Skip to main content

గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్)

జీమ్యాట్.. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకబీ-స్కూళ్లలో ఎంబీఏ చేయాలని కలలుకనే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష. భారతదేశంలో దాదాపు వందకు పైగా విద్యాసంస్థలు ప్రామాణికంగా తీసుకునే ఈ పరీక్షలో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, పరీక్ష విధానంపై విశ్లేషణ...
ఏటా 30 వేల మందికి పైగా: తొలిసారిగా
1953లో గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (జీమ్యాక్) ఈ పరీక్షను ప్రవేశపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది, భారత్ నుంచి దాదాపు 30 వేల మంది ఈ పరీక్షకు హాజరవుతారని అంచనా.
అర్హత: 18 ఏళ్లు నిండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు జీమ్యాట్ పరీక్ష రాయడానికి అర్హులు. ఈ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే అది ఐదేళ్ల వరకు చెల్లుబాటవుతుంది.
స్కోర్ రేంజ్: జీమ్యాట్ స్కోర్ రేంజ్ 200 నుంచి 800 వరకు ఉంటుంది.

పరీక్ష విధానం
కంప్యూటర్ బేస్డ్/ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్ష వ్యవధి మూడున్నర గంటలు. ఇందులో మూడు ఆబ్జెక్టివ్.. ఒక సబ్జెక్టివ్ విభాగంతో కలిపి మొత్తం నాలుగు విభాగాల్లో 91 ప్రశ్నలుంటాయి.
 1. అనలిటికల్ రైటింగ్ అసెస్‌మెంట్:
  ఈ విభాగంలో ఒక అంశం గురించి 30 నిమిషాల కాల వ్యవధిలో విశ్లేషణాత్మకంగా ఉదాహరణలతో రాయాల్సి ఉంటుంది. ఆ అంశంలోని ముఖ్యాంశాలు, అనుకూల-ప్రతికూలతలు, పరిష్కార మార్గాలను తెలియజేస్తూ రాయాలి.

  సక్సెస్ టిప్స్: ఈ విభాగంలో మంచి స్కోర్ సాధించాలంటే ఒక అంశాన్ని క్షుణ్నంగా చదివి అర్థం చేసుకుని సొంత శైలిలో రాసే నేర్పు సాధించాలి. వ్యాసాన్ని సరళంగా, అర్థవంతంగా 300 పదాలకు మించకుండా రాయాలి. ఈ విభాగంలో అతి ముఖ్యమైనది సమయపాలన. కేటాయించిన అరగంటలో 5 నిమిషాలను వ్యాసాన్ని చదవడానికి, 20 నిమిషాలను విశ్లేషణాత్మకంగా రాయడానికి, చివరి 5 నిమిషాలను రాసిన దాన్ని సమీక్షించుకునేందుకు కేటాయించాలి.

 2. ఇంటిగ్రేటె డ్ రీజనింగ్:
  ఈ విభాగం చూడటానికి సులువుగా ఉన్నా సునిశిత పరిశీలన అవసరం. ప్రధానంగా మల్టీ సోర్స్ రీజనింగ్, గ్రాఫిక్స్ ఇంటర్ ప్రిటేషన్, టూ పార్ట్ అనాలిసిస్, టేబుల్ అనాలిసిస్ వంటి 12 ప్రశ్నలుంటాయి. 30 నిమిషాల వ్యవధిలో నిర్దిష్ట సమాధానాన్ని కనుగొనాల్సి ఉంటుంది.

  సక్సెస్ టిప్స్: ఈ విభాగంలో మంచి స్కోర్ సాధనకు అర్థమెటిక్, ఆల్‌జీబ్రా, జామెట్రీ, ప్రాబబిలిటీ, స్టాటిటిక్స్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. క్రిటికల్ థింకింగ్ అలవర్చుకోవాలి. ఒక్కో ప్రశ్నకు 2 నిమిషాల్లో సమాధానం ఇవ్వగల వేగం, అలాగే కచ్చితత్వం అవసరం.

 3. క్వాంటిటేటివ్ ఎబిలిటీ:
  ఈ విభాగంలో డేటా సిఫీషియన్సీ నుంచి 18 ప్రశ్నలు, ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 19 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 37 ప్రశ్నలను 75 నిమిషాల్లో పూర్తిచేయాలి.

  సక్సెస్ టిప్స్: ఈ విభాగం మొత్తం గుణాత్మకంగా ఉంటుంది. ఇందులో మంచి స్కోర్ సాధించాలంటే మ్యాథ్స్ స్కిల్స్ తప్పనిసరి. గ్రాఫికల్ డేటాను విశ్లేషించడం, చార్ట్స్, టేబుల్స్‌లో ఇచ్చిన గణాంకాలు, సమాచారం ఆధారంగా విలువలు కనుగొనడం వంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి.

 4. వెర్బల్ ఎబిలిటీ:
  ఈ విభాగంలో ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షించే గ్రామర్, వొకాబ్యులరీ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. రీడింగ్ కాంప్రెహెన్షన్, క్రిటికల్ రీజనింగ్, సెంటెన్స్ కరెక్షన్ వంటి 41 ప్రశ్నలకు 75 నిమిషాల్లో సమాధానం ఇవ్వాలి.

  సక్సెస్ టిప్స్: రోజులో కనీసం రెండు గంటలు దీనికి కేటాయించాలి. ప్రామాణిక ఇంగ్లిష్ వ్యాసాలు చదవడం, సారాంశాన్ని సంక్షిప్తంగా రాయడం, వొకాబ్యులరీపై పట్టు అవసరం.
  వెబ్‌సైట్: ఔత్సాహిక అభ్యర్థులు www.mba.com వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


గుర్తుంచుకోవాల్సినవి
 1. ఏడాదిలో ఐదు సార్లు కంటే ఎక్కువ దరఖాస్తు చేయకూడదు.
 2. ఒకసారి పరీక్షకు హాజరయిన 16 రోజుల తరువాతనే రెండోసారి దరఖాస్తు చేసుకోవాలి. ఈ లోపు చేయకూడదు.
 3. రిజిస్ట్రేషన్, పరీక్ష విషయంలో తప్పనిసరిగా జీమ్యాక్ నిబంధనలను పాటించాలి.

గతేడాది నుంచి కొత్త నిబంధనలు: అభ్యర్థి తను రాసిన సమాధానాల ఆధారంగా పరీక్ష స్కోర్‌ను చూసుకునే అవకాశం కల్పించారు. అభ్యర్థి స్కోర్ విషయంలో సంతృప్తి చెందకపోతే రద్దు చేసుకోవచ్చు. దీనికి రెండు నిమిషాల సమయం ఉంటుంది. స్కోర్ సరిపోతుందనుకుంటే యాక్సెప్ట్, సరిపోదనుకుంటే క్యాన్సిల్ ఆప్షన్ క్లిక్ చేయాలి. రెండు నిమిషాల్లో ఏ ఆప్షన్ క్లిక్ చేయకపోతే ఆటోమేటిక్‌గా స్కోర్లు రద్దయిపోతాయి. ఒకసారి రద్దు చేసుకున్న స్కోరును నిర్దిష్ట ఫీజు చెల్లించి పరీక్ష జరిగిన రోజు నుంచి 60 రోజుల లోపు తిరిగి పొందొచ్చు. సెక్షన్ల వారీగా స్కోర్లను తెలుసుకోవచ్చు.

Career Guidance

Published date : 29 Aug 2016 01:29PM

Photo Stories