్సి ఉంటుంది. లేదంటే వీసాను రిజెక్ట్ చేస్తారు. ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుఏయేట్ డిప్లొమా, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్సుల కోసం కెనడా వెళ్లాలనుకునేవారికి ఇది తప్పనిసరి. అయితే ప్రస్తుతం మాస్టర్స్ లేదా మెడిసిన్ ప్రోగ్రామ్స్ చదవాలనుకునే విద్యార్థులకు మాత్రం అటెస్టేషన్ లెటర్‌ను జత చేయాల్సిన అవసరం లేదు.
వాళ్లకు శుభవార్త
మాస్టర్స్ ప్రోగ్రామ్‌ల కోసం పోస్ట్-స్టడీ వర్క్ వీసాను మూడేళ్లకు పొడిగించారు. దీనివల్ల కెనడాలో ఉద్యోగం సంపాదించుకునేందుకు, అక్కడే స్థిరపడేందుకు మరింత సమయం కలిసి వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే..పోస్ట్ స్టడీ వర్క్ వీసాలను అందించే ప్రోగ్రామ్‌లను ఎంచుకోవాలి. ఈ విషయంలో ప్రైవేట్ కాలేజీలతో జాగ్రత్తగా ఉండాలి.
స్పౌస్ వీసా వర్క్ పర్మిట్‌లో మార్పులు
ఇప్పటివరకూ కెనడాలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులు (Undergraduate courses) చదువుతున్న విద్యార్థులు తమ జీవిత భాగస్వాములకు స్పౌస్ వీసా (Spouse Visa) స్పాన్సర్ చేసే అవకాశం ఉండేది. సవరించిన వీసా నిబంధనల ప్రకారం, కెనడాలోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోని వారు తమ జీవిత భాగస్వాములకు వీసా స్పాన్సర్ చేసే అవకాశం లేదు. మాస్టర్స్, డాక్టోరల్, లా, మెడిసిన్ కోర్సులు చదువుతున్న వారికి మాత్రమే ఈ అవకాశం పరిమితం. కాబట్టి కొత్త నిబంధనలను అనుసరించి, స్టూడెంట్ వీసాలను అప్లై చేస్తే మంచిదంటున్నారు నిపుణులు.