Skip to main content

విదేశీ చదువులు - అర్హత పరీక్షలు

దేశవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థుల లక్ష్యం... విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ చూపటం ద్వారా యువత విదేశీ విద్య కలను సాకారం చేసుకోవచ్చు.
జీమ్యాట్, జీఆర్‌ఆ, టోఫెల్ వంటి టెస్ట్‌ల్లో ప్రతిభతో ప్రముఖ విదేశీ యూనివర్సిటీలు/ ఇన్‌స్టిట్యూట్‌ల్లో ప్రవేశం పొందవచ్చు. ఈ నేపథ్యంలో విదేశీ విద్యకు అవసరమైన ముఖ్య పరీక్షలు, అర్హతలు, పరీక్ష విధానం వివరాలపై ప్రత్యేక కథనం...

జీమ్యాట్
జీమ్యాట్ (గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్) పరీక్ష పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి అంతర్జాతీయ ప్రామాణికంగా ఉంది. జీమ్యాట్ స్కోరు ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఆరు వేలకు పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
  • రిజిస్ట్రేషన్: జీమ్యాట్ రిజిస్ట్రేషన్‌కు ముందు అభ్యర్థులంతా ఒక అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఒకసారి అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్న వారంతా ఫోన్ ద్వారా(రీజియన్) జీమ్యాట్ రిజిస్ట్రేషన్, రీషెడ్యూల్, ఎగ్జామ్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు.
  • పరీక్ష విధానం: జీమ్యాట్‌ను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష (అనలిటికల్ రైటింగ్ అసెస్‌మెంట్; ఇంటిగ్రేటెడ్ రీజనింగ్; వెర్బల్ ఎబిలిటీ; క్వాంటిటేటివ్ ఎబిలిటీ) విభాగాల్లో 800 పాయింట్లకు ఉంటుంది. పరీక్ష సమయం మూడున్నర గంటలు, 600 మార్కులు సాధిస్తే మంచి ఇన్‌స్టిట్యూట్‌ల్లో ప్రవేశం పొందవచ్చు. జీమ్యాట్ స్కోరుకు మూడేళ్ల గుర్తింపు ఉంటుంది.
  • జీమ్యాట్-రైట్ టైం: సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో స్లాట్ బుక్ చేసుకోవడం మంచిది. ఈ సమయంలో డిమాండ్ కూడా ఎక్కువ కాబట్టి కనీసం మూడు నెలల ముందు స్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థులు గరిష్టంగా ఏడాదికి అయిదు సార్లు పరీక్షకు హాజరు కావచ్చు. ప్రతి స్లాట్‌కు మధ్య 16 రోజుల వ్యవధి తప్పనిసరి.
  • రెండు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
  • వివరాలకు వెబ్‌సైట్: www.mba.com/india

జీఆర్‌ఈ (గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్)
విదేశీ యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంజనీరింగ్, సైన్స్ విభాగాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి జీఆర్‌ఈ అవకాశం కల్పిస్తోంది.
  • రిజిస్ట్రేషన్: అభ్యర్థులు ముందుగా వ్యక్తిగత జీఆర్‌ఈ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఆన్‌లైన్ విధానంలో జీఆర్‌ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోన్, మెయిల్ ద్వారా పరీక్షకు రిజిస్ట్రేషన్, రీషెడ్యూలింగ్, ఎగ్జామ్ కాన్సిలేషన్ చేసుకోవచ్చు.
  • పరీక్ష విధానం: పరీక్షలో అనలిటికల్ రైటింగ్; వెర్బల్ స్కిల్స్; క్వాంటిటేటివ్ స్కిల్స్; ఎక్స్‌పెరిమెంటల్ సెక్షన్‌లు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటల 45 నిమిషాలు.
  • పరీక్ష హాజరు అవకాశం: పరీక్ష ఏడాది మొత్తం జరుగుతుంది. అభ్యర్థుల హాజరు, తేదీల పరంగా ఎలాంటి పరిమితి లేదు. ఏడాదికి గరిష్టంగా అయిదుసార్లు పరీక్షకు హాజరు కావచ్చు. ప్రతి స్లాట్‌కు మధ్య నెల రోజుల వ్యవధి తప్పనిసరి.
  • బెస్ట్ స్కోర్: జీఆర్‌ఈలో 600 స్కోరు పొందితే మంచి ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం లభిస్తుంది. స్కోరు గుర్తింపు కాలపరిమితి అయిదేళ్లు.
  • వివరాలకు వెబ్‌సైట్: www.ets.org/gre

శాట్.. ఫర్ యూజీ స్టడీస్
విదేశాల్లో యూజీ స్థాయిలో ఇంజనీరింగ్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదవాలనుకునే ఔత్సాహికుల కలలను సాకారం చేసే పరీక్ష స్కాలాస్టిట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్).
  • పరీక్ష విధానం: రీడింగ్; రైటింగ్; మ్యాథమెటిక్స్ విభాగాల్లో శాట్ పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటల 20 నిమిషాలు.
  • రిజిస్ట్రేషన్: శాట్ ప్రతి ఏటా ఏడుసార్లు జరుగుతుంది. అభ్యర్థులు పరీక్షకు హాజరు పరంగా పరిమితి లేదు. శాట్ స్కోరుకు ఐదేళ్లు గుర్తింపు ఉంటుంది.
  • స్కోరు: శాట్ స్కోరు స్కేల్ ప్రతి సెక్షన్‌కు 200 - 800 మధ్యలో ఉంటుంది. మొత్తం మూడు సెక్షన్లలో కలిపి అభ్యర్థులు గరిష్టంగా రెండు వేలకుపైగా స్కోరు సాధిస్తే మంచి కళాశాలల్లో ప్రవేశం లభిస్తుంది.
  • వెబ్‌సైట్: www.sat.collegeboard.org

టోఫెల్
విద్యార్థుల ఇంగ్లిష్ నైపుణ్యాన్ని పరీక్షించేందుకు అంతర్జాతీయ ప్రామాణిక పరీక్ష టెస్ట్ ఇన్ ఇంగ్లిష్ యాజ్ ఫారెన్ లాంగ్వేజ్ (టోఫెల్). 125కుపైగా దేశాలు, దాదాపు పదివేల యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు అభ్యర్థుల్లో ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని టోఫెల్ స్కోర్ ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
  • పరీక్ష విధానం: టోఫెల్ పరీక్ష నాలుగు విభాగాల్లో ఉంటుంది. అవి.. రైటింగ్, రీడింగ్, స్పీకింగ్, లిజనింగ్. ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్ష కాలవ్యవధి నాలుగ్నర గంటలు
  • రిజిస్ట్రేషన్: టోఫెల్‌కు సంవత్సరం పొడవునా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పరీక్షను వివిధ తేదీల్లో స్లాట్‌ల వారీగా నిర్వహిస్తారు. టోఫెల్ పరీక్షకు హాజరు విషయంలో పరిమితి లేదు. పరీక్షకు హాజరైన ప్రతిసారీ 170 డాలర్ల ఫీజు చెల్లించాలి.
  • బెస్ట్ స్కోరు: టోఫెల్ పరీక్ష 120 పాయింట్లకు ఉంటుంది. గరిష్టంగా 80 పాయింట్లు పొందితే మంచి ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి అభ్యర్థులకు ఆహ్వానం లభిస్తుంది. స్కోరు కాల పరిమితి రెండేళ్లు.
  • వెబ్‌సైట్: www.ets.org/toefl

ఎల్‌శాట్
అమెరికాలో న్యాయ విద్యను అభ్యసించాలనుకునే ఔత్సాహికులకు తప్పనిసరి పరీక్ష.. ఎల్‌శాట్ (లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్). ఈ టెస్ట్ స్కోరు ఆధారంగానే అమెరికన్ బార్ అసోసియేషన్ గుర్తింపు ఉన్న న్యాయ కళాశాలల్లో ప్రవేశ దరఖాస్తులకు అర్హత లభిస్తుంది.
  • పరీక్ష విధానం: పరీక్షలో రీడింగ్ కాంప్రహెన్షన్; లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్, ఎక్స్‌పరిమెంటల్ సెక్షన్, ఎస్సే లేదా రైటింగ్ విభాగాలు ఉంటాయి. కాలవ్యవధి మూడున్నర గంటలు.
  • రిజిస్ట్రేషన్: ఎల్‌శాట్ మన దేశంలో ప్రతి ఏటా నాలుగుసార్లు జరుగుతుంది. ఈ సంవత్సరం అక్టోబర్ 4న, డిసెంబర్ 6న నిర్వహించనున్నారు.
  • స్కోరు: ఎల్‌శాట్ స్కోరు స్కేల్ 120 నుంచి 180 వరకు ఉంటుంది. ఇందులో 140 నుంచి 160 వరకు స్కోరు పొందితే పేరున్న కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. ఎల్‌శాట్ స్కోరు గుర్తింపు కాల పరిమితి అయిదేళ్లు.
  • వెబ్‌సైట్: www.lsac.org

ఐఈఎల్‌టీఎస్
ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్‌టీఎస్).. యూకే, ఆస్ట్రేలియా దేశాల్లోని ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశానికి అవసరమైన ఇంగ్లిష్ ప్రావీణ్య పరీక్ష.
  • పరీక్ష విధానం: పరీక్షలో రైటింగ్, రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ విభాగాలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటల 45నిమిషాలు.
  • రిజిస్ట్రేషన్: ఐఈఎల్‌టీఎస్ నెలకు నాలుగుసార్లు చొప్పున ఏడాదికి 48 సార్లు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్, హాజరు విషయంలో అభ్యర్థులకు ఎలాంటి పరిమితి లేదు.
  • స్కోరు: ఐఈఎల్‌టీఎస్ స్కోరు బ్యాండ్స్ రూపంలో 1 నుంచి 9 మధ్య ఉంటుంది. ఇందులో ఆరు బ్యాండ్లు పొందితే ప్రవేశం లభిస్తుంది. స్కోరు గుర్తింపు కాల పరిమితి మూడేళ్లు.
  • వెబ్‌సైట్: www.ielts.org

విదేశీ టెస్టులు-విజయవ్యూహాలు
  • వెర్బల్ ఎబిలిటీ: ఏ పరీక్షలోనైనా ఈ సెక్షన్ ఉంటుంది. ఇందులో రాణించాలంటే.. కరెక్ట్ ఎక్స్‌ప్రెషన్, ఎఫెక్టివ్ ఎక్స్‌ప్రెషన్, ప్రాపర్ డిక్షన్‌లపై పట్టు సాధించాలి. వీటికోసం గ్రామర్, యాంటానిమ్స్, సినానిమ్స్‌లో నైపుణ్యం పొందాలి. రీడింగ్ కాంప్రహెన్షన్‌కు సంబంధించి ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
  • క్వాంటిటేటివ్ ఎబిలిటీ: అభ్యర్థులకు అర్థమెటిక్, అల్‌జీబ్రా, ఎలిమెంటరీ జామెట్రీలో గట్టి పట్టుండాలి. జామెట్రీలో డయూగ్రమ్స్, గ్రాఫ్స్, బార్స్, సర్కిల్స్, లైన్ గ్రాఫ్స్‌పై ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి.
  • అనలిటికల్ రైటింగ్: ముఖ్యంగా వ్యాసాల(ఎస్సే)పై పట్టు సాధించాలి. అనాలజీస్, సెంటెన్స్ కంప్లీషన్, రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగాల్లో నైపుణ్యం అవసరం. ఇందుకోసం ఇంగ్లిష్ న్యూస్ పేపర్లను చదవడం, ఇంగ్లిష్ న్యూస్ ఛానెళ్లను చూడటంతో మంచి ఫలితాలను సాధించవచ్చు.

లాంగ్వేజ్ పరీక్షలు.. పొందాల్సిన నైపుణ్యాలు
  • లిజనింగ్: ఈ విభాగం ద్వారా విద్యార్థి ఆయా దేశాల స్లాంగ్‌ను అర్థం చేసుకునే తీరుని పరీక్షిస్తారు. సంభాషణను విని దాని ఆధారంగా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సంభాషణ కేవలం అమెరికన్ యూసలోనే ఉంటుంది. ఈ విభాగంలో రాణించాలంటే.. ‘స్కిల్ డెవలపింగ్ వ్యూ’లో చదవాలి. ఇంగ్లిష్ సినిమాలు, ఇంగ్లిష్ న్యూస్ ఛానల్స్‌లో డిస్కషన్స్‌ను పరిశీలించడం మేలు చేస్తుంది. స్టాండర్డ్ గ్రామ ర్ బుక్స్ కంటే వొక్యాబులరీని పెంచే పుస్తకాలు చదవడంతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
  • రీడింగ్: క్రమం తప్పకుండా ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు చదవాలి. కేవలం ఇంగ్లిష్ సాహిత్యానికి పరిమితమైన అంశాలతో పాటు బిజినెస్, సైన్స్, ఆర్ట్స్‌పై వచ్చే వ్యాసాలు చదవడం మంచిది.
  • రైటింగ్: ఈ విభాగంలో విద్యార్థి ఇంగ్లిష్ రాత నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. గ్రమటికల్ వొకాబ్యులరీనీ పెంపొందించుకోవాలి. ఐఈఎల్‌టీఎస్ మొ దటి సెక్షన్‌లో గ్రాఫ్ లేదా టేబుల్ ఇచ్చి దానిపై విశ్లేషణ రాయమంటారు. ‘యూక్టివ్, ప్యాసివ్ వారుుస్’, ‘సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్’, ‘కాంప్లెక్స్ సెంటెన్స్ ఫార్మేష న్’పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి.

రెండింటి మధ్య తేడా ఇదే..
ఐఈఎల్‌టీఎస్.. టోఫెల్ రెండు పరీక్షల ఉద్దేశం..విధానం ఒకటైనా.. నిర్వహణ తీరులోనే తేడా ఉంది. ఐఈఎల్‌టీఎస్ ‘పేపర్ బేస్డ్ టెస్ట్’. ఈ పరీక్షకు హాజరవ్వాలంటే.. బ్రిటిష్ కౌన్సిల్ నిర్దేశించిన టెస్ట్ సెంటర్లకు వెళ్లాల్సిందే. లిజనింగ్ విభాగంలో రికార్డెడ్ ఆడియోను వినాల్సి ఉంటుంది. టోఫెల్ పూర్తిగా ‘ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్’. అందుకే దీనిని టోఫెల్ ఐబీటీ అని పిలుస్తారు. నిర్దేశిత సెంటర్లలో కంప్యూటర్ సిస్టమ్‌కు అనుసంధానం చేసిన ‘హెడ్‌ఫోన్స్’ ద్వారా లిజనింగ్, స్పీకింగ్ సెక్షన్లలో ప్రతిభను చూపాలి.

గ్లోబల్ దృక్పథంతో
విదేశీ విద్య ఔత్సాహికులు, తమ ఆసక్తికి అనుగుణంగా రాణించేందుకు గ్లోబల్ దృక్పథంతో వ్యవహరించాలి. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీ వంటి స్టాండర్డ్ విభాగాల విషయంలో పుస్తక పరిజ్ఞానంతో రాణించవచ్చు. ఆర్గ్యుమెంట్ బేస్డ్, ప్యాసేజ్ బేస్డ్ ప్రశ్నల విషయంలో అకడమిక్ నైపుణ్యాలకంటే.. వాస్తవ పరిస్థితులపై అవగాహన అవసరం. ముఖ్యంగా ఎస్సే రైటింగ్‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయి మ్యాగజీన్లు వాటిలో వినియోగిస్తున్న పదజాలంపై దృష్టి పెట్టాలి. ఇక సబ్జెక్ట్ టెస్ట్‌ల విషయంలో తమ అకడమిక్ స్థాయి కంటే కొంచెం ఎక్కువ పరిధిలో నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలి.
- రాఘవేంద్ర, హెడ్, స్టడీ ఓవర్‌సీస్ వింగ్, టైమ్ ఇన్‌స్టిట్యూట్


ఇంగ్లిష్.. ఆందోళన వద్దు
టోఫెల్, ఐఈఎల్‌టీఎస్ వంటి ఇంగ్లిష్ పరీక్షలకు హాజరయ్యే భారత విద్యార్థులు ఆందోళన చెందకూడదు. ముఖ్యంగా లిజనింగ్ విషయంలో దృష్టి కేంద్రీకరిస్తే సరిపోతుంది. ఎగ్జామినర్‌తో నేరుగా సంభాషించాల్సి ఉంటుంది. దీంతో ఎగ్జామినర్ తమను ఎలా ట్రీట్ చేస్తారో అనే భయం ఉంటుంది. ఎగ్జామినర్లు విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తారని గుర్తించాలి. పరీక్షలోని అన్ని విభాగాల్లో రాణించే క్రమంలో విద్యార్థులు బేసిక్ గ్రామర్‌తోపాటు ఇంగ్లిష్ దిన పత్రికలు,న్యూస్ ఛానెల్స్‌ను, వాటిలో చర్చలను క్రమం తప్పకుండా పరిశీలించాలి.
- ఎల్.ధనశేఖరన్, హెడ్-ఎడ్యుకేషన్‌యూకే, సౌత్ ఇండియా
Published date : 28 Aug 2015 01:08PM

Photo Stories